Police Tho Vaddu: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ సీనియర్ నేతల వరకు పోలీసులపై ఎక్కడ చూసినా విరుచుకుపడిపోతున్నారు. జగన్ తన పర్యటనలు, ప్రెస్మీట్లలో “బట్టలు ఊడదీస్తా, ఎక్కడున్నా పట్టుకొస్తా” అంటూ పోలీసు అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కేవలం ఆయనతో ఆగలేదు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఓ సీఐపై పళ్లు కొరుకుతూ రెచ్చిపోయారు. వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గతంలో పోలీసు అధికారిగా పనిచేసినప్పటికీ, నేడు పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి విడుదల రజినీ ఇటీవల పోలీసులను అడ్డుకుని రచ్చ చేశారు. అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరిని చూసి మరొకరు, అందరూ ఒకే దారిలో పోలీసులను లక్ష్యంగా చేసుకుంటున్నారు వైసీపీ నేతలు.
అధికారం కోల్పోయినా, ఇంకా పోలీసు వ్యవస్థపై తమ పెత్తనం కొనసాగాలని వైసీపీ నేతలు భావిస్తున్నారా? తమ హయాంలో పోలీసులు తమ ఆదేశాలకు తలొంచారని చిన్నచూపు చూస్తున్నారా? లేక, బెదిరింపుల ద్వారా పోలీసులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అధికారం నుండి దిగిపోయినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తాము కోరుకున్నట్లే నడవాలన్న ఆలోచనలో ఉన్నారా? లేదంటే బెదిరిస్తే కేసులు పెట్టకుండా ఉంటారని భావిస్తున్నారా? ఏది ఏమైనా.. ఈ వైఖరి వైసీపీకే నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
పోలీసు విధులకు ఆటంకం కలిగించడం చట్టపరంగా నేరం. వైసీపీ హయాంలో ఇలాంటి కారణాలతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు తమ వరకు వచ్చే సరికి, వైసీపీ నేతలు పోలీసులనే బెదిరిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌తో పాటు సీనియర్ నేతలు అంబటి రాంబాబు, గోరెంట్ల మాధవ్, విడుదల రజినీ, సీదిరి అప్పలరాజు వంటివారు ముందుండి నడుస్తున్నారు. ఈ ప్రవర్తన వెనుక జగన్‌లోని ఫ్యాక్షన్ మనస్తత్వమే కారణమా? లేక, పోలీసులను భయపెట్టి తమ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు కాకుండా చేయాలనే ఉద్దేశమా? అన్నది చర్చనీయాంశం అవుతోంది.
Also Read: Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
Police Tho Vaddu: ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు రక్షణ కల్పిస్తున్నది పోలీసులే. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే కీలక బాధ్యత వారిది. ఎన్నికల సమయంలో పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు. అలాంటప్పుడు, వైసీపీ నేతలు పోలీసులను టార్గెట్ చేయడం వల్ల వారి రాజకీయ భవిష్యత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఒకవేళ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే, వైసీపీ కార్యకర్తలపై కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించలేక పోతున్నారని అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ నేతలు పోలీసులను టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమైనా కావచ్చు… ఫ్యాక్షన్ మనస్తత్వమో, భయపెట్టి ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనో కానీ.. ఈ వైఖరి వారికే రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్నది పరిశీలకుల మాట. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే కీలక యంత్రాంగం. దానిని ఎదిరించడం ద్వారా వైసీపీ తన బలాన్ని చాటుకోవాలనుకుంటున్నా, ఇది వారి ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నారు. వైసీపీ ఈ దిశలో తన వైఖరిని మార్చుకుంటుందా, లేక ఈ ఘర్షణను మరింత ముందుకు తీసుకెళ్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.
