Tuda Dollars Diwakar

Tuda Dollars Diwakar: ‘తుడా’ గేమ్‌ఛేంజర్‌ డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి..!

Tuda Dollars Diwakar: తుడా చైర్మన్‌గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు డాలర్స్ దివాకర్ రెడ్డి. తుడా చైర్మన్‌ పదవితో పాటు.. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడుగా కూడా చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి దాకా.. తుడా చైర్మన్ పదవితో పాటు టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వం ఎవరికీ కేటాయించలేదు. తుడా చైర్మన్ పదవికి పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పటికీ.. పోటీలో తన సత్తా చాటుతూ.. డాలర్స్ దివాకర్ రెడ్డి చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీకి చెందిన హేమాహేమీలు ఈ పదవి కోసం పోటీపడి కంగుతిన్నారు. చివరికి డాలర్స్ దివాకర్ రెడ్డికి ఈ పదవిని కట్టబెడుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువనేత, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి గురించి తిరుపతి జిల్లా ప్రజలకు పరిచయం అక్కర్లేదు. రియల్టర్‌గా, డాలర్స్ గ్రూపు అధినేతగా ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. 2024 ఎన్నికలలో చంద్రగిరిలో టీడీపీ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టానికి తగిన గుర్తింపునిస్తూ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని మంత్రి లోకేష్ అప్పగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకున్నారు. తుడా ఛైర్మన్ కాబట్టి.. టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కూడా డాలర్స్ దివాకర్ రెడ్డికి హోదా దక్కనుంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున టికెట్‌ను ఆశించారు డాలర్స్ దివాకర్ రెడ్డి. అయితే, పొత్తు సమీకరణాల్లో డాలర్స్‌కు సీటు సర్ధుబాటు కాలేదు. అయినా సరే… తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో తన అనుచరవర్గంతో ప్రచారం చేసి, అక్కడి ఎమ్మెల్యేల గెలుపుకు అహర్నిశలు కష్టపడి పని చేశారు డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి. ఏమీ ఆశించకుండా సీఎం చంద్రబాబు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి అభ్యర్థుల గెలుపులో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో, తుడా చైర్మన్ చేస్తానని అప్పట్లోనే లోకేష్ హామీ ఇచ్చారు. అందుకే తిరుపతిలో ఎంతమంది టీడీపీ నేతలు పోటీ పడ్డప్పటికీ డాలర్స్ దివాకర్ రెడ్డిని లోకేష్ గుర్తుపెట్టుకొని మరీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Also Read: S Jaishankar: ఉగ్రవాదులను మట్టుబెడతాం, పాకిస్తాన్‌కు మాస్ వార్నింగ్

Tuda Dollars Diwakar: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ మేకర్‌గా ఉన్న డాలర్స్ దివాకర్ రెడ్డిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థికంగా దెబ్బతీయడంతో కసితో టీడీపీ గెలుపు కోసం పని చేసి.. చంద్రబాబు, లోకేష్‌ల దృష్టిలో గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. ఫలితమే తుడా చైర్మన్‌ పదవి. తుడా… 7 నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. తుడా చైర్మన్‌ అంటే ఎంపీతో సమానమైన పదవిగా, క్యాబినెట్ హోదాతో ఈక్వల్‌గా చెప్తారు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవికి లేనంత డిమాండ్, హైప్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి కనుకే.. విపరీతమైన పోటీ ఏర్పడింది. చివరికి గేమ్ చేంజర్ రేసులో ఒకే ఒక్కడుగా నిలిచారు డాలర్స్ దివాకర్ రెడ్డి.

అయితే తుడా చైర్మన్‌ పదవి ఆశించి భంగపడ్డ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. గత నాలుగు రోజులుగా వివాదం నడిచింది. ఒక రియల్టర్‌గా ఉన్న లీడర్‌కి తుడా పదవి ఎలా ఇస్తారంటూ విశ్లేషణలు నడిచాయి. అయితే ఇక్కడే డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి.. చాకచక్యంగా, ఎంతో అనుకువతో వ్యవహరించారు. అసంతృప్తి నేతలతో పాటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్ని స్వయంగా ఇంటికెళ్లి మరీ కలిశారు. తనకు సహకరించాలని కోరారు. డాలర్స్‌ కోరికను మన్నిస్తూ, చంద్రబాబు నిర్ణయానికి విలువనిస్తూ నేతలంతా కలిసివచ్చారు. దీంతో వివాదం ముగిసింది. పెద్ద ఎత్తున డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ర్యాలీ నడిచింది. కూటమి నేతల అందరి సమక్షంలో అత్యంత అట్టహాసంగా తుడా చైర్మన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *