Vemulawada Temple Issue: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ పనులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వేములవాడ ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఆ మేరకు శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. వేములవాడ రాజన్న గర్భాలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని నిర్మాణాలు తొలగించి సువిశాలమైన ప్రాంగణంతో ఆలయాన్ని బాగు చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం రాజన్న ఆలయంలో నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేయడంతో పాటు VTDAను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అథారిటీ కనుమరుగు కాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆలయ రూపు రేఖలు మార్చేందుకు సమాయత్తం అయింది. జూన్ 15 నుండి రాజన్న ఆలయంలో నిర్మాణాల ప్రక్రియకు శ్రీకారం చుడతారని, అప్పటి నుండి భీమన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయింది.
ప్రధాన ఆలయం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం చుట్టూ ఉన్న కోటి లింగాలు, కాల భైరవుడు, విఠలేశ్వరుడు, రాజగోపురంతో పాటు ప్రాకారంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. వేములవాడ ఆలయం నుండి బద్ది పోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారి మీదుగా నూతన నిర్మాణాలు చేపట్టనున్నట్టుగా చెప్తున్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని విస్తరించాలన్న ఆలోచనతో ఈ ప్రతిపాదనలు చేశామని అంటున్నారు. ఇప్పటి వరకు భీమన్న ఆలయంలో భక్తుల దర్శనాలకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోగా, రాజన్న గుడి వద్ద కూడా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు జూన్ 15 నుంచి ఎలాంటి విస్తరణ పనులు చేపట్టడం లేదంటూ ఆలయ అధికారులు చెబుతున్నారు.
Also Read: India vs Pakistan: భారత్ ఆసియా కప్ నుంచి వైదొలగినట్లు బీసీసీఐ నిర్ణయం
Vemulawada Temple Issue: ఇకపోతే రాజన్న ఆలయంలో మాత్రమే మొక్కులు తీర్చుకునే ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉంటాయి. తెలంగాణ చత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల భక్తులు వేములవాడ రాజన్న సేవలో తరిస్తుంటారు. వచ్చే ఏడాది మేడారం జారత జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నుండి రాజన్నను దర్శించుకునేందుకు లక్షలాది మంది వచ్చే అవకాశం కూడా ఉంది. మరో వైపున ఈ ఆలయానికి వచ్చే భక్తులు రాజన్నను దర్శించుకునే ముందు కోడె మొక్కులు తీర్చుకునే సాంప్రాదాయాన్ని కూడా పాటిస్తారు. వీరంతా రాజన్నని దర్శించుకోకుండా.. భీమన్న ఆలయంలో పూజలు చేసుకోమంటే.. ఆసక్తి చూపే అవకాశం లేదు.
యాదాద్రి ఆలయాన్ని పునర్నిమాణం చేసినప్పుడు గర్భాలయం సమీపంలోనే బాలా ఆలయాన్ని ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారని, వేములవాడ విషయంలో మాత్రం ఏకంగా ఆలయ ప్రాంగణాన్నే మార్చి వేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రాజన్న గుడి ప్రాంగణంలో నిర్మాణాలు చేపడుతున్నారు కానీ గర్భాలయంలో కాదు కాబట్టి.. రాజన్న దర్శనానికి అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తే బావుంటుందన్న ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే వేములవాడ రాజన్న ఆలయంలో నూతన నిర్మాణాల పేరిట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్థానికంగా కూడా విముఖత వ్యక్తం అవుతోంది. రాజన్న ఆలయం కారణంగా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 5 నుండి 6 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారందరి ఉపాధి లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.
Also Read: Pawan Kalyan: జూన్ 1 నుండి థియేటర్లు బంద్.. వాయిదా పడనున్న హరి హర వీరమల్లు..?
Vemulawada Temple Issue: ఇక ఈ అంశం రాజకీయ వ్యవహారంగా మారింది. విస్తరణ పనులు చేపట్టకూడదంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. అసలు ఓవైపు ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు పుట్టడం లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రే అంటున్నారని, ఒకవేళ ఆలయ పనులు మొదలుపెట్టిన్నా నిధుల లేమితో పనులు అర్ధాంతరంగా ఆగిపోతే ఇబ్బందిగా మారుతుందని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత పనుల విస్తరణ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 14న అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆలయ పరిరక్షణ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వేములవాడ పట్టణ బంద్‌లో భాగంగా వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది.
కాగా ఆలయ విస్తరణ పనులపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు సదుద్దేశంతో చేపట్టామని, ఏళ్ల కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. ఎక్కడ కూడా ఆలయంలోని గర్భగుడిని ఆటంకం కలిగించకుండా దాని చుట్టూ నిర్మాణాలు జరపనున్నామని ఆయన అంటున్నారు. ఈ పనులపై శృంగేరి పీఠాధిపతి అనుమతులు తీసుకొని చేపట్టామని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా జూన్ 15 నుంచి విస్తరణ పనులను చేపట్టడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అన్ని విషయాలపై చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని అంటున్నారు. ఆలయంలో దర్శనాల నిలిపివేత, భీమేశ్వరాలయంలో దర్శనాలు అంటూ జరుగుతున్నదంతా వట్టి ప్రచారమేనన్నారు. దీనిపై ఆలయ ఈవో స్వయంగా క్లారిటీ కూడా ఇచ్చారు. మొత్తానికి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
