SriLakshmi Currupt: ఉపోద్ఘాతం లేకుండా నేరుగా స్టోరీలోకి వెళ్లిపోదాం. జగన్ ప్రభుత్వం వచ్చాక 2020 డిసెంబర్‌లో తెలంగాణ క్యాడర్ నుండి ఏపీకి వచ్చారు ఐఏఎస్ శ్రీలక్ష్మి. 2024 జూన్ 19న శ్రీలక్ష్మిని బదిలీ చేసిన కూటమి సర్కార్.. ఇప్పటి వరకూ ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో కార్యదర్శిగా వచ్చిన శ్రీలక్ష్మి.. నెలల వ్యవధిలోనే ముఖ్య కార్యదర్శిగా, అక్కడ నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతులు పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ఆనాడు శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పించింది వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి బదిలీ చేసే వరకూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలోనే కొనసాగారు శ్రీలక్ష్మి.
మున్సిపల్ శాఖలో శ్రీలక్ష్మి చక్రం తిప్పుతున్న సమయంలో.. ఆ శాఖకు మంత్రులుగా పనిచేసింది బొత్స సత్యనారాయణ, తర్వాత ఆదిమూలం సురేష్. ప్రభుత్వంలో సీఎస్‌ను కూడా లెక్క చేయని శ్రీలక్ష్మి… కేవలం సీఎం జగన్ మాట మాత్రమే వినేదంటారు. ఈ క్రమంలో టీడీఆర్ బాండ్లలో చోటు చేసుకున్న భారీ అవినీతిలో.. ప్రధాన సూత్రధారి శ్రీలక్ష్మే అన్న ఆరోపణలొచ్చాయి. మంత్రులనే లెక్క చేయని శ్రీలక్ష్మి.. ఇక ఎమ్మెల్యేలను అయితే చీపురు పుల్లల్లా తీసిపడేసేవారట. ఏ ఎమ్మెల్యే అయినా సరే.. డబ్బులిస్తేనే ఆమె దగ్గర పని జరిగేదట. ఎమ్మెల్యేలు కూడా చాలా పనులు ఆమెకు డబ్బులు ఇచ్చే చేపించుకునేవారట.
Also Read: Jagan Munchadu: కడపలో కాంట్రాక్టర్ అని చెబితే పిల్లనివ్వడం లేదట!
విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ వ్యయం అంచనాలను భారీగా పెంచేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇందులో శ్రీలక్ష్మినే కీలకం. 160 కోట్ల నుండి ఏకంగా 400 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం పెంచేశారు. ఇంకా అసంపూర్తిగానే ఉన్న ఆ పనుల్లో.. మొత్తం ఖర్చులో సగానికి పైగా అవినీతే అన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమీషనర్ల బదిలీల్లోనూ చేతివాటం చూపించారట శ్రీలక్ష్మి. బదిలీల విషయంలో ఎమ్మెల్యేల సిఫార్సులను చెత్తబుట్టలో పడేసి, ఆమెకు నేరుగా డబ్బులు ఇచ్చిన వారికే బదిలీలు చేశారని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మున్సిపల్ శాఖలో పలు టెండర్లలో పలు చోట్ల భారీగా అంచనాలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. భూముల కన్వర్షన్‌లలోనూ భారీగా లంచాలు బొక్కేవారట. వ్యవసాయ భూముల నుండి వ్యవసాయేతర భూములుగా మార్పు చేయడం, ఇండస్ట్రీస్ భూములు నివాస స్థలాలుగా మార్చే అంశంలో భారీగా లంచాలు తీసుకున్నట్లు చెబుతారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రయివేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయింపుల్లో కూడా భారీగా లంచాలు వసూలు చేసేవారట ఐఏఎస్ శ్రీలక్ష్మి.
వైసీపీ హయాంలో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. అదే మాదిరిగా తిరుపతిలోనూ 200 కోట్ల వరకూ టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సయమంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. వీరి మధ్య పంపకాల్లో తేడా రావడం వల్లే… శ్రీలక్ష్మి గుట్టు నేడు భూమన బయటపెట్టినట్లు తెలుస్తోంది. అదే మాదిరిగా రేపు విచారణలో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భూమన తెలివిగా స్కామ్‌ని మొత్తాన్ని శ్రీలక్ష్మిపైకి నెట్టారు కానీ, వైసీపీ మాత్రం భూమన వ్యాఖ్యలని వెనకేసుకుని వచ్చే పరిస్థితి కనబడటం లేదట. ఎంతైనా అవినీతి చక్రవర్తి మనసు గెలుచుకున్న అధికారిణి కదా!

