Revanth Sweet Warning: ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరినా హైదరాబాద్‌కే పరిమితం కావడంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ ఇక నుంచి ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో మకాం వేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు వారిని జాగృతం చేయాలని కోరారు. వారం చివరలో చుట్టపుచూపుగా ఎమ్మెల్యేలు ఉదయం నియోజకవర్గానికి వెళ్లి సాయంత్రానికి హైదరాబాద్ చేరుతున్నారని, ఇలా అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరువవుతాయని నిలదీశారు.
సీఎం రేవంత్ ఇటీవల మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక మనోడు… మంచోడు.. అని ఉండదు. కానీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైంపాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలి. అవసరమైతేనే హైదరాబాద్ రావాలని హుకుం జారీ చేశారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో ఉంటున్నారని మండిపడ్డారు. సీఎల్పీ సమావేశంలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారడం లేదనీ, ఎమ్మెల్యే అయ్యాక మనోడు అనేది ఉండదని, అందరూ పనిచేయాల్సిందేనని, అందరినీ కలుపుకు పోవాల్సిందేనని చెప్పారు.
Also Read: Knr Cong Leaders Fight: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు శత్రువులు అక్కర్లేదు!
Revanth Sweet Warning: కాగా.. వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్‌ను కలిసేందుకు జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. నియోజకవర్గాల్లో తిరగమంటే హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారు..? మీకేం పనిలేదా..? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకే వచ్చాం తప్ప.. హైదరాబాద్‌లో ఉండేందుకు రాలేదని ఎమ్మెల్యేలు చెప్పే ప్రయత్నం చేయగా… అందుకు సీఎం నిరాకరించినట్టు తెలుస్తోంది. సాయంత్రానికి నియోజవర్గాలకు బయల్దేరి వెళ్లాలని, రాత్రికి మీరు నియోజకవర్గాల్లో ఉన్నదీ లేనిదీ వాకబు చేస్తానని, లేనట్టు తనకు తెలిస్తే చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించి ఎమ్మెల్యేలను పంపించినట్టు సమాచారం.
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నది లేనిదీ, ఎక్కడ ఉంటున్నది, రోజువారీ సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సీఎం రేవంత్ తెప్పిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై సీక్రెట్‌గా ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం తాజా వార్నింగ్‌తో.. ఇకనైనా హైదరాబాద్ వీడి.. తమ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతారో లేదో చూడాలి మరి.