Pithapuram YCP Game

Pithapuram YCP Game: వర్మ ముందా వైఎస్సార్‌సీపీ కుప్పి గెంతులు!?

Pithapuram YCP Game: కూటమి పార్టీలు విడిపోవాలి. కలలో కూడా ఇప్పుడు వైసీపీ టార్గెట్‌ ఇదేనా? దేవుడు ప్రత్యక్షమై వరం అడిగితే… వైసీపీ అధికారంలోకి రావాలి, జగన్‌ ముఖ్యమంత్రి కావాలి అని అడగడం మానేసి, కూటమి పార్టీలు విడిపోవాలని కోరుకునేలా ఉన్నాయి వైసీపీ శ్రేణులు. అంతలా వారిని కూటమి కలయిక కలవరపెడుతోందా? ఇంకా చెప్పాలంటే.. నిద్ర లేదు. ఆఖలి లేదు. అస్సలు మన:శ్శాంతి లేకుండా పోయిందంటూ బాధపడుతున్నారట తాడేపల్లి పెద్దలు. దీంతో కూటమి పార్టీల మధ్య ఎక్కడ, ఏ చిన్న తగాదా దొరికినా.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు హడావుడి చేస్తూ, రణరంగంలా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవర్నో ఒకర్ని రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి, కూటమిని చీల్చాలని కాచుకుని కూర్చున్న వైసీపీకి… కూటమి పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఎప్పటికప్పుడు తమ మాటలతో, చేతలతో చెక్‌ పెడుతూనే ఉన్నారు. మరో పది, పదిహేనేళ్లు కూటమి విడిపోదంటూ.. స్పష్టమైన సంకేతాలిస్తూ వైసీపీ కోపాన్ని మరింత పెంచేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీకి దొరికిన ఒకే ఒక్క ఆశాకిరణంలా పిఠాపురం వర్మ కనిపించారు. అగ్నికి ఆజ్యం పోస్తే… వర్మని కూటమి నుండి బయటకు లాగొచ్చు అనేది వైసీపీ నేతల రాజకీయ పన్నాగంలా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ రకంగానే వైసీపీ సొంత మీడియాలో వార్తా కథనాలను ఇబ్బడి ముబ్బడి వండి వారుస్తున్నారట. సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారట. ఆఖరికి ఉత్సాహం ఆపుకోలేక… కొత్త ఊహాగాలను తెరలేపారట. టీడీపీ అధినేత విధానాలతో, జనసేన నుండి ఎదురవుతున్న అవమానాలతో వర్మ నొచ్చుకున్నారనీ, టీడీపీ తనకు అన్యాయం చేసిందని గట్టిగా నమ్ముతున్నారనీ, త్వరలోనే కూటమికి చెక్‌ పెడుతూ.. వైసీపీకి జైకొట్టి, జగనన్న చేతుల మీదుగా బులుగు కండువా కప్పించుకుని, పిఠాపురంలో జనసేన అంతు చూసేందుకు రెడీ అవుతున్నారనీ, ఇప్పటికే జగన్‌తో ఆ మేరకు చర్చలు కూడా జరిపారనీ… సొంత మీడియా, సోషల్‌మీడియాల్లో కుకుంగ్‌ స్టోరీలతో హడావుడి చేశారట. అయితే… వైసీపీ తనని ఎంత మోసినా, ఎంత ఆకాశానికి ఎత్తేసినా, ఎంత రెచ్చగొట్టాలని చూస్తున్నా కానీ… వర్మ మాత్రం వైసీపీని కనీసం దేకడం లేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ అంతకన్నా కొత్తగా ఏం చేస్తుంది? ఇంతకన్నా ఆ పార్టీ దగ్గర సరుకు ఎక్కడుంది? అని అనుచరుల వద్ద వైసీపీని, ఆ పార్టీ మీడియా రాస్తున్న కథనాలను చీపురుపుల్లలా తీసి పడేస్తున్నారట ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ.

Also Read: Errabelli: ఎర్రబెల్లి టార్గెట్‌గా చక్రం తిప్పుతున్నది ఎవరు?

ALSO READ  Mahaa Vamsi: టీడీపీతో జోగి ..షాక్ లో నాయకులు ..ఉతికారేసిన తమ్ముళ్ళు

Pithapuram YCP Game: పిఠాపురం నియోజకవర్గాన్ని, వర్మని టార్గెట్‌ చేసుకుని వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు… మొండిఘటం అయిన వర్మ ముందు అస్సలు పారడం లేదని పిఠాపురం సర్కిల్స్‌లో చర్చించుకుంటున్న పరిస్థితి. ఎప్పుడూ లేనిది వర్మ మీద… వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అమితంగా ప్రేమ చూపిస్తుండటం.. వైసీపీ ఎత్తులు, జిత్తులు బాగా తెలిసిన వర్మ.. సైలెంట్‌గానే వాటిని చిత్తు చేస్తుండటం, తాను చేసిన త్యాగాన్ని, పార్టీకి చేస్తున్న సేవల్ని చంద్రబాబు గుర్తుంచుకుంటారనీ, కాస్త లేటైనా తనకు న్యాయం చేస్తారనీ.. తొందర పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని వర్మ తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా జనసేన నాయకులతో భేదాభిప్రాయాలు, కొన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ… వాటిని అంతర్గతంగా ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికే వర్మ సిద్ధపడుతున్నారు తప్ప.. కూటమి మైత్రికి భంగం కలిగించే ఆలోచన అయితే వర్మ చేయట్లేదని చెబుతున్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇక్కడ ఒక మైండ్ గేమ్‌ను ఆడేందుకు ప్రయత్నించారు, కానీ అది వారి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. ఉగాది దాటినా వర్మ టీడీపీలోనే కొనసాగుతూ, తన అభిమానులు, అనుచరుల కోసం పనిచేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో వర్మను రెచ్చగొట్టి, జనసేనపై ఉసిగొల్పాలన్న వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. వర్మ.. జగన్‌ను మించిన మొండి ఘటం అని,
అంతకన్నా చంద్రబాబుకు వీరవిధేయుడనీ.. అందువల్లే వైసీపీ ఎత్తుగడలు విఫలమవుతున్నాయనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *