Rajampet TDP Story: రాజంపేటలో టీడీపీ ఇంచార్జ్ రేసు కాస్తా రచ్చగా మారి, పార్టీ లీడర్ల మధ్య గ్రూపు తగాదాలు, వర్గ విభేదాలకు దారి తీస్తోందన్న చర్చ నడుస్తోంది. ఇంచార్జ్ పోస్టు లోకల్‌కి ఇవ్వాలా? నాన్ లోకల్‌కి ఇవ్వాలా అన్న వాడీవేడీ చర్చ నడుస్తున్న వేళ… బలిజ సామాజిక వర్గానికే ఈ సారి ఇంచార్జీ పదవి ఇవ్వాలని సమావేశాలు పెడుతున్నారట. ఇలా ఎవరి లెక్కల్లో వారే అన్న చందంగా రాజంపేటలో టీడీపీలో రాజకీయం నడుస్తోంది. మరోవైపు టీడీపీ లీడర్ల మధ్య విభేదాలే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు ప్లస్‌లు మారుతున్నాయన్న ఆందోళన క్యాడర్‌లో నెలకొంది. ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు వైసీపీ ఎమ్మెల్యేకు బాగా కలిసి వస్తున్నాయట. ఈ వర్గ విబేధాల వల్లే గత ఎన్నికల్లో అభ్యర్థి ఓటమి చెందాడనీ, ఇప్పటికైనా అధిష్టానం రాజంపేటపై దృష్టి పెట్టకపోతే జరిగే నష్టం పూడ్చలేనిదిగా మారుతుందని క్యాడర్ హెచ్చరిస్తోంది. పార్టీలో ఈ వర్గ విభేదాలకు బ్రేక్ పడాలంటే రాజంపేట ఇంచార్జ్‌ను అధిష్టానం వెంటనే ప్రకటించాలని కోరుతోంది.
రాజంపేటలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తెలుగుదేశం పార్టీ ఉంది. గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడ్డ టీడీపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే లీడర్లు వర్గాలుగా విడిపోయారు. ఎవరికీ వారే ఇంచార్జ్ పదవి తమకే వస్తుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. ఇంచార్జ్ రేసులో ప్రధానంగా జగన్మోహన్ రాజు, మేడా విజయ శేఖర్ రెడ్డి, బత్యాల్ చంగల్ రాయుడు, బాలిశెట్టి హరిప్రసాద్, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చప్పిడి మహేష్ నాయుడులు ఇంచార్జ్ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరంతా వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే గొడవలు పడుతున్న నేపథ్యంలో ఇటీవల ఏకంగా ఒంటిమిట్ట మట్టి మాఫియాలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడ్డారు. రాజంపేట నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందని చెబుతున్నారు. టీడీపీలో ఈ కుమ్ములాటలు వైసీపీ ఎమ్మెల్యేకి కలిసి వస్తున్నాయని ప్రజలనుకుంటున్నారు.
Also Read: VPR minus YCP plus: రాజకీయం మిస్ అవుతున్న వీపీఆర్ కపుల్..
ఇక క్యాడర్ సైతం వర్గాలుగా విడిపోయి… ఏ వర్గానికి చెందినవారు తమ నాయకుడే ఇంచార్జ్ అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒంటిమిట్ట, సుండుపల్లి.. ఇలా దాదాపు అన్ని మండలాల్లో ఎవరికీ వారు పెత్తనం చలయిస్తున్నారు. కడప ఉమ్మడి జిల్లాలో టీడీపీకి కంచుకోట అనుకున్న రాజంపేటలోనే పరిస్థితి ఎందుకు గందరగోళంగా ఉందో అంతుబట్టని పరిస్థితి. వర్గ పోరుకు అడ్డుకట్ట వేస్తే తప్ప రాజంపేటలో పరిస్థితి మారే అవకాశం లేదు. అది జరగాలంటే పార్టీని ఏకతాటిపై నడిపించే నేతను ఇంచార్జ్‌గా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ అధిష్టానం నిర్ణయం వల్లే రాజంపేటలో తమ్ముళ్ల మధ్య సయోధ్య కుదురుతుంది తప్ప.. ఆలస్యం చేస్తే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హెచ్చరిస్తున్నారు. తీవ్రతను గుర్తెరిగి అధిష్టానం ఇకనైనా త్వరపడుతుందో లేదో మరి.
