Special Story on Hidma: మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న హిడ్మా ప్రస్తుతం పీఎల్‌జీఏ కంపెనీ -1 కమాండర్‌గా కొనసాగుతున్నాడు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా లేటెస్ట్ ఫొటో భద్రతా దళాలకు చిక్కింది. 25 సంవత్సరాలుగా హిడ్మా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన పాత చిత్రాన్నే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. అయితే అతను ప్రస్తుతం ఎలా ఉంటాడనేది ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియలేదు.
ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్నదని అమిత్ షా ప్రకటించిన తరుణంలోనే హిడ్మా ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నేషనల్ పార్క్ దండకారణ్యంలో వేలాది మంది సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కీలక నేతలను కోల్పోయింది. పార్టీ అధినేత బస్వరాజు అలియాస్ నంబాల కేశవరావు సైతం మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్ కమాండర్‌గా కొనసాగుతున్న హిడ్మా నేషనల్ పార్కులోనే ఉన్నాడని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఉన్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా ఫొటో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
హిడ్మా ప్రస్తుత వయస్సు 51 సంవత్సరాలు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాను పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతో పిలుస్తారు. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు ఉన్నట్లు చెబుతారు. కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపుదాడులు నిర్వహించడంలో దిట్ట. కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న హిడ్మాను తుదముట్టించే ఉద్దేశంతోనే ఆయన ఫొటోను బహిర్గతం చేశారని పలువురు అనుమానిస్తున్నారు.
Also Read: Mahesh kumar goud: ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్, కేటీఆర్ తలదించుకోవాలి
Special Story on Hidma: మడావి హిడ్మాకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని, దగ్గరగా ఉండే ఏ-టీమ్‌లో 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బీ-టీమ్‌లో 20 నుండి 22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారని, వారితో పాటు హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాల్సిందేనట. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలిసింది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ప్రచారం.
హిడ్మా ప్రస్తుతం పీఎల్‌జీఏ కంపెనీ -1 కమాండర్‌గా కొనసాగుతున్నాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజినల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్‌గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామా ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతో పాటు హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెల రోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపుదాడికి దిగారు. హెలికాప్టర్ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపై కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజులు నెలకొన్న ఉత్కంఠ హిడ్మా అంటే హడల్ అనే విధంగా మారింది.
దీంతో భద్రతా దళాలు హిడ్మాపై కూపీ లాగడం మొదలుపెట్టాయి. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్‌పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్‌జీ జవాన్లు చనిపోయారు. అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్‌లో హిడ్మా నేతృత్వంలో జరిగిన చింతల్‌నార్-టేకుమెట్ల దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరిగింది. చూడాలి మరి దండకారణ్యంపై పూర్తి పట్టు ఉన్న హిడ్మా భద్రతా దళాలకు చిక్కుతాడా, ఇప్పటికే ఎస్కేప్ అయ్యాడా?