Pawan Giving Clarity

Pawan Giving Clarity: జనసేనకు టర్నింగ్‌ పాయింట్‌.. పవన్‌ అజెండా ఇదేనా..??

Pawan Giving Clarity: కూటమి ప్రభుత్వంలో జనసేన కీలకపాత్ర పోషిస్తోంది. ఏపీలో రెండో అతి పెద్ద పార్టీ కావడం, మరోపక్క వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర కూడా జనసేనదే అని చెప్పాలి. అయితే.. సహజంగానే పవన్‌ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటారు. కానీ పవన్‌ మరో 15 ఏళ్లు కూటమిగానే కలిసి వెళ్తామంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 15 ఏళ్లు కూటమిలో భాగస్వామ్య పార్టీగానే మిగిలిపోవాలా? ఇలా అయితే పార్టీ సొంతంగా బలపడేది ఎలా? అనే సందేహాలు సహజంగానే పార్టీ క్యాడర్‌, లీడర్లలో వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో జనసైనికుల్ని రెచ్చగొడుతూ వైసీపీ ట్రోల్స్‌ చేస్తుండం వారిని మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో పదవులు, ప్రాధాన్యత విషయంలోనూ జనసేన నేతల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సేనతో సేనాని’ కార్యక్రమాన్ని చేపట్టారు జనసేనాని. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్రియాశీల కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నియోజవర్గాల వారీగా కీలక నేతలతో జనసేనాని సమావేశం అవుతున్నారు. మరి క్యాడర్‌, లీడర్లలో ఉన్న సందేహాలకు పవన్‌ కళ్యాణ్‌ క్లారిటీ ఇవ్వనున్నారా? జనసేన భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారా? జనసేన సొంతంగా బలపడేందుకు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా? తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపైనా పవన్‌ స్పష్టత ఇవ్వనున్నారా? అన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది.

Also Read: Sri Lakshmi Belongs to TDP: జగన్‌కు అవసరం తీరిపోయాక అందరూ టీడీపీ మనుషులే..!!

గతేడాది మార్చి 14న పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ మినహాయిస్తే… అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో చెప్పుకోదగ్గ పార్టీ కార్యక్రమాలు ఏవీ జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 30న విశాఖలో జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. గత ఏడాది కాలంగా ప్రభుత్వంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కీలకమైన ఐదు మంత్రిత్వ శాఖలతో తనదైన మార్కు చాటారు. చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. అదే సమయంలో జనసేనకు చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందిస్తూ వస్తున్నారు. మరో జనసేన మంత్రి కందుల దుర్గేశ్ సైతం పర్యాటక శాఖలో అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చారు. సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కూడా.. సినీ పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని అభినందనలు అందుకున్నారు. అయితే తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్.. సమాంతరంగా తన పెండింగ్‌ సినిమాలను పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు పార్టీపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు.

ALSO READ  TTD Chairman Simplicity: ఆయన టీటీడీ చైర్మన్‌ అంటే నమ్ముతారా!!

విశాఖలో ఈనెల 30న జరిగే జనసేన విస్తృతస్థాయి సమావేశంలో దాదాపు 15 వేల మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశం వేదికగా… జనసేన సొంతంగానే బలపడేందుకు పలు కీలక నిర్ణయాలు జనసేన అధినేత ప్రకటిస్తారని చర్చ జరుగుతోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే.. దానికి ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా పవన్ మనసు విప్పి మాట్లాడుతారని సమాచారం. ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *