Kavitha plan

Kavitha plan: కవితకు చెక్‌ పెట్టేందుకు కేటీఆర్‌ పాదయాత్ర?

Kavitha plan: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ కుటుంబ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాల మీద కవిత వ్యాఖ్యలు, కీలక నాయకులు హరీశ్‌రావు, సంతోష్‌రావు మీద తీవ్ర స్థాయి ఆరోపణలు, పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌, తర్వాత ఆమె రాజీనామా… ఇలా రకరకాల పరిణామాలతో ఇప్పటికే పొలిటికల్‌ టెంపరేచర్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే… ఇన్ని రోజులూ… ఈ మొత్తం ఎపిసోడ్‌లో కవిత మాటే గట్టిగా వినిపించింది. ఆమె ఏం మాట్లాడినా… అడపా దడపా తప్ప, బీఆర్‌ఎస్‌ వైపు నుంచి పెద్దగా రియాక్షన్స్‌ రాలేదు. నిన్న మొన్నటిదాకా గులాబీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న నాయకురాలు, పైగా అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ హోదా… ఇలా రకరకాల లెక్కలేసుకుంటూ సంయమనం పాటించాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. మామూలుగా ఇదే పరిస్థితిలో వేరే నాయకులు ఎవరున్నా… ఆ రివర్స్‌ అటాక్‌ వేరే లెవల్‌లో ఉండేది. కానీ… కేసీఆర్‌ కుమార్తె కావడంతో… నాయకులెవరూ తొందరపడలేదు. ఒకానొక సందర్భంలో ఆమె గురించి ఎవరూ మాట్లాడవద్దని ఇంటర్నల్‌గా ఆదేశాలు కూడా ఇచ్చిందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఎంతైనా ఆమె… తమ అధినేత కూతురు కాబట్టి… ఇప్పుడు అనవసరంగా తొందరపడి నోరు పారేసుకుంటే… రేపు కాలం కలిసొచ్చి మళ్లీ వాళ్లు వాళ్లు ఒకటైతే… అనవసరంగా మేం ఇరుక్కుపోతామన్న అభిప్రాయమే ఉందట ఎక్కువ మందిలో. అందుకే… ఆచితూచి, జాగ్రత్తగా, శ్రద్ధగా… విమర్శలు మొదలు పెట్టారంట గులాబీ నాయకులు.

మరో పక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ అవినీతి చేశారనేది కవితకు తెలుసు అనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాలను కవిత వెల్లడిస్తుంది. పార్టీని అడ్డంపెట్టుకొని ఎవరు ఏం చేశారనేది బయటపెడుతుండడంతో ఎప్పుడు ఎవరి పేరు మీడియా ముందు చెబుతుందోనని జంకుతున్నారంట నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరడంతో కవిత విమర్శలకు పదును పెట్టింది. తెలంగాణ కోసం కృషిచేసిన కేసీఆర్‌పై అవినీతి మరకకు కారణం హరీశ్ రావు, సంతోష్ రావు అని విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను తెరమీదకు తెచ్చింది. వారు సంతోష్ రావుతో కలిసిన బిజినెస్‌లు, లావాదేవీలను బయటపెట్టింది. దీంతో కవిత రాబోయే రోజుల్లో మరింత విమర్శలకు పదును పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా ఎవరి పేర్లు బయటపెడుతుంది? ఆమె లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌తో ప్రస్తుతం బీఆర్ఎస్, జాగృతి రెండు వర్గాలుగా విడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలుస్తుంటే, మరో వర్గం హరీశ్ రావుకు సంఘీభావంగా నిలుస్తున్నది. దీంతో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానం కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసినా విజయం సాధించలేకపోవడం… తాజాగా కవిత సస్పెన్షన్‌తో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదనే ప్రచారం ఊపందుకున్నది.

ALSO READ  Palleku Peddalu: లోకేష్‌తో కలిసి కనిగిరికి అనంత్‌ అంబానీ..!

Also Read: Malla Reddy Big Plan: ఇంతకీ మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమిటి?

ఎమ్మెల్సీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత ‘జై కేసీఆర్’ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు, జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫొటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసినది కాదని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయినా కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వర్గాన్ని తనవైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌పై గౌరవం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సీనియర్లపై అసంతృప్తితో ఉన్న క్యాడర్‌లో తనపై సానుభూతి పెరిగి కచ్చితంగా తనకు అండగా నిలుస్తారని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, కవిత వ్యూహాత్మక అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 21 నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజులపాటు జరుగనున్నాయి. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబురాలను జాగృతి సంస్థ తరఫున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో కవిత ఎపిసోడ్‌తో బీఆర్ఎస్ పార్టీ మరింత దారుణంగా తయారైంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి జవసత్వాలు నింపడంతో పాటు, కవితకు చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమవుతున్నారట. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేసీఆర్ కేటీఆర్‌కు సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోనూ పర్యటనలు చేయాలని రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నుంచి వీడిపోయిన ఎమ్మెల్యేలను, వారి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలవబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి, ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు, కవితకు చెక్ పెట్టడానికి కేటీఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారట. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పర్యటనలు చేయనున్న కేటీఆర్ పార్టీ శ్రేణులను ఏ విధంగా బలోపేతం చేస్తారు అనేది చూడాలి మరి.

ALSO READ  The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మార్పు.. నాని సినిమాకు కొత్త సమ్మర్ ప్లాన్?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *