Vennupotu vs Vimukthi

Vennupotu vs Vimukthi: ప్రజలపై నిరసలు చేసే ఏకైక పార్టీ వైసీపీ!

Vennupotu vs Vimukthi: ప్రజల తీర్పును ‘వెన్నుపోటు’గా అభివర్ణించి నిరసనలు చేయడం ప్రజాస్వామ్యంలో ఒక్క వైసీపీకే చెల్లింది. మరోవైపు, కూటమి తమ ఘనవిజయాన్ని, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది. జనసేన విడిగా.. “రాష్ట్రానికి జగన్‌ పీడ విరగడైంది” అంటూ సంబరాలకు పిలుపునిచ్చింది. ఈ పోటా పోటీ కార్యక్రమాల్లో ఏ పక్షం పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2024, జూన్‌ 4న వెలువడ్డాయి. వైసీపీని ఇంచుమించు భూస్థాపితం చేసి, కూటమికి అఖండ విజయం చేకూర్చిన ఫలితాలవి. ఈ విజయానికి ఈ జూన్‌ 4వ తేదీకి సరిగ్గా ఏడాది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓ కార్యక్రమంతో ముందుకొస్తోంది. జూన్‌ 4న ‘వెన్నుపోటు దినం’ పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రజా తీర్పును వైసీపీ ‘వెన్నుపోటు’గా అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి, తాము 2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేసినా, కూటమి పార్టీలు ఇంకా ఎక్కువ హామీలు ఇవ్వడంతో.. ప్రజలు వాటికి ఆకర్షితులై కూటమికి ఓటేశారని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ప్రజలు తనకి వెన్నుపోటు పొడిచారన్న భావనలో జగన్‌ ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వైసీపీ “వెన్నుపోటు దినం” ప్రజలపై నిరసన కార్యక్రమంగానే చూడాల్సి వస్తోంది అంటున్నారు అనలిస్టులు. వైసీపీ మాత్రం.. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, అందుకే వెన్నుపోటు దినంగా జరపాలని నిర్ణయించినట్లు చెబుతోంది. కూటమి అధికారంలో వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది.

Also Read: Indigo: 4,000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న ప‌క్షి.. పైలెట్ ఏం చేశాడంటే..

Vennupotu vs Vimukthi: వచ్చీ రాగానే పించన్ల పెంపు అమలు చేసింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసింది. రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభించింది. మెగా డీఎస్సీ ప్రకటించింది. గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇక సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ నెల నుండే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమల్లోకి వస్తున్నాయి. ఉచిత గ్యాస్‌ సిండర్ల పథకం ఆల్రెడీ అమలవుతోంది. ఇలా చూసుకుంటూ పోతే… సూపర్‌ సిక్స్‌తో పాటూ, మిగతా హామీల్లో అనేకం తొలి ఏడాదిలోనే అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఏ ప్రభుత్వానికైనా మేనిఫెస్టో మొత్తం ఉన్న ఫలంగా అమలు చేయడం అసాధ్యం. ఐదేళ్ల పాలనలో మళ్లీ ఎన్నికలకు వెళ్లే నాటికి ఒక పార్టీ మేనిఫెస్టోలో ఎంత శాతం మేర హామీలను నెరవేర్చింది అని ప్రజలు చూస్తారు, ఓట్లేస్తారు. తొలి ఏడాదిలోనూ అన్నీ అమలైపోతాయని ప్రజలు కూడా కోరుకోరు, భావించరు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా.. చేతిలో మంత్ర దండం పట్టుకుని ఉండదు. ప్రజలకు కూడా బాగా అర్థమయ్యే విషయం ఇది. కానీ వైసీపీ మాత్రం “వెన్నుపోటు” అంటూ నిరసన చేస్తోంది అంటే.. ప్రజా తీర్పును అవమానిస్తూ, ప్రజలపై నిరసన చేస్తున్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నేతలే.. ఇందులో పాల్గొనాలా వద్దా అని సందేహం వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. వైసీపీ చేస్తోంది బ్లండర్‌ మిస్టేక్‌ అని.

మరోవైపు, కూటమి ప్రభుత్వం అదే రోజున ‘రాష్ట్రానికి విముక్తి’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కూటమి రెడీ అవుతోంది. గ్రామీణ స్థాయికి వెళ్లి ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూనే, కూటమి పనితీరును ప్రజల్లో హైలైట్ చేయాలని సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. “ప్రజల మధ్యకు వెళ్లండి, ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించండి. సంక్షేమం, అభివృద్ధిపై చర్చ పెట్టండి” అని చంద్రబాబు సూచించారు. రోడ్లు బాగుపడ్డాయని, పెట్టుబడులు వస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు సీఎం చంద్రబాబు. దీంతో వైసీపీ నిరసనలు ప్రజల్లో ఎంతవరకు ఆదరణ పొందుతాయన్నది సందేహంగానే కనిపిస్తోంది. కూటమి తమ విజయం, పనితీరును ప్రజలకు చేరవేయడంలో సఫలమైతే, వైసీపీ ‘వెన్నుపోటు దినం’ ప్రభావం ఘననీయంగా తగ్గే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: Telangana Bhu Bharathi: నేటి నుంచి తెలంగాణ రెవెన్యూ సదస్సులు… ప్రజల వద్దకే అధికారులు..

Vennupotu vs Vimukthi: జూన్‌ 4 కథ ఇంతటితో అయిపోదు. అసలు స్టోరీ మరొకటుంది. అదే జనసేన చేపడుతున్న.. ‘రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది’ అనే కార్యక్రమం. ఏపీ రాజకీయాల్లో టీడీపీ గెలుపోటములు అనేకం చవి చూసింది. కానీ గత ఎన్నికల్లో జనసేన గెలుపుకు ఓ ప్రత్యేకత ఉంది. 2019 ఎన్నికల్లో 140 స్థానాల్లో పోటీచేసిన జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అధినేత పవన్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడారు. ఆ ఎన్నికల్లో జనసేన స్ట్రయిక్‌ రేట్‌ 0.7. ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో జెండా ఎగరేసింది. స్ట్రయిక్‌ రేట్‌ 100. వందశాతం స్ట్రయిక్‌ రేట్‌ సాధించిన పార్టీగా దేశంలోనే సరికొత్త హిస్టరీ నెలకొల్పింది. దీనికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూటమి ఏర్పాటులో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర గురించి. పవన్‌ కళ్యాణ్‌ అనుకోకుంటే.. కూటమి ఏర్పాటయ్యేదే కాదు. కూటమిలోని మూడు పార్టీలకు ఈ స్థాయి విజయం దక్కేదే కాదు. ఈ అపూర్వ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటోంది జనసేన. జూన్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఉదయం సంక్రాంతి ఉట్టిపడేలా, సాయంత్రం దీపావళి కాంతులు కనపడేలా కార్యక్రమాలు ఉండాలని శ్రేణులకు సందేశం పంపింది. “సుపరిపాలనకు ఏడాది” పేరుతో ఉదయం మహిళలు రంగవల్లులు వేసి కూటమి విజయాన్ని పండగలా చేసుకుంటారు. “రాష్ట్రానికి పట్టినవ పీడ విరగడై ఏడాది” పేరుతో సాయంత్రం దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చి పండగ జరుపుతారు. జనసేన జాతరలో వైసీపీ నిరసలు, నిష్టూరాలు ఎలివేట్‌ అవ్వడం కష్టమే అంటున్నారు పరిశీలకులు.

జగన్‌ రాష్ట్రాన్ని దివాళా తీయించి, అప్పుల్లో ముంచి వెళ్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ అప్పులు, వడ్డీలు కట్టుకుంటూనే.. ప్రజలకు పథకాలిస్తోంది, హామీలనూ నెరవేరుస్తోంది. మరి దీన్ని వెన్నుపోటు అని వైసీపీ ప్రజల్ని ఏవిధంగా నమ్మించాలని అనుకుంటుందో మేధావులకే అర్థం కావడం లేదు. టీడీపీ వైసీపీ ఆరోపణలకు కౌంటర్లిస్తూనే.. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనూ, అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఇక జనసేన సంక్రాంతి, దీపావళి పండుగలను కలిపి జరుపుతోంది. మరి ప్రజలు ఏ పార్టీ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగమవుతారో, వైసీపీ వర్సెస్‌ కూటమి.. ఇద్దరిలో ఎవరికి తమ మద్ధతు తెలుపుతారో వేచి చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *