Singanamala MLA Sravani

Singanamala MLA Sravani: సైకిల్‌ని రాంగ్‌ ట్రాక్‌లో నడిపిస్తున్న ఆ నెల్లూరు పెద్దారెడ్డి!

Singanamala MLA Sravani: అనంతపురం ఉమ్మడి జిల్లాలో సింగనమల, మడకశిర రెండూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలే. సింగనమల నుంచి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా గెలిస్తే, మడకశిర నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెస్ రాజు గెలుపొందారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గం సింగనమలనే. కానీ ప్రజాప్రతినిధులుగా వీరి వ్యవహార శైలిలో మాత్రం ఇద్దరి మధ్యా అసలు పొంతనే లేదట. మడకశిర ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధితో పాటు, స్థానిక ప్రజల మన్ననలు పొందుతూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దూసుకెళ్తున్నారు. కానీ సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి పాలన తొలి ఏడాదిలోనే ట్రాక్ తప్పి, గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందట. ఇక్కడ తరచూ నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే మధ్య చోటు చేసుకుంటున్న వివాదాలు.. టీడీపీ అధిష్ఠానానికి పెద్ద తలపోటుగా మారాయట. మడకశిర నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే, సింగనమల నియోజకవర్గం నిత్యం వివాదాలతో అభివృద్ధిలో వెనకబడిపోయిందని ఇక్కడి స్థానిక ప్రజల నుంచి క్యాడర్ వరకు గగ్గోలు పెడుతున్నారట.

ఎమ్మెల్యేగా గెలిచాక బండారు శ్రావణి తీరు పూర్తిగా మారిపోయిందంటున్నారు నియోజకవర్గ తమ్ముళ్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లేవారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రూట్ సపరేట్‌ అయ్యిందని, కార్యకర్తల దగ్గర నుంచి టూ మెన్ కమిటీ, మండల నాయకుల వరకూ అంతటా అందరితో పేచీలతో, పార్టీని బలహీనపరుస్తూ, నియోజవకర్గ అభివృద్ధినీ గాలికి వదిలేశారని టాక్‌ నడుస్తోందట. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గత 30 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూస్తే, ఇక్కడ ఏ పార్టీవారైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. 2024లోనూ ఈ సెంటిమెంట్ నిజమైంది. కానీ 2029 ఎన్నికల్లో సింగనమల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోందంటూ క్యాడర్‌, లీడర్లతో పాటూ ప్రజలూ చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యవహార శైలితో సింగనమలలో టీడీపీ డౌన్‌ ఫాల్‌ అయితే… 2029లో ఇక్కడ పార్టీ గెలవడం కష్టం అన్న టాక్‌ వస్తే… దాని ప్రభావం స్టేట్‌ వైడ్‌గా ఉంటుందని తమ్ముళ్లు కలవరపడుతున్నారట. ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇంతటి చరిత్ర, సెంటిమెంట్‌ ఉన్న నియోజకవర్గంలో పార్టీ చిన్నాభిన్నం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందని సింగనమల తెలుగుదేశం క్యాడర్ భావిస్తోందట.

Also Read: India-UK: భారత్-బ్రిటన్ చారిత్రక వాణిజ్య ఒప్పందం: కొత్త శకానికి నాంది!

“నేను మోనార్క్‌ని, ఎవరి మాటా వినను” అనే విధంగా సింగనమల ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారా? టీడీపీ బాస్ చెప్పినా రాజకీయ పద్ధతులు మార్చుకోలేకపోతున్నారా? ఆమెతో తప్పటడుగులు వేయిస్తున్న వారెవరు? అన్న అంశానికొస్తే… అన్ని వివాదాలకు కేంద్ర బిందువు ఆ నెల్లూరు పెద్దారెడ్డే అన్నది నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినబడుతోన్న మాట. ఆ నెల్లూరు పెద్దారెడ్డికి సింగనమల నియోజకవర్గ రాజకీయాలపై అవగాహన జీరో. అలాంటి వ్యక్తి అక్కడ రాజకీయాల్లో వేలు పెడితే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయట.అనఫిషియల్‌గా ఎమ్మెల్యే బండారు శ్రావణి తెరవెనుక రాజకీయ వ్యవహారాలన్నీ ఆయన కన్సల్టెన్సీలోనే జరుగుతున్నాయన్న చర్చ అంతటా జరుగుతోందట. అసలు ఆ నెల్లూరు పెద్దారెడ్డికి ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏంటనేది క్యాడర్ వేస్తోన్న ప్రశ్న. నెల్లూరు పెద్దారెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేకి సలహాదారులుగా చలామణి అవుతూ, రాంగ్‌ డైరెక్షన్లో ఎమ్మెల్యేను ముందుకు తీసుకెళ్తున్నారా? ఇలాంటి తప్పిదాల వల్లే… టీడీపీ అక్కడ నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అవుతూ, పార్టీ బలహీనపడుతోందా? అన్న సందేహాలు ఇక్కడి ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయట.

టీడీపీ సభ్యత్వాలలోనూ సింగనమల వెనకబడిందట. ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలోనూ సింగనమల ఎమ్మెల్యే వెనకబడిపోయారట. ఎమ్మెల్యే నిత్యం వివాదాల్లో కూరుకుపోవడమే దీనికి కారణమట. టీడీపీ అధినేత ఇప్పటికైనా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి, పార్టీని కాపాడాలని కోరుతున్నారట సింగనమల క్యాడర్‌. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేలోపు సింగనమలలో పార్టీని సెట్‌ రైట్‌ చేయకపోతే… చాలా సమస్యలు వస్తాయంటూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లకు మొరపెట్టుకుంటున్నారట. మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *