TDP New Leadership Drive: నాయకత్వ పెంపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన లక్ష మందికి కార్యకర్తలకు ఏడాది కాలంలో నాయకత్వ లక్షణాలు పెంపొందేలా శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఈ తరహా కార్యక్రమాలు గండిపేట నుండి జరిగేవి. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్టీఆర్ నాడే రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తోంది టీడీపీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తగ్గినా.. నేడు ఎన్నడూ లేనంత మెజార్టీతో పార్టీ అధికారంలోకి రావడంతో… మరో పాతికేళ్ల పాటూ పార్టీ బలంగా కొనసాగేలా.. అధినేత చంద్రబాబు తాజా కార్యక్రమానికి పూనుకున్నారు. టెక్నాలజీ వెంట పరుగులు పెట్టే చంద్రబాబు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా.. పార్టీ నాయకత్వంతో కొత్త వరవడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ధఫా నిర్వహిస్తున్న నాయకత్వ శిక్షణ శిబిరం ప్రత్యేకం.
175 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను ఎంపిక చేసి నాయకత్వంపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్యాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న మంగళగిరిలో ఓ నూతన భవనాన్ని ఈ ట్రైనింగ్ క్లాసుల కోసం సిద్ధం చేస్తున్నారు. శిక్షణలో పాల్గొనే కార్యకర్తలకు సకల సౌకర్యాలు అక్కడే సమకూరుస్తారు. లక్ష మంది టిడిపి క్యాడర్‌కు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా శిక్షణ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. లక్షమందిలో వెనుకబడిన సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ యువత, మహిళలు ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని రీ జనరేట్ చేయనున్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసే నేతలు.. తమ అనుభవాలు, రాజకీయ పరిస్థితులు, సామాజిక స్థితిగతులను బేస్ చేసుకుని కార్యకర్తలకు శిక్షణ కల్పిస్తారు. రాజకీయ పరిస్థితులు, సామాజిక స్థితిగతుల్ని ఎలా పరిశీలన చేయాలి, తదనుగుణంగా ఎలాంటి ఆలోచనలు పెంపొందించుకోవాలి, ప్రజల సమస్యల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారంలో టెక్నాలజీని ఎలా అప్లై చేయాలి వంటి అంశాలను కార్యకర్తలకు నేర్పుతారు. టెక్నాలజీని మంచికి ఎలా ఉపయోగించాలి, సోషల్‌మీడియా ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడం, పాజిటివ్ అంశాలను ఫాస్ట్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో నిపుణులతో శిక్షణనిప్పిస్తారు. సీరియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్‌లు.. ఇలా అన్ని స్థాయిల్లో ఉన్న నాయకత్వం ఈ శిక్షణ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అల్టిమేట్‌గా నాయకత్వ లక్షాల్లో ఆరితేరిన మెరికల్లాంటి కార్యకర్తలు పార్టీకి కవచంలా ఉపయోగపడాలి. నవంబర్‌లో ఈ శిక్షణ క్యాంపు ప్రారంభం కానుంది. టీడీపీ అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. పనిచేసే కార్యకర్తలకు అదో అవకాశాల గని. ఇక క్యాడర్ నుండి లీడర్‌గా మారాలనుకునే తెలుగు తమ్ముళ్లకు ఈ ప్రోగ్రామ్ ఓ అద్భుత అవకాశం అవ్వనుంది.

