Sand Mafia

Sand Mafia: ఆ జిల్లాలో ఇసుక మాఫియా వైసీపీకి ఏమాత్రం తీసిపోవడం లేదా?

Sand Mafia: ఆంధ్రప్రదేశ్‌లో 2019 తర్వాత ఇసుక విధానంలో కొత్త పాలసీ తెచ్చి ప్రకృతి విధ్వంసానికి నాంది పలికింది గత వైసీపీ ప్రభుత్వం. గత ఐదేళ్లు ఇసుక దొరకక సామాన్య ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో చూశాం. అయితే ఆ పాలసీతో ప్రజా ప్రతినిధులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఏపీలో ఇసుక కన్నా బంగారం కొనొచ్చు అనే విధంగా వైసీపీ పాలసీ దారుణంగా విఫలమైంది. వైసీపీ పాలకులు ప్రకృతిని ధ్వంసం చేయడంతో 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీని పాతాళానికి తొక్కి బంగాళాఖాతంలో కలిపేశారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మారింది తప్ప.. ఇసుక మాఫియాకు బ్రేకులు పడలేదన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్య ప్రజలకు సులభంగా ఇసుక అందే విధంగా రూపొందించిన విధానం.. ఇప్పుడు అదే ప్రభుత్వానికి శాపంగా మారింది అంటున్నారు పరిశీలకులు. ఇందుకు కారణం కొందరు ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తుండటమేనట. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ, గత వైసీపీ, ఇప్పటి కూటమి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం లేదనే విధంగా.. కొందరు కూటమి నేతలు ఇసుక బకాసురుల్లాగా అవతారమెత్తి లక్షల రూపాయలతో జేబులు నింపుకుంటున్నారట.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలో చిత్రావతి నది కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు భూగర్భ జలాల మీదే హార్టికల్చర్, తోటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇసుక దోపిడీ యథేచ్ఛగా చేస్తూ.. మూడు పువ్వులు, ఆరు కాయలు అనేలా సంపాదించారట. గత ఎన్నికల్లో బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్‌ ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుపొందటంతో.. ప్రకృతి దోపిడీదారులకు ఇక అడ్డుకట్ట పడినట్లేనని నియోజకవర్గ ప్రజలు భావించారు. అయితే, అక్కడ మాత్రం మంత్రి పేరు చెప్పుకుంటూ కొందరు నాయకులు ఇసుక మాఫియాకు తెర లేపారని తెలుస్తోంది. పట్టపగలు హిటాచీలు, జేసీబీలతో ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఏమాత్రం అటువైపు చూడట్లేదన్నది మరో ఆరోపణ. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం రీచ్‌లకి ఇస్తోన్న పర్మిషన్ గోరంత.. ఇసుక బకాసురులు తవ్వుకునేది కొండంత. ధర్మవరం నియోజకవర్గంలో ఇలానే చేస్తున్నారంటూ ముగ్గురు నాయకులపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇల్లీగల్ ఇసుక మాఫియా.. మంత్రికి తెలీకుండా చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా? అన్నది ఇక్కడ మరో కొసమెరుపు. గత పాలకులు ఇదే తంతు చేశారనీ, ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలకులు కూడా చిత్రావతి నదిని దోసుకువెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్నా పరివాహ ప్రాంతమైన పామిడి, గుత్తి, గుంతకల్ నియోజకవర్గాల్లో కూడా ఇసుక దందా ఇదే విధంగా కొనసాగుతోందట.

ALSO READ  Pastor Praveen Pagadala: వారి అజెండా మత కల్లోలాలా?

Also Read: MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్..

Sand Mafia: అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోనూ ఇసుక దోపిడీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వానికి ఇసుక ఎంత డ్యామేజ్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే తంతు జరుగుతోందని విమర్శలొస్తున్నాయ్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినా.. ఇసుక మాఫియా మాత్రం కట్టడి కాదేలంటున్నారు అనేకచోట్ల స్థానిక ప్రజలు. మైనింగ్, విజిలెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్లు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా, తనిఖీలు తూతూ మంత్రంగా చేస్తూ.. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తున్నారనేది ప్రతి నియోజకవర్గంలోనూ వినిపిస్తోన్న మాట. దొంగల్ని అరికట్టాల్సిన యంత్రాంగమే దొంగలతో చేతులు కలిపితే ఇక ప్రకృతిని ఎవరు రక్షిస్తారనేది ఇక్కడ ఎదురవుతోన్న ప్రశ్న.

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీరియస్‌గా దృష్టి సారించి.. ప్రకృతిని విధ్వంసం చేసే నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో అసలే అడపాదడపా వర్షపాతంతో కరువు చాయలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో నదులను విధ్వంసం చేసే ఇసుక రాబందులను కట్టడి చేయకపోతే భూగర్భ జలాలు అడుగంటి, తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఎదురవుతుందంటున్నారు ఇక్కడి స్థానిక ప్రజలు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *