There is no pink Daimond: తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కానేకాదని ప్రకటించారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయ చామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీవారికి విలువైన ఆభరణాలు బహూకరించిన రాజుల్లో మైసూరు మహారాజు జయ చామ రాజేంద్ర వడియార్ కూడా ఒకరు. 1945 సంవత్సరం జనవరి 9వ తేదీన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. మహారాజ పర్యటనకు సంబంధించి మైసూరు ప్యాలెస్ నుంచి 1944 డిసెంబరు 29వ తేదీన రామయ్య అనే ప్యాలెస్ అధికారి టీటీడీ కమిషనర్‌కు లేఖ రాశారు. మహారాజ వారు రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారని…. తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు రెండు మంచి కార్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంలోనే టూర్ షెడ్యూల్ కాపీని కూడా పంపారు. ఈ పర్యటనలోనే మైసూరు మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు. ఆ హారాన్ని టీటీడీ కొన్నేళ్లుగా విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది. 2001 అక్టోబరు 21న జరిగిన గరుడసేవలో మలయప్పస్వామికి ఈ హారాన్ని అలంకరించారు. అయితే వాహనసేవను వీక్షిస్తున్న భక్తులు విసిరిన నాణేలు తగలడంతో ఆ ఆభరణంలో కెంపు రాయి విరిగిపోయింది. ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్‌లో కూడా నమోదు చేశారు.
Also Read: Perni Nani on Janasena: చీకట్లో కన్నుకొట్టమని.. కొట్టాక రాద్ధాంతం దేనికి?
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో ఉన్నది కెంపు రాయి కాదని, కోట్ల విలువైన పింక్ డైమండ్ అని, ఆ డైమండ్‌ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారంటూ 2018లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే కైంకర్యాలు సరిగా జరగడం లేదని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు నిర్వహించారని కూడా ఆయన ఆరోపణలు చేయగా… టీటీడీ కూడా అదే స్థాయిలో స్పందించింది. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయంపై జగన్నాధరావు కమిటీ ఇచ్చిన నివేదికలో పగిలిన కెంపు ముక్కలు పేష్కార్ ఆధీనంలో ఉన్నాయని తెలియజేసినట్టు వివరణ ఇచ్చింది. ఆ కెంపు విలువ రూ.50గా నిర్ధారించినట్టు రికార్డులున్నాయంటూ కూడా స్పష్టంగా పేర్కొంది. అయితే స్వామికి అనేక ఏళ్లు దగ్గరుండి కైంకర్యాలు నిర్వహించిన రమణ దీక్షితులు చెప్పడంతో పలువురు భక్తులు సందేహంలో పడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు, వైసీపీ అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిపై రూ.200 కోట్ల పరువు నష్టం దావాను టీటీడీ వేసింది. దీనికి రూ.2 కోట్లు ఫీజు కూడా అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెల్లించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసును ఉపసంహరించుకోవడంతో… కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్ల ఫీజు ఎవరిస్తారు? స్వామి నిధులు ఇలా దుబారా చేస్తారు? అంటూ భక్తుల నుండి భారీగా విమర్శలొచ్చాయి.
మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ అనేది లేదని పలు సాక్ష్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ అంశంపై కొద్దిరోజుల పాటు పరిశోధన చేశారు. మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలవడంతో పాటు ప్యాలస్‌లోని కొన్ని రికార్డులను పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఆ హారాన్ని రూ.8,500కు ఢిల్లీలో తయారు చేయించినట్టు తేలింది. ప్యాలస్‌లోని ఆభరణాల రికార్డుల్లోనూ శ్రీవారికి సమర్పించిన హారంలో ఎలాంటి డైమండ్ ఉన్నట్టు లేదు. దీంతో గతంలో చేసిన విమర్శలు తాజా ఆధారాలతో అవాస్తవాలుగా తేలాయి. ఈ అంశంపై మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. ‘స్వామివారి విషయాల్లో లేనిపోని అభాండాలు వేయకూడదు. తప్పుడు ప్రచారాలు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే. మా పరిశోధనలో రాజు సమర్పించిన హారంలో డైమండ్ లేదని తేలింది. దేవాలయాల విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ అభిప్రాయపడ్డారు.

