Revanth vs Cabinet

Revanth vs Cabinet: రేవంత్‌కు, మంత్రులకు పడటం లేదా?

Revanth vs Cabinet: తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల మధ్య అంతర్గత ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, మంత్రుల అధికారాన్ని కాదనడం సెక్రటేరియట్‌లో చర్చనీయాంశంగా మారింది. మంత్రులకు తెలియకుండానే శాఖల్లో నిర్ణయాలు జరుగుతున్నాయని, సీఎంఓ ఆదేశాలే అధికారులకు పరమావధిగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రులు తమ శాఖల అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు. సీఎంవో నుండే నేరుగా తమకు ఆదేశాలు వస్తోంటే.. ఇక మంత్రులతో పనేంటి అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారట. ఈ పరిస్థితిపై మంత్రులు.. సీఎం సన్నిహితులకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఈ ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి సీతక్కకు తెలియకుండానే సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెస్లీ ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల 35,781 అంగన్‌వాడీ కేంద్రాలకు 70,000 టేబుళ్ల సరఫరా కోసం రూ.28 కోట్ల అంచనాతో ఏప్రిల్ 23న టెండర్ ప్రకటన జారీ చేశారు. అయితే, నిబంధనలను నాలుగు సార్లు మార్చి, మే 9న టెక్నికల్ బిడ్ తెరిచి, ఫైనాన్షియల్ బిడ్‌ను వాయిదా వేశారు. సోమవారం బిడ్ తెరవకముందే సాంకేతిక ఇబ్బందుల సాకుతో టెండర్ రద్దు చేశారు. ఈ రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక ప్రైవేట్ సంస్థ టేబుళ్ల సరఫరా కోసం మంత్రి సీతక్కను సంప్రదించగా, ఆమె వారికి టెండర్‌లో పాల్గొనాలని సూచించారు. అయితే, ఆ సంస్థ అనుభవం, సరైన పత్రాలు లేకపోవడంతో టెండర్ మరో కంపెనీకి వెళ్లే అవకాశం కనిపించింది. దీంతో ఆ సంస్థ కీలక నేత ద్వారా సీఎంఓపై ఒత్తిడి తెచ్చారనీ, దీంతో అధికారులు సీతక్కకు తెలియకుండానే టెండర్ రద్దు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల నిల్వ ర్యాక్‌లు, గుడ్లు, కందిపప్పు సరఫరా టెండర్‌లలోనూ నిబంధనలు మార్చడం, సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి.

Also Read: Cm chandrababu: గుడ్ న్యూస్.. ఆరోజు నుంచి ఏపీలో ఫ్రీ బస్సు

Revanth vs Cabinet: సీతక్క శాఖలో అధికారులు సీఎంఓ ఆదేశాలను మాత్రమే పాటిస్తూ, మంత్రి సూచనలను పట్టించుకోవడం లేదని శాఖ సిబ్బంది చెబుతున్నారు. టెండర్ విధానాన్ని ఎత్తివేసి, నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. ఈ సమస్య సీతక్క శాఖకే పరిమితం కాదట.. ఇతర మంత్రుల శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మంత్రుల సన్నిహితులు చెబుతున్నారు. కొందరు మంత్రులు ఈ విషయాన్ని సీఎం, కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట. హైకమాండ్ ఈ ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించి, సఖ్యతగా పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను కొందరు మంత్రులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కూడా హైకమాండ్‌కు సమాచారం అందిందట. దీంతో సీఎం సదరు మంత్రులపై నిఘా పెట్టినట్లు చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు… బయట సన్నిహితంగా కనిపించినా, తెరవెనుక రాజకీయ గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. సీఎం, హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *