What is this Rajanna

What is this Rajanna: మద్యానికి కాదు, వ్యసనానికి వ్యతిరేకమట!

What is this Rajanna: తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ ముగియనుంది. ఇలాంటి సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త వివాదానికి తెరలేపారు. ప్రభుత్వ మద్యం పాలసీకి విరుద్ధంగా సరికొత్త రూల్స్‌ను తెరమీదకి తెచ్చారు. కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసేవారు ఖచ్చితంగా పాటించాల్సిందేనంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా, తన అనుచరులతో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు.

తాను తెచ్చిన కొత్త రూల్స్ మద్యం షాపులకు టెండర్లు వేసేవారిని ఇబ్బంది పెట్టడానికి కాదని, తన సెగ్మెంట్ ప్రజల ఆరోగ్యం బాగుపడితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని, అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను మద్యానికి వ్యతిరేకం కాదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిమీద తాగుతూ తాగుడుకు బానిసలుగా మారుతున్న విధానానికి మాత్రం వ్యతిరేకమన్నారు. మరి ఇంతకీ ఎమ్మెల్యే నయా రూల్స్‌ను పరిశీలిస్తే… వైన్ షాపులు ఊరికి బయట మాత్రమే ఉండాలి. వైన్ షాపుకు అనుబంధంగా సిట్టింగ్ నడపొద్దు. అదేవిధంగా, బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దు. వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు. వైన్ షాపు ఓనర్లు సిండికేట్ అయ్యి ఇష్టారీతిలో ధరలు పెంచితే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రూల్స్‌లో అతి కీలకమైనది ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలనే క్లాజ్. ఇక షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వేసి నష్టపోకూడదని మనవి చేస్తున్నామంటూ ప్లెక్సీల్లో పొందుపర్చారు. వీటితో పాటు, ప్రజలకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తమ ఉద్దేశమని ఊదరగొట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే సూచనతో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా, నియోజకవర్గంలో తాను విధించిన కొత్త రూల్స్ గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.

Also Read: Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే కొత్త వైన్ షాపులకు టెండర్స్ తక్కువగా పడుతున్న నేపథ్యంలో, వాటిని పెంచే ప్రయత్నం చేస్తోన్న ఎక్సైజ్ శాఖకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో 26 షాపులకు గాను ఒక్కో షాప్ నుంచి రెండు సంవత్సరాలకు కలిపి ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కింద ఒక కోటీ 10 లక్షలు కాగా, మొత్తంగా 28 కోట్లకు పైగా ఆదాయం రానుంది. ఇక టెండర్లు దాఖలు చేసే సమయంలో దరఖాస్తు ఫీజు కింద దాదాపు 4 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని అంచనా. కానీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందని టాక్. ఎందుకంటే, ఇతర మండలాలకు చెందిన వ్యక్తులు ఎవరూ టెండర్ వేయవద్దని చెబుతుండడంతో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేనట్టేనని ఎక్సైజ్ శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. ఓ వైపు దరఖాస్తు ఫీజులతో ఆదాయం పెంచాలని చూస్తోన్న అధికారులకు రాజగోపాల్ రెడ్డి రూపంలో గట్టి షాక్ తగిలినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, రాజగోపాల్ రెడ్డితో ప్రభుత్వ పెద్దలు మాట్లాడి రూల్స్‌కు బ్రేక్ వేయిస్తారో లేక లైట్ తీసుకుంటారో చూడాలి మరి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *