Rappa Rappa Jagan

Rappa Rappa Jagan: వైసీపీ మానసిక వైకల్యానికి కారణాలేమిటి?

Rappa Rappa Jagan: పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం చేపట్టిన పర్యటన ఒక రకంగా రాష్ట్రాన్ని కుదిపేసిందనే చెప్పాలి. పోలీసుల ఆంక్షలు, అనుమతులు లేకపోయినా, వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొడుతూ, ఆంక్షలను ధిక్కరించి బైక్‌ ర్యాలీలతో హల్‌ చల్‌ చేశారు. జగన్‌ నినాదాలతో హోరెత్తిన ఈ ర్యాలీలో కార్యకర్తలు ప్రదర్శించిన అత్యుత్సాహం, హింసాత్మక ప్లకార్డులు సోషల్‌ మీడియాలో రచ్చ రేపాయి. “రప్పా రప్పా నరుకుతాం”, “గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు ఒక్కొక్కడిని చెక్కేస్తాం”, “అన్న వస్తాడు, అంతు చూస్తాడు” వంటి హింసాత్మక వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ నినాదాలతో, 2029లో అధికారంలోకి వచ్చి ప్రత్యర్థులపై పగ తీర్చుకుంటామన్న సంకేతాలుగా కనిపించాయి. చరిత్రలో ఇలాంటి ఫ్లెక్సీలను బహిరంగంగా ప్రదర్శించిన ఒకే ఒక్క పార్టీగా వైసీపీ రికార్డులకెక్కింది.

ఈ ప్లకార్డులపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. “బహిరంగంగా చంపుతాం, నరుకుతాం అంటున్న వారిని పోలీసులు ఏమీ చేయరా?” అని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తుల వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. గురువారం తాడేపల్లిలో జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివాదం ప్రస్తావనకు వచ్చింది. జగన్‌ తనదైన శైలిలో స్పందిస్తూ, “ఇదేదో సినిమా డైలాగ్‌లా ఉంది. పుష్ప-2 డైలాగులు వాడితే కూడా కేసులు పెడతారా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ స్టైల్‌లో “గడ్డం ఇట్టన్నా తప్పు, అట్టన్నా తప్పేనా” అంటూ చమత్కరించారు. ఒక మీడియా ప్రతినిధి, ఈ ప్లకార్డు పట్టిన వ్యక్తి గతంలో టీడీపీ సభ్యుడని పేర్కొంటూ… ఆ ఫొటో చూపించడంతో.. జగన్‌ హాస్యాస్పదంగా, “అయితే ఇదంతా చంద్రబాబే చేయించారా?” అని నవ్వేశారు. ఆ వ్యక్తి టీడీపీని వీడి వైసీపీలో చేరి ఉంటాడని, చంద్రబాబు హామీలు అమలు కాలేదని నిరసన వ్యక్తం చేసి ఉంటాడని జగన్‌ ముక్తాయించారు.

Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్ళీ వాయిదా!

Rappa Rappa Jagan: కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తన పాలనే మెరుగని పాత కథే మరొకసారి చెప్పుకొచ్చారు వైఎస్‌ జగన్‌. అయితే, ఈ హింసాత్మక ఫ్లెక్సీలు వైసీపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ, ఇటువంటి చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే.. శాశ్వతంగా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పార్టీని రాజకీయంగా సమాధి చేసుకోకుండా… ఈ ఫ్యాక్షన్‌ రాజకీయాల నుంచి బయటపడాలని వైసీపీకి సూచిస్తున్నారు. అయితే జగన్‌ ఈ తరహా సూచనల్ని పట్టించుకుంటారని భావించలేం. ఇవాళ్లి ప్రెస్మీట్‌లో తన కార్యకర్తల అరాచక మనస్థత్వానికి మన్నలు ఇస్తూ, వెనకేసుకురావడమే అందుకు నిదర్శనం.

2014లో వైసీపీ అధికారానికి దగ్గరగా వచ్చి చేజార్చుకుంది. ఐదేళ్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి 2019లో అధికారంలోకి రాగలిగింది. అయితే 151 సీట్లతో అధికారం కళ్లజూసిన వైసీపీ.. 11 సీట్లకు పడిపోవడంతో షాక్‌ గురైంది. ఈ షాక్‌ ఆ పార్టీ అధినేత నుంచి, గ్రౌండ్‌ లెవెల్‌ కార్యకర్త వరకూ తట్టుకోలేనిదిగా పరిణమించింది. ఈ క్రమంలోనే వారి ప్రవర్తనలో విపరీత ధోరణులు వచ్చి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారం కోల్పోయి ఒక్క ఏడాది కూడా ఓపిక పట్టలేక పోతుండటాన్ని, సహనం కోల్పోయి ప్రత్యర్థులని చంపాలి, నరకాలి అనే స్థాయికి చేరుకోవడాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి వైసీపీ అధినేతతో సహా, ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు.. సైకాలజీ, మోటివేషన్‌ క్లాసులు అవసరమని సూచిస్తున్నారు. లేదంటే.. వైసీపీ రాజకీయంగా తన మనుగడ కోల్పోవడమే కాకుండా, రాష్ట్ర శాంతి భద్రతలకు ప్రమాదకరమైన మిలిటెంట్‌ గ్రూప్‌గా మారినా ఆశ్చర్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు. వైసీపీ విపరీత ప్రవర్తనని రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తూ వదిలేయకూడదని, అరాచకం వైపు మళ్లుతున్న వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *