Pawan Kalyan Greatness: రెండు దశాబ్దాల కిందట కాకినాడ జిల్లాలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో 10 వేల ఎకరాలకు పైగా భూమిని సెజ్ కోసం సేకరించారు. అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎకరాకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చినప్పటికీ, కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అలాంటి వారిని నయానో, భయానో ఒప్పించి ప్రభుత్వం భూములు తీసేసుకుంది. అయితే వారిలో కొందరు రైతులు నష్ట పరిహారం కూడా తీసుకోకుండా తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని పోరాటాలు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లిన పరిస్థితి. అలా 2,180 ఎకరాల భూములు రైతులకు పరిహారం అందకుండానే సెజ్ యాజమాన్యం పేరిట నమోదయ్యాయి. నష్టపరిహారం అందకపోగా ఈ భూములపై రైతులు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కోల్పోవడంతో ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందుబాటులో లేకపోయాయి. దీంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ఏళ్ల తరబడి ఆ రైతులు తమ భూముల కోసం పోరాటం చేస్తూ, జైలు శిక్షలు కూడా అనుభవించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అదనంగా ఎకరాకు రూ.2 లక్షల పరిహారం అందించినప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం జగన్ హామీ ఇచ్చినా, ఆ తర్వాత వైసీపీ హయాంలోనూ ఆ 2,180 ఎకరాల సమస్య అలాగే ఉండిపోయింది.
Also Read: BC Reservation: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. BC రిజర్వేషన్లపై కీలక తీర్పు
ఈ నేపథ్యంలో, గత 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కాకినాడ సెజ్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే మీ భూములు మీకు తిరిగి ఇస్తామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఇందులో వెనక్కి తగ్గే సమస్యే లేదని వారికి బలమైన భరోసానిచ్చారు. అయితే అధికారంలోకి రాగానే జగన్‌లా పవన్ తన హామీని మరిచిపోలేదు. ఈ హామీని నిలబెట్టుకునేందుకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. పలు దఫాలుగా రెవెన్యూ శాఖ, సెజ్ అధికారులతోనూ చర్చలు జరిపారు. అంతిమంగా నేడు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ రెవెన్యూ శాఖతో ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండానే… ఆ 2,180 ఎకరాలు రైతుల పేరిట ఉచితంగా బదిలీ చేయనున్నారు. ఈ వార్త… 15 వందల మందికి పైగా రైతుల ఇరవై ఏళ్ల కష్టాలను కడతేర్చుతూ.. వారి జీవితాల్లో తిరిగి ఆనందం, ఆశలు చిగురించేలా చేసింది. ఇంత కీలక నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఎలాంటి హడావుడి లేకుండా అమలు చేయడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు పరిశీలకులు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేలు మరిచిపోలేము అంటున్నాయి నేడు ఆ 15 వందల కుటుంబాలు. ఈ సమస్య పరిష్కారంలో పవన్ చూపిన చొరవ, హామీని నెరవేర్చిన సమర్థత, ఆయన రాజకీయ నైతికతకు నిదర్శనంగా నిలిచాయి. సైలెంట్‌గా, అత్యంత సమర్థవంతంగా పని చేసి, రైతుల కళ్లలో సంతోషాన్ని నింపిన పవన్ నాయకత్వం జనసేన కార్యకర్తలకు, అభిమానులకు గర్వకారణంగా నిలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతులకు చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించడమే కాక, వారికి వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చూపిన నిబద్ధత ఆయనకు రాజకీయంగానూ గణనీయమైన మైలేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇక రెవెన్యూ శాఖ అధికారులు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇది రైతులకు న్యాయం చేసిన చారిత్రక నిర్ణయంగా నిలిచిపోనుంది.