Peddareddy Big Mistake: జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయం, వైరం కొనసాగుతోంది. తాడిపత్రి నియోజకవర్గం అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తొస్తారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మంచి బలమైన నాయకులు. వారికి గట్టిగా కేతిరెడ్డి కుటుంబం తలపడుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలికి తాడిపత్రిలో జేసీ కుటుంబం కూడా ఓటమి చెందిందని చెప్పవచ్చు. అంతే! తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచిన తర్వాత ఆయన రాజకీయ ఆట మొదలుపెట్టారు. సినిమాలో హీరో.. విలన్ ఇంటికి వెళ్లి నట్టింట్లో కుర్చీ వేసుకుని కూర్చున్నట్లు.. అచ్చం అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి కూర్చోవడం తాడిపత్రిలో పెద్ద దుమారం రేపింది. అక్కడే కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్లండర్ మిస్టేక్ చేశారని, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఆయన రాజకీయంపై ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘోరంగా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేసి, ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అడుగుపెట్టారు. అయితే వివిధ కారణాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణం విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. దాంతో పాటు, తాడిపత్రి పట్టణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించారని మరో వివాదం తలెత్తింది. ఇది మరో రచ్చకు దారితీసింది.
Also Read: Pakistan: భారత్ ను ఫైనల్లో ఓడిస్తాం
వాస్తు ప్రకారం పడమర వైపునకు గేటు నిర్మించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి కాంపౌండ్‌ను తొలగించారు. ఈ విషయం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలియడంతో ఆయన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, కాలేజీ గ్రౌండ్ వద్దే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఇంటికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుండగా, కాంపౌండ్ వాల్‌ను ఎలా పగలగొట్టి గేట్లు పెడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గేటు మూస్తేనే తాను ఆందోళన విరమించుకుంటానని, లేకపోతే ఇంటి వద్దకు వెళతానని భీష్మించుకున్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఉండటం, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలతో అక్కడికి వెళ్లేందుకు బయల్దేరడంతో, ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని పోలీసులు ఆందోళన చెందారు. వెంటనే పట్టణంలో పలుచోట్ల ఉన్న పోలీసులను అక్కడకు రప్పించారు. వాగ్వాదం నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి, పెద్దారెడ్డితో గేటు మూసివేయించే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి, ఆయనతో మాట్లాడి మున్సిపల్ అధికారులతో కలిసి గేటు మూసివేయించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పంచాయతీ ఎలాగైనా తేల్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు.
2019 నుంచి 2024 వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిపై తీవ్రమైన కేసులు బనాయించారు. ఆ కేసులను ఎదుర్కొంటూనే తండ్రీ తనయులు నియోజకవర్గంలో పోరాటం చేశారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి నానా తండాలు పడుతూ, జేసీ కుటుంబం వల్ల మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి వైసీపీ క్యాడర్ అండగా నిలవట్లేదా? అధిష్ఠానం సపోర్ట్ దొరకట్లేదా? అన్న చర్చ జరుగుతోంది. మరో నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్‌కు భరోసా ఇచ్చే నాయకుడే లేకుండా పోయాడా? పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడానికే నానా కష్టాలు పడుతున్నారు. ఇక రాజకీయం చేయగలరా? కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ఇంట్లోకి వెళ్లి తప్పు చేశానని పశ్చాత్తాపం పడుతున్నారా? ఆ సంఘటన ఇప్పుడు ఆయన రాజకీయాన్ని సుడిగుండంలోకి నెట్టిందా? కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి ఎదురొడ్డి రాజకీయం చేయగలరా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే కాలంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి.