TDP Malepati Death Lesson

TDP Malepati Death Lesson: పాఠం నేర్చుకోకుంటే టీడీపీ ఉనికికే ప్రమాదం!

TDP Malepati Death Lesson: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే లోకేష్ వల్ల టీడీపీ సేఫ్‌గా ఉంది. కానీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అందరికీ పెద్దన్నగా, ఆరడుగుల కటౌట్‌తో, వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో బాహుబలిగా ఉన్న మాలేపాటి సుబ్బనాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక పడిన అవమానాలు, సొంత పార్టీ లీడర్ల కుట్రలతో మానసికంగా నలిగిపోయి చనిపోయిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్లుగా మాలేపాటి సుబ్బనాయుడు తండ్రి, అన్న, వారి కుటుంబం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మాలేపాటి కుటుంబం, సుబ్బనాయుడు, రవీంద్రనాయుడులు నిజాయితీగా పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ లంటే పిచ్చిగా పనిచేసే వారు. ఆస్తులు కరిగిపోతున్నా, ప్రత్యర్థులు కేసులతో వేధిస్తున్నా, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు రాచి రంపాన పెట్టినా మాలేపాటి సుబ్బనాయుడు బ్రదర్స్ డోంట్ కేర్ అన్నారు. కావలి రాజకీయాల్లో మహామహులు కాంగ్రెస్, వైసీపీ ఫోర్స్‌కు భయపడి.. మేము డబ్బు ఖర్చు పెట్టలేము, మేము వైసీపీని ఫేస్ చేయలేము అని చేతులెత్తేసిన టైమ్‌లో కూడా మాలేపాటి సోదరులు కావలిలో తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నారు. సొంత డబ్బు ఖర్చు చేసి 2019 నుండి 2024 వరకు కావలిలో తెలుగుదేశం పార్టీకి ధైర్యం, గెలుపుపై నమ్మకం ఇచ్చారు. టీడీపీ కావలిలో గెలిచి పదేళ్ల కాలం అవుతున్నా, బీద బ్రదర్స్‌లో చీలిక వచ్చి కేవలం బీద రవిచంద్రయాదవ్ మాత్రమే పార్టీకి సపోర్ట్ ఉన్నా.. మాలేపాటి సుబ్బనాయుడు బాహుబలి లెవల్‌లో చేసిన పోరాటాలు కావలిలో తెలుగుదేశం పార్టీకి కొండంత ధైర్యం ఇచ్చాయంటారు.

Also Read: Kollu Ravindra: కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు.. జగన్‌ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌!

తెలుగుదేశం పార్టీ కావలి ఇంఛార్జ్‌గా, కావలిలో 2024లో పోటీ చేసేది మాలేపాటి సుబ్బనాయుడే అని డిసైడ్ అయిన తరుణంలో కులాల లెక్కలు, రెడ్డి, కమ్మ ఈక్వేషన్లు తెరపైకి తెచ్చారు. అప్పటికే వైసీపీపై చేస్తున్న పోరాటంలో, టీడీపీని కాపాడుకునే క్రమంలో నాలుగైదేళ్లు ఇరవై కోట్లకు పైగా మాలేపాటి సుబ్బనాయుడు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి మరీ పార్టీకి ఖర్చు పెట్టాడని ఇప్పటికి చెప్తారు. లోకేష్ యువగళంలో కావలిలో మాలేపాటి సుబ్బనాయుడు, కావలి టౌన్‌లో మలిశెట్టి వెంకటేశ్వర్లు అనే కాపు నాయకుడు కట్టిన భారీ కటౌట్ ఇప్పటికీ రికార్డ్. యువగళం పాదయాత్రలో మాలేపాటి బ్రదర్స్, బీద రవిచంద్ర పర్మిషన్‌లతో లోకేష్ పక్కన నడిచిన కావ్య కృష్ణ రెడ్డి అనే వైసీపీ వ్యక్తి తరువాత కాలంలో కుల లెక్కలతో కావలి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నాడు. మాలేపాటి అలక, సుబ్బనాయుడు టీడీపీకి చేసిన సేవ, నష్టపోయిన తీరు తెలిసిన చంద్రబాబు, లోకేష్ లు నారాయణ, బీద ఇతర తెలుగుదేశం పెద్దలను మాలేపాటిని బుజ్జగించమని, సర్దిచెప్పామని పంపితే నెల్లూరులో ఆ పంచాయితీ నడిచింది. ఈ టైమ్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు కావ్య కృష్ణ రెడ్డి మాలేపాటి సుబ్బనాయుడుని మంచి చేసుకునేందుకు ఆయన ఇంటి బయట పది గంటల పాటు వేచి ఉన్నాడని చెబుతారు. అప్పుడు కావ్య కృష్ణరెడ్డిది అవసరం. అవసరం తీరింది, కావలిలో మాలేపాటి బ్రదర్స్, మాలేపాటి బలమైన వర్గం తెలుగుదేశం పార్టీకి పని చేసింది. పవర్ వచ్చింది. అంతే అప్పటి నుండి మాలేపాటి సుబ్బనాయుడుకు బ్యాడ్ టైమ్ మొదలయ్యింది. కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉండగా, పదేళ్లు కావలిలో పవర్ లేకున్నా ఎదురుకాని అవమానాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తన పర్మిషన్‌తో లోకేష్ పక్కన నిలబడే అవకాశం దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డి ఆ తర్వాత మాలేపాటికి రుచిచూపించాడు అంటారు. కావలి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా, కావలి కింగ్‌గా బాహుబలిలో ప్రభాస్ లాగా కావలిని ఏలిన మాలేపాటి సుబ్బనాయుడు, కట్టప్ప చేతిలో బాహుబలి దెబ్బతిన్నట్టు, కావ్య కృష్ణారెడ్డి చేతిలో దెబ్బతిన్నాడని, ఇది ముమ్మటికీ వెన్నుపోటు, రాక్షస రాజకీయం అని కావలిలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కావలిలోని మాలేపాటి ఇంట్లో సుబ్బనాయుడుతో పాటు, అన్న కొడుకు ఈ రాజకీయ అవమానంతో రెండు రోజుల వ్యవధిలో చనిపోవడం తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఆగ్రహవేశాలను రగిలించింది.

Also Read: YCP Shyamala Over Smart: యాక్టింగ్‌ ఫుల్‌, మ్యాటర్‌ నిల్‌… వైసీపీకి రోజానే బెటరేమో!

మాలేపాటి సుబ్బనాయుడు, అన్న కొడుకు భానుచందర్ చౌదరిలు ఇద్దరూ… ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌తో, మరొకరు హార్ట్ ఎటాక్‌తో చనిపోయి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు మిగిల్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కావలి ఎమ్మెల్యే టికెట్ నష్టపోయిన మాలేపాటి సుబ్బనాయుడుకు పవర్‌ఫుల్ పదవి ఇవ్వకపోవడం… కావలిలో, సొంత మండలం దగదర్తిలో, సొంత ఊరిలో మాలేపాటి బ్రదర్స్‌కు పనులు చేయొద్దని పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులకు కావలి ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంపై పాత తెలుగుదేశం లీడర్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాలేపాటి టికెట్ తాను లాక్కొని, గెలిచాక మాలేపాటిని మానసికంగా వేధిస్తున్నప్పటికీ… టీడీపీ పెద్దలు, మంత్రులు, బీద బ్రదర్స్ ఎందుకు అడ్డుకోలేదని మాలేపాటి అభిమానులు మండిపడుతున్నారు. చంద్రబాబు బొమ్మతో ఎమ్మెల్యేగా గెలిచి, అదేదో తన డబ్బు పవర్‌తో, తన ప్రతిభతో భారీ మెజారిటీ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నా కూడా, టీడీపీ అధిష్టానం ఎందుకు కావ్య కృష్ణారెడ్డిని కంట్రోల్ చేయలేదని మాలేపాటి వర్గం ప్రశ్నిస్తోంది. చివరికి మానసిక క్షోభతో మాలేపాటి కుటుంబంలో రెండు శవాలు లేచి, ఇవి టీడీపీ పెద్దల చేతగాని రాజకీయంతో జరిగిన మరణాలు అని ఆవేదన రగిలిన టైమ్‌లో కూడా…. మాలేపాటి సుబ్బనాయుడు వ్యక్తిత్వాన్ని, ఆయన ఇంట్లో మహిళలను అవమానించే మాటలను ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి మాట్లాడటం, ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేశారనేది మాలేపాటి అభిమానుల ఆరోపణలుగా ఉన్నాయి.

కావలిలో ఏళ్లకు ఏళ్లు పార్టీ ఆఫీసులో ఉచిత భోజన వసతి క్యాడర్‌కు కల్పించిన మాలేపాటి సుబ్బనాయుడు, భానుచందర్ చౌదరిలు విషాద మరణం చెందితే టీడీపీ పెద్దలు నిద్ర నటిస్తారా అంటూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సోషల్ మీడియా వేదికల్లో టీడీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాలేపాటి ఇంట్లో రెండు చావులకు కారణమైన వ్యక్తిని, అదే ఇంటికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంఛార్జ్ మంత్రి తమ వెంటబెట్టుకుని మరీ ఎలా తీసుకెళ్తారని యావత్ కమ్మ సామాజిక వర్గం తప్పుపడుతోంది. మాలేపాటి ఇంట్లో మహిళలు సైతం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రావడానికి వీలు లేదంటే, ఎమ్మెల్యే యాభై కార్లతో ర్యాలీగా వెళ్లి, సుబ్బనాయుడు ఊర్లో జిందాబాద్‌లు కొట్టించుకోవడాన్ని సైకో లీడర్ చర్యగా అభివర్ణిస్తూ మాలేపాటి వర్గం ఫైర్ అవుతోంది. మాలేపాటి కర్మంత్రాల రోజు టీడీపీ అభిమానులు ఎమ్మెల్యే కారుపై దాడికి తెగబడగా, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిలు కంట్రోల్ చేయకపోయి ఉంటే గొడవ చాలా పెద్దదైపోయేదని తెలుస్తోంది. కావలిలో తెలుగుదేశం పార్టీ నేతలకెవ్వరికీ పనులు చేయొద్దనీ, తాను చెప్పిన వారికే పనులు చేయాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు, ఆర్డీఓకు, మున్సిపల్ కమిషనర్‌కు ఇలా అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆర్డర్స్ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డితో తాము వేగలేమనీ, నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జ్‌ని నియమించి కావలి టీడీపీని కాపాడాలని, కావలి పాత టీడీపీ లీడర్స్ కొత్త డిమాండ్ అందుకున్నారట. చూడాలి మాలేపాటి సుబ్బనాయుడు మరణాన్ని టీడీపీ పెద్దలు కేస్ స్టడీగా తీసుకుని పసుపు పార్టీలో రగులుతున్న డేంజరస్ ఫైర్‌ను కంట్రోల్ చేస్తారా, లేక అంతా బావుంది అని, జగన్ పుంజుకునే చాన్స్‌ చేజేతులా అందిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *