TTD Tattala Scam

TTD Tattala Scam: గత వైసీపీ అధికారులకు వీరికి ఏమిటి తేడా!

TTD Tattala Scam: గత నాలుగేళ్లలో తిరుమల కొండపై వైసీపీ నేతల అండతో దాదాపు 119 అక్రమ హాకర్స్ తట్టలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తిరుమల కొండపై, ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా ఎలాంటి టి.టి.డి లైసెన్సులు లేకుండానే అక్రమంగా తట్టలు పెట్టుకుని దర్జాగా నేటికీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అక్రమ తట్టలపై టీటీడీ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పాటు చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో… దానిపై ఓ కమిటీని నియమించి విచారణ ప్రారంభించారు. అయితే కమిటీలో ఉన్న కొంతమంది టీటీడీ సిబ్బంది అక్రమ లైసెన్స్ దారులతో చేతులు కలిపి, అక్రమ లైసెన్స్‌లు సక్రమమని నిరూపించే ప్రయత్నం చేశారు. టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని బుట్ట దాఖలు చేయడమే కాకుండా తిరిగి మళ్లీ మరో 24 తట్టలు కొత్తగా పెట్టించేందుకు ప్రయత్నించారు. దీంతో మండిపడ్డ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సదరు రెవెన్యూ అధికారులను గట్టిగా మందలించడంతో తట్టలు పెట్టే కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు.

గతంలో పనిచేసినటువంటి రెవెన్యూ సిబ్బంది సదరు అక్రమ హాకర్స్ వద్ద ఒక్కొక్క తట్టకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని టిటిడి దృష్టికి స్థానిక వ్యాపారులు స్వయంగా తీసుకెళ్లినా, ఈ అక్రమ తట్టలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం వల్ల తమ వ్యాపార ఉనికిని కోల్పోతున్నామని ప్రాధేయపడ్డా, నేటి వరకు ఎలాంటి చర్యలు లేవని బాధపడుతున్నారు. అయితే తాజాగా హరీష్ రెడ్డి అనే ఒక యువకుడు తిరుమల కొండపై ఈ అక్రమ తట్లల బాగోతం నడిపిన వైసిపి నేతపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు, అక్రమ తట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకునేందుకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read: Narendra Modi: ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?

డబ్బులు తీసుకుని మూడు నెలల పాటు మాత్రమే వ్యాపారం చేసుకునేందుకు అనుమతించి, తర్వాత వాటిని తొలగించారని, అయితే తన వద్ద తీసుకున్న ఆ నాలగు లక్ష రూపాయలు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో తెలిపాడు. హరీష్ రెడ్డి లాంటి చాలామంది యువకులు ఆ వైసీపీ నేతల వలలో పడి లక్షలకు లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. రమారమి ఒక్కొక్క తట్టకు లక్ష రూపాయల లెక్కన… 120 తట్టల లెక్క చూసుకుంటే దాదాపు నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసి, టీటీడీ విధివిధానాలను తుంగలో తొక్కి, తిరుమల కొండపై ప్రధాన ప్రాంతాల్లో అక్రమ తట్టలు పెట్టించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరిపి, కొండపైన వెలసిన అక్రమ తట్టలను తొలగిస్తే తమకు న్యాయం జరుగుతుందని తిరుమల కొండపై షాప్ యజమానులు ప్రాధేయపడుతున్నారు. మరొక పక్క గత నెల 22న టిటిడి పాలక మండలి సమావేశంలో రెవెన్యూ సిబ్బంది అతి ఉత్సాహంతో దాదాపు 74 అక్రమ హాకర్ లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు పాలకమండలి ముందు ఉంచగా టీటీడీ చైర్మన్ వాటిని తిరస్కరించారు. రెవెన్యూ సిబ్బంది పెట్టిన లైసెన్సులన్నీ బోగస్ అని టిటిడి చైర్మన్ మండిపడినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తిరిగి సమగ్ర నివేదికను తన ముందు ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో కేవలం 29 హాకర్స్‌ లైసెన్సులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అప్పటి అధికారులు తెలుపుతున్నప్పటికీ… గత రెవెన్యూ సిబ్బంది ప్రదర్శించిన చేతివాటాన్నే ఇప్పుడున్న కొంతమంది రెవెన్యూ సిబ్బంది కొనసాగిస్తున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు అక్రమంగా వెలసిన తట్టలను తొలగించాలని తిరుమల స్థానికులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *