Pawan Target Peddi Reddy

Pawan Target Peddi Reddy: పవన్‌ యాక్షన్‌కు పెద్దిరెడ్డి ఫ్యాక్షన్‌ తలొగ్గుతుందా?

Pawan Target Peddi Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు సంచలనంగా మారాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అటవీ భూములను కబ్జా చేసి, వాటిని తమ ఆస్తులుగా నమోదు చేయడం, ప్రభుత్వ భూములపై లేఔట్లు వేయడం వంటి చర్యలతో పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ దోపిడీ సామ్రాజ్యం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మదనపల్లిలో జరిగిన ఫైల్స్ దహనం ఘటనలో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో భూ కబ్జాకు సంబంధించిన కీలక పత్రాలను దహనం చేసి ఆధారాలను నాశనం చేసేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ, కొందరు అధికారులు పెద్దిరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దూకుడుగా అడుగులు వేశారు. చిత్తూరు జిల్లాలోని మంగళంపేటలో 75.75 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించి, లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ నివేదిక సమర్పించగా, పవన్ కల్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములను రక్షించడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన చర్యలు, పెద్దిరెడ్డి కుటుంబంపై క్రిమినల్ కేసులు, అటవీ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుగ్గమఠం భూముల ఆక్రమణలోనూ 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించినట్లు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది.

Also Read: Chandrababu: 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్ కు ఆమోదం

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీలో శక్తివంతమైన నేతగా చిత్తూరు రాజకీయాలను శాసించారు. అటువంటి నాయకుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించడం వైసీపీ శ్రేణుల్లో భయాందోళనలు రేకెత్తించింది. అయితే, పెద్దిరెడ్డి ఈ ఆరోపణలను ఖండిస్తూ, 2001లో 23.69 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు, అవి అటవీ భూములు కాదని వాదిస్తున్నారు. ఈ కేసు కేవలం నమోదుతోనే సరిపోదు… దీన్ని చట్టపరంగా కొలిక్కి తీసుకుని వచ్చి, నిందితులకు శిక్షలు పడేలా చేయడమే పవన్ కల్యాణ్ ముందున్న సవాల్‌. గతంలో జగన్ రుషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించినప్పుడు హైకోర్టు, సుప్రీం కోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అడ్డుకోలేకపోయాయి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడుల సమయంలో పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారు. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి రాజకీయ దిగ్గజంపై చర్యలు తీసుకోవడం అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. పవన్ కల్యాణ్ ఇందులో ఎంతవరకు సఫలీకృతమవుతారనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *