Sajjala Suputruda

Sajjala Suputruda: సజ్జల చేసిన ఆ ఒక్క మిస్టేక్‌తో దొరికేసిన భార్గవ్

Sajjala Suputruda: వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు కీలకంగా వెలుగులోకి వచ్చింది. గతంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేసిన భార్గవ, ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టించేలా సోషల్ మీడియా పోస్టులను రూపొందించాడు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోయిన భార్గవ, ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లోనూ అతని పాత్ర ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చంద్రపతి ప్రద్యుమ్నలకు సంబంధించిన తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్‌లలోని 12 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. ఈ సోదాల్లో భాగంగా.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని భీమ్ స్పేసెస్ ఎల్‌ఎల్‌పీ అనే కంపెనీ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేయగా.. ఆ కంపెనీలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఈ షెల్‌ కంపెనీలో కీలక వ్యక్తి ఎవరో తెలుసా? చంద్రపతి ప్రద్యుమ్న. అతనెవరంటారా? గత ఎన్నికల్లో లారీలో తరలిస్తుండగా పట్టుబడ్డ 8 కోట్ల రూపాయలు తనవే అని క్లయిమ్‌ చేసుకున్న వ్యక్తే ఈ ప్రద్యుమ్న. 2021 డిసెంబరులో స్థాపించిన భీమ్‌ స్పేసెస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీని మద్యం కుంభకోణంలో ముడుపుల సొమ్మును రూటింగ్ చేయడానికి, నల్లధనాన్ని వైట్‌లోకి మార్చడానికి ఉపయోగించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ కంపెనీలో మరో డైరెక్టర్‌గా ఉన్నదెవరో తెలుసా? వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పుత్రరత్నం అయిన మోహిత్‌రెడ్డి. అంటే చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, చంద్రపతి ప్రద్యుమ్నల మానస పుత్రికే ఈ భీమ్‌ స్పేసెస్‌ ఎల్‌ఎల్‌పీ అనే డొల్ల కంపెనీ. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు తనదే అని క్లెయిమ్ చేసిన ఈ కంపెనీలో వన్‌ ఆఫ్‌ ది డైరెక్టర్స్‌ అయిన చంద్రపతి ప్రద్యుమ్న, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి సిట్‌ విచారణ ప్రారంభమైన వెంటనే దుబాయ్‌కు పరారయ్యాడు.

ఇక తిరుపతి వైసీపీ నేతల ఇళ్లు, కంపెనీ కార్యాలయాలలో జరిపిన సిట్‌ సోదాలలో మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి. తిరుపతిలోని నిఖిలానంద అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేయగా.. సీఎంఆర్ ప్రాజెక్ట్స్‌తో పాటు 10కి పైగా షెల్ కంపెనీలు ఒకే చిరునామా నుంచి నడుస్తున్నట్లు తేలింది. వెల్‌టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో ఉన్న బోర్డు బోగస్‌గా గుర్తించబడింది. ఆర్‌ఓసీలో అటువంటి కంపెనీ అసలు లేదని తెలిసింది. ఈ కంపెనీలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డిలకు చెందినవిగా సిట్‌ గుర్తించింది. విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు ఇన్‌ఛార్జిగా ఉంటూ.. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేశాడు. అతనికి చెందిన నిఖిలానంద లాజిస్టిక్స్ సంస్థ మద్యం రవాణా కాంట్రాక్టులు నిర్వహించి, భారీగా దోచుకున్నట్లు సిట్ గుర్తించింది. లారీ క్లీనర్‌గా మొదలు పెట్టి ఎర్ర చందనం బడా స్మగ్లర్‌గా ఎదిగిన విజయానందరెడ్డి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దది. దోచుకోవడంలో అతని నైపుణ్యాన్ని పసిగట్టి వైసీపీ అతనికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది.

Also Read: Perni Nani: వైసీపీని కాపాడాలన్న కసి కుదుటగా ఉండనివ్వట్లేదా?

జగన్‌ హయాంలో సకల శాఖలకు మంత్రిత్వం వహించినా… తాను, తన కుమారుడు ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని వైసీపీలోనే చెప్పుకుంటూ ఉంటారు. అటువంటిది.. ఏం కనుక్కుంటారులే అని అలుసుగా తీసుకున్నారేమో తెలీదు కానీ… స్వయానా కుమారుడిని ఓ షెల్‌ కంపెనీలో డైరెక్టర్‌గా చేర్చారు. దాంతో కుమార సజ్జల లిక్కర్‌ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. సిట్ సోదాల్లో డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటా స్వాధీనం చేసుకోవడంతో మద్యం కుంభకోణంలో మనీ రూటింగ్ వివరాలు మరింత స్పష్టంగా బయటకు వస్తున్నాయి. సజ్జల భార్గవరెడ్డికి రేపోమాపో నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.

తనయుడు లిక్కర్‌కేసులో ఇరుక్కోవడంతో సజ్జల బాగా డీలా పడినట్లున్నారు. ప్రద్యుమ్న అనే వ్యక్తికి లిక్కర్‌ స్కామ్‌తో సంబంధాలుంటే అతన్ని విచారించి, అతని తప్పేమైనా ఉంటే తేల్చాలి కానీ, అతని కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నంత మాత్రాన తన కుమారుడిని కూడా అనుమానిస్తారా? అంటూ సజ్జల వాదిస్తున్నారు. అసలు సిట్‌కు ఎలా విచారణ చేయాలి? ఎవరెవర్ని విచారించాలి? ఎవర్ని విచారించకూడదో కూడా సజ్జలే చెప్పేస్తుండటం ఒక విడ్డూరమైతే.. అసలు ఆ కంపెనీకి బ్యాంక్‌ ఖాతా కూడా లేదని, ఇక మనీ రూటింగ్‌ ఎలా అని సజ్జల సెలవివ్వడం మరో విచిత్రం. మరి బ్యాంక్‌ ఖాతా కూడా లేనటువంటి డొల్ల కంపెనీలలో సజ్జల భార్గవ్‌కు ఏం పని? డైరెక్టర్‌గా ఉంటూ ఆ కంపెనీలో ఏం వెలగబెడుతున్నట్లు అన్నది మాత్రం సజ్జల చెప్పట్లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *