Pulivendula YS Police

Pulivendula YS Police: జగన్‌ బంధువు కోసం రూ.10 కోట్ల ‘సెటిల్మెంట్’

Pulivendula YS Police: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కూడా ఇంకా కొంత మంది అధికారులు వైసీపీకి సానుకూలంగా వ్యవహారిస్తున్నారు. అందుకు నిదర్శనం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో పోలీసుల పనితీరే. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంటే.. పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు కలలు కంటున్నట్లు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కట్టప్పలుగా పని చేసిన పులివెందుల పోలీసుల తీరు ఇప్పటికీ మారడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు కారణం ప్రభుత్వం మారినా పులివెందుల పోలీసుల పని తీరు మారకపోవడమే. తాజాగా… అసలు సంబంధం లేని సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని, వైసీపీ నేతలకు మేలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పులివెందులకే కాదు, అసలు రాష్ట్రానికే సంబంధం లేని విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది.

కడప జిల్లాకు కాదు కదా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా సంబంధం లేని ఓ ఇష్యూని పులివెందుల పోలీసులు డీల్‌ చేశారు. వైసీపీ నేత, జగన్‌ సొంత బంధువు అయిన దుష్యంత్ రెడ్డికి మేలు చేసేందుకు ఈ వ్యవహారంలో తలదూర్చి రూల్స్‌కి ఎగనామం పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ దుష్యంత్‌ రెడ్డి అనే వ్యక్తి లావాదేవీలు తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంటాయి. ఇక ఈ వ్యవహారంలో దుష్యంత్‌ రెడ్డి బాధితులుగా మారిన వారేమో కర్ణాటక స్టేట్‌కి చెందినవారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఏకంగా రాష్ట్రం దాటి పంచాయతీలు చేయడం ఏమిటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు సంబంధం లేని విషయంలో వైసీపీ నేతల మెప్పు కోసం పులివెందుల పోలీసులు బెదిరించి మరీ సెటిల్మెంట్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు అర్బన్ స్టేషన్‌లో కేసు నమోదు అయితే రూరల్ సీఐ విచారణ చేయడం ఇక్కడ మరో విడ్డూరం.

Also Read: VPR minus YCP plus: రాజకీయం మిస్ అవుతున్న వీపీఆర్ కపుల్..

అసలేం జరిగింది అంటారా? బెంగళూరుకు చెందిన లలిత్ జైన్, సుధాకర్ రాజేచర్, జయతీర్థం రాజేచర్, నిర్మల బంటీయా, ఎండీ రామానుజన్‌ అనే ఐదుగురిపై ఇటీవల పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్‌ బంధువు దుష్యంత్‌ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు రిజిస్టర్‌ చేశారు. గతంలో వైసీపీ కమలాపురం ఇంచార్జ్‌గా వ్యవహరించిన దుష్యంత్‌ రెడ్డి… 2014లో కమలాపురం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించాడు. జగన్ అనుచరుడిగా వైసీపీలో కీలకంగా వ్యవహరించాడు. ఇక దుష్యంత్‌ రెడ్డి తండ్రి విజయ్ శేఖర్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. ఇటీవల విజయ్‌శేఖర్‌ రెడ్డి మృతి చెందిన తర్వాత… ఆయన డైరీలో.. పలానా వ్యక్తులు తనకు 10 కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లుగా రాసి పెట్టి ఉండటాన్ని గుర్తించారట. ఈ డబ్బుల కోసమే దుష్యంత్ రెడ్డి పులివెందుల పోలీసులను ఆశ్రయించారని పైకి ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కేసు నమోదు చేసిందేమో పులివెందుల అర్బన్‌ పోలీసులు. కానీ కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే పులివెందుల రూరల్‌ సీఐ రంగంలోకి దిగి.. తన పటాలాన్ని అంతటినీ వేసుకుని హుటాహుటిన బెంగళూరు బయలుదేరి వెళ్లి… విజయశేఖరెడ్డి డైరీలో పేర్లు రాశారని ప్రచారం జరుగుతున్న వ్యక్తులను అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు… వారిని రెండు రోజుల పాటు తన స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. జగన్ బంధువు దుష్యంత్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లుగా వారితోనే బలవంతంగా స్టేట్మెంట్‌ రాయించి పంపారన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం అంతా ఓ పోలీస్ అధికారి ఇంట్లోనే జరగడం కొసమెరుపు. అయితే ఈ తతంగం అధికార పార్టీ నేతలకు తెలిసే జరిగిందా? అన్న అనుమానాలూ ఉన్నాయి. ఇందులో అధికార పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని పులివెందుల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుష్యంత్ రెడ్డి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే… రూరల్ పోలీసులు దర్యాప్తు చేయడం ఏంటో అని పోలీసు వర్గాలే నోరెళ్లబెడుతున్నాయి. మొత్తానికి జగన్ బంధువు దుష్యంత్ రెడ్డి విషయంలో పులివెందుల పోలీసుల వ్యవహారం జిల్లా అంతటా పోలీసులలో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *