Revanth Strategy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ఇప్పుడిప్పుడే అర్థమౌతూ ఉండొచ్చేమో బహుషా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలకు. తమపై రేవంత్ రెడ్డి చేస్తోంది కక్ష పూరిత చర్యలే అని భ్రమపడ్డ బీఆర్ఎస్‌కు, ధీటుగా ఎదుర్కొంటే మనకే మైలేజ్ అని దూకుడుగా రోడ్ల మీదకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలకు.. ఇది పక్కా రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడ అని తట్టిందో లేదో మరి. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందని ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు పరిశీలకులు. ఎందుకంటే… అట్ ఎ టైమ్.. అనేక కేసుల్ని ఎదుర్కొంటోంది ప్రతి పక్ష బీఆర్‌ఎస్ పార్టీ. బీఆర్‌ఎస్ అనే కంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే సమంజసంగా ఉంటుందేమో ఇక్కడ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ కార్ రేస్.. కేసుల్లో టార్గెట్ కేసీఆర్, కేటీఆర్‌లే. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఎక్కడైనా కేసులు, విచారణలు కనబడుతున్నాయా? అంటే మచ్చుకు అక్కడక్కడా కనిపిస్తున్నాయంతే. కానీ వరుస విచారణలతో కేసీఆర్ ఫ్యామిలీలోని నేతల చుట్టే ఉచ్చు బిగుస్తుండటం ఇక్కడ క్లిస్టర్ క్లియర్‌గా కనబడుతోంది. ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు జైళ్ల బాట పడుతున్నారు. దాంతో అక్కడ ప్రతిపక్ష వైసీపీ.. ఏపీలో నడుస్తోంది రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని, తమ నేతల అరెస్టులను రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆ చాన్స్ కూడా లేకుండా చేశారు సీఎం రేవంత్. తన ఫోకస్ అంతా కేసీఆర్ ఫ్యామిలీపైనే అంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దూకుడుగా ముందుకు సాగుతుండటంతో రోజూ ఏదో ఒక సెన్సేషన్ చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్నేసి దారుణాల అంటూ నోరెళ్లబెడుతున్నారు. అదే సమయంలో కాళేశ్వరం కమిషన్ విచారణ కేసీఆర్‌ను తాకింది. ఇక ఈ రేస్ కేసులో జరుగుతున్న దర్యాప్తు ఎపిసోడ్లతో కేటీఆర్ తన సహనాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని కేసుల్లో సీరియల్‌లా సాగుతున్న విచారణలతో… నిత్యం ఆరోపణల్లో మునిగితేలుతూ.. ప్రజల్లో పలుచన అవుతున్నారు కేసీఆర్, కేటీఆర్‌లు. కేసులు నిరూపితమై శిక్షలు పడటం తరువాయి… దానికి ఇంకా చాలా టైమ్ ఉన్నట్లు అర్థమౌతోంది. కానీ ఈ విచారణలు ఎదుర్కొంటున్న క్రమంలో… తండ్రీ కొడుకులను ప్రజలు ద్రోహులుగా భావిస్తే మాత్రం… రేవంత్ వ్యూహం సక్సెస్ అయినట్టే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Also Read: Aashadam Bonalu 2025: నేటి నుండి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం..
Revanth Strategy: తనని అరెస్ట్ చేస్తే.. రెండు నెలలు జైల్లో మెడిటేషన్, యోగా లాంటివి చేసి.. ఫ్రెష్‌గా బయటకొచ్చి పాదయాత్ర మొదలు పెడదాం అనుకున్నారు కేటీఆర్. మొన్న విచారణ సందర్భంగా హరీశ్ రావుని పిలిపించుకుని, ఈ రోజు అరెస్ట్ పక్కా అన్నంత హడావుడి చేశారు. కానీ విచారణ అధికారులు షరా మామూలుగా.. మళ్లీ పిలుస్తాం… అని చెప్పి పంపించేశారు. దీంతో కంట్రోల్ కోల్పోయిన కేటీఆర్.. అరెస్ట్ చేస్తే చేసుకోవాలి కానీ.. ఏందిది? అంటూ రేవంత్‌పై విరుచుకుపడిపోయారు. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తున్నట్లుగానే కనిపిస్తోందంటున్నారు రాజకీయ అనుభవజ్ఞులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న దారుణాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు.. ఈ టాపిక్‌ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలకు ఫీడ్ బ్యాక్ అందుతోందట. రాజకీయ పార్టీల నేతలు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు, రియల్ ఎస్టేట్ ప్రముఖులు, బడా బడా బిల్డర్లు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, ఆఖరికి మీడియా ప్రతినిధుల ఫోన్లు సైతం ట్యాప్ చేయడంపై ఒక రకంగా ప్రజలు అసహ్యించుకుంటున్న పరిస్థితి. ఆ రకంగా శిక్షలు పడుకున్నా సరే, ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే రేవంత్ అమలు చేస్తున్న స్ట్రాటజీ అంటున్నారు అనలిస్టులు.