Sugavasi Brothers KDP: కడప జిల్లా రాయచోటిలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న సుగవాసి కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటిదాకా రాయచోటి టీడీపీ అంటే సుగవాసి కుటుంబమే గుర్తుకొచ్చేది. కట్టె కాలే వరకూ టీడీపీలోనే ఉంటానన్న పెద్దాయన పాలకొండ్రాయుడు.. అన్న మాటలు నిజం చేసుకున్నారు. అయితే పెద్దాయన మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు సుగవాసి అభిమానుల మధ్య అలజడిని సృష్టిస్తున్నాయి. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చినా.. అక్కడ జరిగిన పరిణామాల వల్ల ఓటమిపాలయ్యానని సుగవాసి సుబ్రహ్మణ్యం బాహాటంగానే చెప్పుకొచ్చారు. అప్పటి నుండీ ఆయనలో ఉన్న అసంతృప్తి ముదిరి చివరికి టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అయితే మొట్టమొదట గెలుస్తుందనుకున్న రాజంపేటలో మాత్రం కూటమి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఏడాది వరకు వేచి చూసినా… తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంతకు రాజీనామా అనంతరం సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరడం సరైన నిర్ణయమేనా అన్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే వైసీపీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో పాతుకుని పోయి ఉన్నారు. దీంతో సుగవాసి సుబ్రహ్మణ్యంకు జగన్ నిజంగా ప్రాధాన్యత ఇస్తారా? లేదా? అన్న సందేహం సుగవాసి అభిమానుల్లో కనిపిస్తోంది.
Also Read: RAMACHANDRA RAO: బీజేపీలో కొత్త, పాత అనే తేడా లేదు.. ట్రోల్ చేస్తే జైల్లో పెడతా..
Sugavasi Brothers KDP: టీడీపీలో సుగవాసి ప్రసాద్ బాబు, వైసీపీలో సుగవాసి సుబ్రహ్మణ్యంలు ఉండటంతో సుగవాసి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తండ్రి మరణం తర్వాత సుగవాసి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాయచోటిలో సుగవాసి కుటుంబంలో నెలకొన్న సమస్యకు సమాధానం దొరకడం లేదు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సుబ్రహ్మణ్యంకు జగన్ ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆయన దారెటు? టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్న ప్రసాద్ బాబును అధిష్టానం గుర్తిస్తుందా? కుటుంబంలో అన్నదమ్ముళ్ల మధకచ సయోధ్య ఎంత? అయితే వైసీపీలో చేరడం సుబ్రహ్మణ్యం వ్యక్తిగత నిర్ణయమని తెల్చేశారు ప్రసాద్ బాబు. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుందా? లేక కష్టాలు తెచ్చిపెడుతుందా? సుగవాసి సుబ్రహ్మణ్యంకి నిజంగానే జగన్ ప్రాధాన్యత ఇస్తారా, లేదా? ఈ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి.