Veeraiah Murder Case: ఏప్రిల్ 22. సమయం రాత్రి 7 గంటల 45 నిమిషాలు. ఒంగోలు మంగమూరు రోడ్డు సర్కిల్‌కు సమీపంలో ఉన్న పద్మ టవర్స్ రెండో అంతస్తులో ఉన్న ఓ వ్యాపార కార్యాలయంలోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. వచ్చిన దుండగులు అక్కడ ఎక్కువ సమయం లేరు. రెండే రెండు నిమిషాల్లో వచ్చిన పని పూర్తి చేసుకుని పరారయ్యారు. ఆ రెండు నిమిషాల్లో వాళ్లు చేసిన ఘాతుకం ఏంటో తెలుసా. 53 కత్తిపోట్లతో ఓ వ్యక్తి శరీరాన్ని తూట్లు తూట్లు పొడిచారు. అప్పటికీ కసి తీరక కర్కషంగా గొంతు కోశారు. వారి చేతుల్లో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లాలో ప్రముఖ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి.
3 నెలల కిందటే ప్లాన్ చేశారు. రెండు వారాల ముందే ఒంగోలు శివారులోని ఓ లాడ్జిలో మకాం వేశారు. పక్కాగా రెక్కీ నిర్వహించి హత్య చేశారు. నిందితులు టోల్ గేట్లు దాటేందుకు ఇబ్బంది లేకుండా బైకుల్లో వచ్చారు. సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే అవకాశం లేకుండా సెల్ ఫోన్లు క్యారీ చేయలేదు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా ముసుగులు ధరించారు. ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కువ టైమ్ తీసుకోకుండా, మర్డర్ స్కెచ్‌ని పక్కాగా అమలు చేసి పారిపోయారు. ఒక్కో కత్తి పోటుకు లక్ష. 50కి పైగా కత్తిపోట్లకు వసూలైంది 50 లక్షల ఎక్‌ట్రా నజరానా. సుపారీ మొత్తం కోట్లల్లో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి సుపారీ హత్యలు జరిగేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌తో పాటూ ఇంతటి క్రూరమైన హత్యలు అంతరించిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాలో ఇటువంటి అత్యంత కిరాతకమైన హత్య జరగడం అన్నది.. ఏపీ ఇమేజ్‌కే మచ్చ తెచ్చే విషయం. ఈ ఘటనను జిల్లా ఎస్పీ నుండి, హోం మంత్రి, ముఖ్యమంత్రి దాకా అంత సీరియస్‌గా తీసుకోవడానికి కారణం కూడా అదే. మృతుడు వీరయ్య చౌదరి రాజకీయాల్లో యాక్టివ్ పర్సన్ కాబట్టి, అందులోనూ అధికార పార్టీ నేత కాబట్టి.. దర్యాప్తులో రాజకీయ ప్రమేయానికి అవకాశాలెక్కువ. కానీ రాజకీయం అంటించుకోకుండా.. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తేనే ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరుగుతుంది, ఇలాంటి దారుణాలకు మరొకరు పాల్పడకుండా మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ దిశగా టాస్క్‌ని సమర్థవంతంగా నిర్వహించింది.. ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం, మరీ ముఖ్యంగా జిల్లా ఎస్పీ దామోదర్.
Veeraiah Murder Case: ఈ కేసు చేధనలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పోషించిన రోల్ అత్యంత కీలకం. ఎస్పీ చొరవ, ఆయన కేసును ఫాలో అప్ చేసిన విధానం, స్వయంగా రంగంలోకి దిగి కేసును ఛేదించేందుకు చేసిన పోలీస్ ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఘటన జరిగిన వెంటనే, ఎస్పీ దామోదర్ మెరుపు వేగంతో స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తును పర్యవేక్షించారు. స్వయంగా క్రైం సీన్‌ను పరిశీలించి, ఆధారాల సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 24న మరోసారి క్రైం సీన్‌ను సందర్శించి, హత్య జరిగిన విధానాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తూ, కార్యాలయ సిబ్బంది మరియు సాక్షులతో మరిన్ని విచారణలు నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ఈ కేసు దర్యాప్తు కోసం ప్రారంభంలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు.
Also Read: Who is BJP President: రేసులో మిగిలింది సంజయ్, రాజేందర్‌లేనా?
ఆ తర్వాత, కేసు సంక్లిష్టతను గమనించి, బృందాల సంఖ్యను 20కి పెంచారు. దాదాపు 50 మంది పోలీసులు 24/7 పనిచేసేలా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాజకీయ కక్షలు, రియల్ ఎస్టేట్ వివాదాలు, వ్యక్తిగత శత్రుత్వాలు, లిక్కర్ సిండికేట్, రేషన్ మాఫియా, ల్యాండ్, సాండ్ నుండి రొయ్యల చెరువుల బిజినెస్ దాకా… అనేక డైమెన్షన్స్‌లో దర్యాప్తు చేశాయి. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రైం సీన్‌లో సేకరించిన వేలిముద్రలు.. గత నేరస్థుల డేటాతో సరిపోలక పోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో సాంకేతిక ఆధారాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో హంతకులు ఉపయోగించిన వాహనాల ఆచూకీని కనుగొనడం దర్యాప్తును మలుపు తిప్పింది.
Veeraiah Murder Case: ఏప్రిల్ 25న, హంతకులు ఉపయోగించిన ఒక వైట్ స్కూటీని చీమకుర్తి బైపాస్ రోడ్డు వద్ద ఒక డాబా సమీపంలో గుర్తించారు. ఈ స్కూటీపై రక్తపు మరకలు ఉండటం దర్యాప్తుకు కీలకమైన ఆధారంగా మారింది. స్కూటీ యజమాని, చీమకుర్తికి చెందిన ఒక స్థానిక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ సమాచారం ఆధారంగా ఏప్రిల్ 25 నాటికి, అమ్మనబ్రోలు వాసి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అలాగే, అనేక అక్రమ వ్యాపారాలతో సంబంధం ఉన్న ముప్పవరపు సురేష్ అనే మరో కీలక నిందితుడిని కూడా గుర్తించారు. ఇక పొన్నూరు మండలం నిడుబ్రోలు వాసులైన షేక్ అమీర్, పరిటాల గోపీ, అశోక్‌కుమార్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఎస్పీ దామోదర్ నాయకత్వంలోని పోలీస్ బృందాలు దర్యాప్తును పరుగులు పెట్టించాయి. ఎస్పీ దామోదర్ తక్షణ స్పందన, వేగవంతమైన చర్యలు, హత్య జరిగిన కొద్ది గంటల్లోనే దర్యాప్తు బృందాల ఏర్పాటు, క్రైం సీన్ నుంచి ఆధారాల సేకరణ, సీసీటీవీ, ఫోన్ రికార్డులు, వేలిముద్రల విశ్లేషణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, సమన్వయ నైపుణ్యం ఫలితంగా, సంక్లిష్టమైన ఈ సుపారీ హత్య కేసును కేవలం రోజుల వ్యవధిలో 80% ఛేదించగలిగారు ప్రకాశం జిల్లా పోలీసులు. స్వయంగా క్రైం సీన్‌ను పరిశీలించడం, బృందాలను సమర్థవంతంగా నడిపించడం, టెక్నాలజీని వాడుకున్న విధానం ద్వారా పోలీస్ శాఖ సామర్థ్యానికి ఒక ఉదాహరణగా నిలిచారు ఎస్పీ దామోదర్ అండ్ టీమ్. ఈ కేసు పోలీసులకు ఒక కఠిన పరీక్ష అయినప్పటికీ, వారం రోజులు తిరగక ముందే దాని అంతు చూశారు ఎస్పీ దామోదర్.