Prakash Vs Pawan: రాజకీయాల్లో పవన్ ఏ స్టెప్ తీసుకున్నా సరే విమర్శించడానికి… తగుదునమ్మా అంటూ తయారవుతుంటారు కొందరు పెద్ద ముత్తయిదువులు. అలాంటి వారిలో అందరికంటే ముందుండేది ప్రకాష్ రాజ్. ఆయన ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్న అంశాలకు ప్రచారకర్తగా మారిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ప్రకాశం కోల్పోయిన ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం ద్వారా తన పాపులారిటీ పెంచుకోవచ్చని కకృత్తి పడుతున్నట్లు ఉన్నారు కానీ… అది కాస్తా రివర్స్‌లో పవన్ క్రేజ్‌ని పెంచడానికే దోహదపడుతోంది తప్ప.. ప్రకాషం అంకుల్‌కు ఏమాత్రం ఉపయోగపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఒక్కోసారి ప్రకాష్ రాజ్ తప్పుబట్టే విషయాలు కరెక్టే అనిపించినా.. ఆయన తప్పుబడుతున్న విధానం అస్సలు కరెక్ట్ కాదన్న చర్చే ముందుకొస్తూ ఉంది.
హైదరాబాద్‌లో జరిగిన ‘దక్షిణ సంవాద్’ కార్యక్రమంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పవన్ ప్రసంగించారు. “భాష హృదయాలను కలపాలి. హిందీని ఈ దృక్కోణంతో చూడాలి. విదేశీ భాషలు నేర్చకుంటున్నప్పుడు, హిందీని నేర్చుకోవడంలో ఎందుకు సంకోచం?” అని పవన్ ప్రశ్నించారు. హిందీ భాష భారతదేశ వైవిధ్యాన్ని ఒక తాటిపైకి తెచ్చే కీలకమైన అంశంగా, సమైక్యతను పెంపొందించే సాధనంగా పవన్ వివరించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవడం ద్వారా సమాచార వినిమయం మెరుగవుతుందని, దేశ ఐక్యతకు దోహదపడుతుందని పవన్ వ్యాఖ్యలు సూచించాయి తప్ప అందులో తప్పు పట్టేందుకు ఏమీ లేదు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్
Prakash Vs Pawan: అయితే, పవన్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికైన Xలో పైత్యం ప్రదర్శించారు. “ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ… ఛీ…” అంటూ పవన్‌ను ఉద్దేశించి హద్దు మీరి విమర్శలు గుప్పించారు. పవన్ హిందీని ప్రోత్సహిస్తూ చేసిన వ్యాఖ్యలను ‘లొంగిపోవడం’గా అభివర్ణిస్తూ, ఆయన స్వాభిమానాన్ని ప్రశ్నించే విధంగా ఈ ట్వీట్ ఉండటంతో జనసైనికులు మండిపడుతున్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో పనిగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన ప్రకాశ్ రాజ్, ఈసారి కూడా తన వ్యాఖ్యలతో జనసైనికులను రెచ్చగొట్టారు. అయితే, ఈ ట్వీట్‌కు జనసేన అభిమానులు, శతఘ్ని సోషల్ మీడియా టీమ్ తీవ్రంగా స్పందించారు. ఘాటైన కౌంటర్ ట్వీట్లతో ప్రకాశ్ రాజ్‌కు చురకలు అంటించారు. నీ డబ్బు సంపాదనకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలు దాటి… హిందీ సినిమాలు కూడా కావాలి. కానీ తమిళులు, తెలుగువారు హిందీ నేర్చుకోకూడదా? అంటూ ప్రకాష్ రాజ్ వాదనని ఎండగడుతున్నారు నెటిజన్లు. ఈ దెబ్బకు “షేమ్ ఫుల్ ప్రకాష్ రాజ్” అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు… హిందీని ఒక కమ్యూనికేషన్ సాధనంగా ప్రోత్సహించే దిశగా ఉన్నాయి తప్ప, హిందీని తప్పనిసరి చేయాలని ఆయన మాటల్లో ఎక్కడా లేదు. ఆయన మాటల్లో దేశ ఐక్యతను, భాషల సమన్వయాన్ని పెంపొందించాలనే సదుద్దేశం మాత్రమే కనిపిస్తుంది. భారతదేశానికి భాషా వైవిధ్యం బలమే అయినప్పటికీ, హిందీ వంటి భాష దేశవ్యాప్తంగా సమాచార వినిమయానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందనేది పవన్ చేస్తున్న సూచన. ఇది దక్షిణ రాష్ట్రాల్లోని యువతకు వ్యాపార, విద్యా అవకాశాలను మెరుగుపరచడంలో తోడ్పడుతుందనేది ఆయన వాదన. మరోవైపు, ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు, వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, తన సినీ కెరీర్‌లో ఇటీవలకాస్తా తగ్గిన ప్రజాదరణను ఈ వివాదాల ద్వారా పెంచుకోవాలని భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన ట్వీట్లు, పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను మరింత పెంచడానికి దోహదపడుతున్నాయని, తనకు ఊహించిన స్థాయిలో ప్రచారం రావడం లేదని జనసేన అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.

