Visaka Mayor Game

Visaka Mayor Game: వైసీపీ కోట బద్దలు కొట్టారు ఇలా..

Visaka Mayor Game : గ్రేటర్ విశాఖపట్నం మేయర్‌పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ క్లైమ్యాక్స్‌కి చేరుకుంది. ఏప్రిల్ 19వ తేదీన, అంటే ఎల్లుండి కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ నుండి సమాచారం వెళ్లింది. అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్‌గా హరివేంకట కుమారి నిలవనున్నారు. ఇక, బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 74 మంది బలం అవసరం ఉంది. మొత్తం కార్పొరేటర్లు 98 మంది ఉండగా.. ఒక స్థానం ఖాళీగా ఉంది. కార్పొరేటర్‌ ఓట్లు 97 కాగా, ఎక్స్ ఆఫీషియో ఓట్లు మరో 14 ఉన్నాయి. మొత్తం ఓట్లు 111 కాగా, 2/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యం అవుతుంది. అంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 74 ఓట్ల. నాలుగు రోజుల కిందటి వరకూ మెజారిటీకి నాలుగు ఓట్ల దూరంలో ఉన్న కూటమి బలం… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా చాణిక్యతతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసినట్లు సమాచారం అందుతోంది. ఇక 19న జరిగే మేయర్‌ అవిశ్వాస ఓటింగ్‌లో కూటమి విజయం లాంఛనమేనని తెలుస్తోంది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు గెల్చుకుంది. ఇక అధికారం చేపట్టాక ఏపీలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు రాష్ట్ర టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఆయన నేతృత్వంలో ఇటీవల కోఆప్షన్‌ ఎన్నికల్లోనూ పట్టు సాధించారు. నేడు అత్యంత కీలకమైన విశాఖ మేయర్‌ పీఠం కూటమి ఖాతాలో పడేలా…
అందుకు కావాల్సిన 74 కార్పొరేటర్ల మద్ధతును సునాయాసంగా సాధించేలా ప్రణాళికలు రచించారు పల్లా. బెదిరింపులు, కొనుగోళ్లతో పని లేకుండానే… పూర్తిగా రాజకీయ వ్యూహాలతోనే వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లను కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలలో చేరేలా ప్రణాళికలు అమలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పటికీ.. ఎక్కడా ఈగోలకు పోకుండా… దర్పం ప్రదర్శించకుండా… సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటూ, అటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను కలుపుకుంటూ వెళ్తూ… వారి ఆలోచనలు, వ్యూహాలను సమీకరించుకుని వెళ్లడం వల్లే పల్లా ఈ విజయం సాధించారని పరిశీలకులు భావిస్తున్నారు.

Visaka Mayor Game: వైసీపీకి పూర్తిగా బలం అనుకున్న వ్యక్తులనే కూటమివైపు తిప్పడంలో పల్లా రాజకీయ చతురత కనబడుతుంది. నాలుగేళ్లుగా గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ని వైసీపీ పాలిస్తోంది. ఇక్కడ ఇంకా అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. కానీ వైసీపీ నేతృత్వంలోని కార్పొరేష‌న్ పనులకు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. కార్పొరేటర్లలోనూ ఈ అసంతృప్తి ఉంది. దీన్ని ఒడిసి పట్టుకున్న కూటమి నేతలు 58 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ కార్పొరేటర్లను తమవైపు ఆకర్షించడం మొదలు పెట్టి సఫలీకృతులయ్యారు. ఇలా 58 మంది సభ్యులున్న వైసీపీ సంఖ్యను 30 లోపునకే తీసుకొచ్చారు. కూటమి బలాన్ని 70కి చేర్చారు. అవిశ్వాసం ప్రవేశ పెట్టి నెగ్గాలంటే ఇంకా నలుగురు వైసీపీ సభ్యుల్ని తమవైపు తిప్పుకోవాలి. ఇక్కడే పల్లా శ్రీనివాస్ తన వ్యూహాలకు పదునుపెట్టారు.

ఆఖరి నిమిషంలో కార్పొరేటర్లు ప్లేటు ఫిరాయించకుండా ఉండాలంటే కూటమికి లాయల్‌గా ఉండేవారినే తీసుకోవాలని భావించారు. జిల్లాలోని కూటమి పార్టీల నేతలందర్నీ కోఆర్డినేట్‌ చేసుకుని… అస్త్ర శస్త్రాలను సంధించారు. ఈ క్రమంలోనే పక్కా వైసీపీకి హార్డ్‌ కోర్‌గా ఉన్న బెహ్రా భాస్కర్‌ రావు కుటుంబాన్ని కూటమిలోకి లాగారు‌. అలా వైసీపీ కోఆప్షన్‌ సభ్యుడు అయిన బెహరా భాస్కరరావు కుటుంబం నుండి.. కార్పొరేటర్లుగా ఉన్న ఆయన భార్య స్వర్ణలత శివదేవి, కోడలు జ్యోత్స్నలు జనసేనలో చేరిపోయారు. మరోవైపు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ రెడ్డి కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ రెండు కుటుంబాల చేరికల్లోనూ పల్లా ఎత్తుగడలు బాగా పనిచేశాయి. దీంతో కూటమి బలం ఫైనల్‌గా 75కు చేరింది. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు పల్లా శ్రీనివాస్‌.

Also Read: Bhumana Hydrama: భూమన డ్రామా కంపెనీ వారి ‘గో-నాటకం’

Visaka Mayor Game: మరోవైపు వైసీపీ క్యాంపు రాజకీయాలకు ధీటైన జవాబు చెబుతున్నారు పల్లా నేతృత్వంలోని కూటమి నేతలు. బొత్స నేతృత్వంలో వైసీపీ రాజకీయ చతురతను ప్రదర్శించాలని చూసినా.. ముందే పసిగట్టిన పల్లా… కూటమికి లాయల్‌గా ఉండే వ్యక్తులనే ఎంచుకున్నారు. పూర్తి రాజకీయ చతురతను ప్రదర్శించడంతో పాటూ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేల సహకారాన్ని పూర్తి స్థాయిలో వాడుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు బొత్స శ్రీలంకలోని కొలంబియాలో క్యాంపు ఏర్పాటు చేస్తే… సంఖ్యా బలాన్ని నిలుపుకునేందుకు కూటమి కార్పొరేటర్లను మలేషియాకు తరలించారు పల్లా. కూటమి మేయర్‌ అభ్యర్థిగా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్‌ని ఎంపిక చేశారు.

గెలుపు కోసం కూటమిలోని మూడు పార్టీలు కలిసి పనిచేస్తుండగా… సమన్వయం చేసుకునే బాధ్యతను పల్లా సమర్థవంతంగా నిర్వహించారు. విశాఖక చెందిన ఎంపీ భరత్‌తో పాటూ, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాసులు, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌, వంశీ కృష్ణ యాదవ్‌ అందరూ కలిసి వ్యవహారాన్ని చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లారు. వీరితో పాటూ గండి బాబ్జీ, సీతంపేట సుధాకర్‌, వీఎంఆర్డీ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, పల్లా బంధువు మురళి లాంటి నేతలు తెరవెనుక మంత్రాంగాన్ని చక్కబెట్టారు. వీరందరినీ సమస్వయం చేసిన పల్లా… కూటమి సత్తా చాటారు. ఇక 19న జరిగే మేయర్‌ అవిశ్వాసంలో కూటమి గెలుపు లాంఛనమే కాబోతోంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *