YCP Visha Nagulu On USRA: నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ప్రస్తుతం URSA (అర్సా)పై జరుగుతోన్న విష ప్రచారం అలాంటిదే. URSA డొల్ల కంపెనీ అనేందుకు ఒక్క ఆధారం కూడా చూపకుండానే నిందలు వేయడం మొదలుపెట్టారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో, ఫేక్ ప్రచారాలను వ్యాప్తి చేయడంలో డబుల్ పీహెచ్‌డీ చేసిన పార్టీ రంగంలోకి దిగిపోయింది. కొందరు కమ్యూనిష్టులు కూడా ఆ పార్టీ మాయలో పడిపోయారు. ఎందుకంటే మాతృ భూమికి మేలు చేయాలని ముందుకొచ్చే ఎన్నారైలంటేనే వారికి గిట్టదు. ఎన్నారైలు అన్నా, ఎన్నారై పారిశ్రామికవేత్తలు అన్నా వారికి ఎందుకంత ద్వేషమో తెలీదు. భవిష్యత్ అంతా ఏఐ యుగమే. అలాంటిది రాష్ట్రానికి ఏఐ, డేటా కంపెనీలు తెస్తుంటే ఇంత కక్ష్య ఎందుకు? టీసీఎస్‌కి భూములు ఇవ్వడంపైనా ఇదే తరహాలో విష ప్రచారం చేశారు. ఒక రకంగా TATA కంపెనీల విశ్వసనీయతపైనే మూర్ఖంగా దాడి చేశారు. రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడానికి వెనకాడరు. ఏపీకి కంపెనీలు వస్తుంటే ఎందుకు అంత పగబట్టారో మానవ మాత్రుడికి అర్థం కాదు. భవిష్యత్తులో ఏపీకి ఏ కంపెనీలు, పెట్టుబడులు రాకూడదనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నది మాత్రం ఇక్కడ స్పష్టం.
అమెరికా బేస్డ్ కంపెనీగా URSA రిజిస్టర్ అయ్యింది. అమెరికన్ ఐటీ కంపెనీలకు చెందిన పలువురు డైరెక్టర్లు టీమ్‌గా ఏర్పడి ఈ స్టార్టప్ సంస్థను స్థాపించారు. URSAలో డైరెక్టర్లుగా ఉన్న వారంతా.. అమెరికా వ్యాపార రంగంలో బాగా స్థిరపడిన వారు… అక్కడి ఐటీ కంపెనీల్లో వేల కోట్ల టర్నోవర్ సాధిస్తున్న వారే. ఏపీలో దాదాపు 5700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రపోజల్‌తో ముందుకొచ్చిన URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై అసత్యాలు, అర్థ సత్యాలతో దుష్ట ప్రచారం ఇంటెన్షనల్ గానే జరుగుతోందని అర్థమౌతోంది. విదేశాల్లో లిస్ట్ అయిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే… రాత్రికి రాత్రే ఇక్కడకొచ్చేసి భారీ కార్పొరేట్ ఆఫీసులు తెరవాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సంస్థలైనా ఇనిషియల్‌గా చిన్న కార్యాలయాన్ని తెరిచి, బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. అర్సా చేసింది కూడా అదే. అయితే ‘ఊరు పేరు లేని అర్సా’ అంటూ కొన్ని మీడియా చానళ్లు ప్రచారం మొదలెట్టాయి.
ప్రభుత్వాలేదో ఇంత సింపుల్‌గా మోసపోతాయా అన్నట్లు వారు చేస్తున్న ప్రచారం చూస్తే.. హాస్యాస్పదం అనిపించక మానదు. అటు కంపెనీ వైపు నుండి కానీ, ఇటు ప్రభుత్వ వర్గాల నుండి కానీ స్పందనో, వివరణో వచ్చే లోపే URSAపై దొంగ కంపెనీగా ముద్ర పడిపోయింది. అర్సా ఏపీలోనే కాదు.. ఏపీలో మొదలుపెట్టి దేశ వ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలు, ముఖ్యంగా.. ఏఐ, డేటా సాఫ్ట్‌వేర్ రంగాల్లో విప్లవాత్మక సేవలు అందించే దిశగా సుదీర్ఘమైన ప్రణాళికతోనే వచ్చినట్లు స్పష్టమవుతోందని బిజినెస్ వర్గాల్లో జెన్యూన్ టాక్ ఉంది. తెలంగాణ సర్కార్‌తోనూ ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ నెలకొల్పేందుకు ఎంవోయూ చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అధునాతన ఏఐ, డేటా సెంటర్లు వస్తున్నాయనగానే రంగంలోకి దిగిపోయాయి అభివృద్ధి నిరోధక శక్తులన్నీ.
YCP Visha Nagulu On USRA: ఈ నేపథ్యంలో… కొన్ని మీడియాలలో వస్తున్న కథనాలపై URSA స్పందించింది. తమపై వస్తోన్న ఆరోపణలన్నింటికీ ప్రెస్‌నోట్ ద్వారా వివరణ ఇచ్చింది. ముఖ్యంగా.. టీసీఎస్‌కి ఇచ్చినట్లే, URSAకి కూడా ఎకరం 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మొత్తం కేటాయిస్తున్న భూమిలో 56.6 ఎకరాలకు ఎకరానికి రూ.50 లక్షల చొప్పున… మరో 3.5 ఎకరాలకు ఎకరానికి రూ.కోటి చొప్పున చెల్లిస్తున్నామని కూడా వెల్లడించారు. URSA వ్యవస్థాపక బృందం ట్రాక్ రికార్డ్‌ని పరిశీలించాకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనీ, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై 5 నెలల పాటు వివిధ స్థాయిల్లో అధ్యయనం చేశాకే… పూర్తి స్థాయి అనుమతులు వస్తాయన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు అర్సా ప్రతినిధులు.
Also Read: BRS 25 Years Drama Event: బీఆర్‌ఎస్ 25 ఏళ్ల పండుగ ఏర్పాట్లు చూశారా..
URSA టీం సభ్యులకు శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికా వ్యాలీలో 1995 నుండి సంస్థలను నెలకొల్పడంలో అనుభవం ఉందనీ.. URSA కొత్తగా రిజిస్టర్ అయినప్పటికీ.. అనుభవజ్ఞులైన టీం మెంబెర్స్ ఉన్నారనీ చెబుతున్నారు. అయితే.. భారత్‌లో తమ సంస్థకు ఇంకా హెడ్ క్వార్టర్స్ లేదన్న URSA.. కోర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సమకూర్చుకున్నాకే హెడ్ క్వార్టర్స్ నెలకొల్పుతామని చెబుతోంది. 12 నుండి 24 నెలల్లో ప్రాజెక్టు ఫేజ్ -1 పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి URSA ఇప్పటికే స్పష్టమైన ప్రతిపాదనలు ఇచ్చిందట. తాజాగా కంపెనీ వెబ్‌సైట్ వివరాలతో సహా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన URSA.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని వెల్లడిచేస్తూనే… లీగల్ యాక్షన్‌కు వెనకాడమని తేల్చి చెప్తోంది.
YCP Visha Nagulu On USRA: అసలు ‘అర్సా’పై జరుగుతున్న ప్రచారం ఏంటి? కనిపిస్తున్న వాస్తవాలేంటి? అనేది పరిశీలిస్తే… ‘అర్సా’కు ఎలాంటి వ్యాపార అనుభవం లేదన్నది జరుగుతోన్న ప్రచారం అయితే.. ఆ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్న సతీశ్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తిలకు అమెరికాలో సుమారు 15 ఏళ్ల వ్యాపార అనుభవం ఉన్నట్లు స్పస్టమవుతోంది. ‘అర్సా’ ప్రమోటర్లకు 5 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థిక సామర్థ్యం లేదన్నది జరుగుతోన్న ప్రచారం అయితే… తమ కంపెనీ టీమ్ నెట్ వర్త్ 4063 కోట్లుగా URSA చూపిస్తోంది. అర్సా క్లస్టర్స్ వెనుక టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారన్నది జరుగుతోన్న ప్రచారం అయితే… సొంత సోదరుడితో విభేదాల కారణంగా మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యూహాత్మక రాజకీయ ఆరోపణే ఇది.. అన్న వాదన ప్రజల నుండి వినిపిస్తోంది. ఇక భూములు దోచుకుని, పంచుకోవడమే URSA నెలకొల్పడం వెనుక ఉద్దేశ్యం అంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారం పూర్తిగా అర్థ రహితం అని నిపుణులు కొట్టి పడేస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడ భూములు కొట్టేసేందుకు అవకాశమే లేదు. చెప్పిన నిర్ధిష్ట సమయంలోపు ప్రాజెక్ట్ ప్రారంభించకుంటే నిర్ధాక్షిణ్యంగా భూములు వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.
తమ హయాంలో వచ్చిన కంపెనీలేంటో చెప్పుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. ఎందుకంటే తమ పాలనలో తరిమేసిన కంపెనీల లిస్టు మాత్రమే ఆ పార్టీ వద్ద ఉంది. నేడు చంద్రబాబు, నారా లోకేష్‌లు చెప్పినట్లే రాష్ట్రానికి కంపెనీలను తెస్తుండటం.. వైసీపీని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భవిష్యత్తులోనూ ఆ పార్టీ ఇలాగే రాష్ట్రానికి వచ్చే ప్రతి కంపెనీ విషయంలోనూ అడ్డపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తుంది అనడంలో సందేహమే లేదు. అప్రమత్తంగా ఉండాల్సింది ప్రభుత్వం, ప్రజలు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతే.