Tadipatri tension Tension: తాడిపత్రి రాజకీయం అంటేనే రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, ఆధిపత్యం కోసం 365 రోజులు జరిగే పొలిటిక్ యాక్షన్ డ్రామా. 2024 ఎన్నికల సమయంలో రాజుకున్న రాజకీయం.. ఇప్పటికి భగభగ మండే అగ్నిగోలాన్ని తలపిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రెండు సార్లు వెళ్లడానికి ప్రయత్నం చేయగా హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. కోర్టును ఆశ్రయించి ముచ్చటగా మూడోసారి… మే 10న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు పెద్దారెడ్డి. వీలైతే రేపే తాడిపత్రిలో అడుగుపెట్టాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈసారైనా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టగలరా? అంటే వైసీపీ నాయకులకే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జేసీ మాత్రం పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేదే లేదని పట్టదలతో ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ వేవ్‌లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనే విధంగా ఆయన పాలన సాగింది. సినిమా తరహాలో ప్రత్యర్థి జేసీ ఇంట్లోకి వెళ్లి… కుర్చీలో కూర్చొని సవాల్ విసిరారు పెద్దారెడ్డి. దీంతో ఫ్యాక్షన్‌కి మళ్లీ ఆజ్యం పోసినట్టు అయింది. అది పెద్దారెడ్డి చేసిన మొదటి బ్లండర్ మిస్టేక్. ఇక 2024 ఎన్నికలకు మూడు నెలలు ముందు పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే… తన ఫ్యాక్షన్ వేట మొదలవుతుందంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఇది రెండో బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు ఈ రెండు సంఘటనలే.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయకుండా చేస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
”40 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. అనేక మంది ప్రత్యర్థులు మాపై పోటీ చేశారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మా ఇంటికొచ్చి సవాల్ చేశారు. మా అనుచరులపై దాడి చేశారు. పైగా కూటమి అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్ మొదలుపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తిని తాడిపత్రిలోకి రానివ్వాలా? సమస్యే లేదు” అంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు తమ కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురి చేసి, 130కి పైగా కేసులు బనాయించిన విషయాన్ని జేసీ గుర్తు చేస్తున్నారు. 4 నెలల పాటు తనని జైలుకు పంపితే.. ఇదే పోలీసులు ఆ రోజు వన్ సైడ్‌గా వ్యవహరించారంటు మండిపడుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ ఐదేళ్లు న్యాయవ్యవస్థలు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల సంఘం సైతం స్పందించినా.. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేక పోయారంటున్నారు జేసీ. పెద్దారెడ్డిని మాత్రం తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వమని ఘాటుగానే హెచ్చరిస్తున్నారు.
Also Read: Airports Closed: 7 రాష్ట్రాల్లోని 27 ఎయిర్ పోర్టులు మూసివేత.. 430 విమానాలు రద్దు
Tadipatri tension Tension: ఇక్కడే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాడిపత్రిలోకి అడుగుపెట్టుకుండానే వైసీపీ అధిష్టానం నుంచి, కార్యకర్తల నుంచి సానుభూతి పొందుతున్నారా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాలు పైమాటే. ఇప్పటి నుంచే తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పట్లో కార్యకర్తలు కూడా పెద్దగా ముందుకు రాని పరిస్థితి. వస్తే కేసుల్లో ఇరుక్కుంటామన్న భయం వారిని వెంటాడుతోంది. ఒక్కసారి కేసుల్లో ఇరుక్కుంటే.. పార్టీ నుంచి ఎలాంటి సాయం ఉండదనీ, బయటపడటం చాలా కష్టతరం అవుతుందని ప్రతి కార్యకర్తకు అర్థమైపోయింది. కార్యకర్తల బలం లేకుంటే తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం అసాధ్యం. అందుకే.. ఎలాగో తాడిపత్రిలో జేసీ అడుగుపెట్టనివ్వడు కాబట్టి, మరో రెండు మూడేళ్లు ఇలాగే తాడిపత్రి బయట నుండి రాజకీయం చేస్తూ.. సానుభూతి అయినా సాధిద్దాం అనుకుంటున్నారట కేతిరెడ్డి పెద్దారెడ్డి.
పెద్దారెడ్డిని స్వయంగా పోలీసులే తీసుకువెళ్లి బందోబస్తు నడుమ తాడిపత్రిలో వదిలిపెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో రేపే కుటుంబ సమేతంగా పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే రమ్మనండి.. ఎలా వస్తాడో చూస్తాం అంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. గతంలో హైకోర్టు అనుమతులు, మానవ హక్కుల సంఘం తీర్పు, రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేసీ అనుచరుడు ఎస్వీ రవీందర్ రెడ్డిని ఐదేళ్ల పాటు తాడిపత్రిలోకి రానివ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అంటుంటే.. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలోకి ఎలా రానిమంటారు అంటూ లాజిక్‌తో కొడుతున్నారు. ఎటొచ్చీ తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎటువైపు నుంచి ఏ ఘర్షణ మొదలవుతుందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే జేసీ చెప్పినట్లు విన్నందుకు ఎన్నికల ఘర్షణల విషయంలో ఏకంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసింది ప్రభత్వం. దీంతో మాకెందుకు వచ్చిందిలే అన్న తీరులో పోలీసులు ఉన్నారు. తాడిపత్రిలో రేపు ఏం జరగబోతుందన్న టెన్షన్ మాత్రం ప్రజల్లో నెలకొంది.