Pawan comment on BRS: ఆగస్టు 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఆగస్టు 30న తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అంటూ తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1న స్టేట్ మొత్తం దద్దరిల్లిపోయింది. అదే రోజు కేసీఆర్, హరీశ్‌రావులు కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణను అడ్డుకోవాలని న్యాయస్థానంలో బలంగా ప్రయత్నించారు. సెప్టెంబర్ 2న కవిత మొదటి ప్రెస్మీట్ పెట్టి హరీశ్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 3న కవిత సస్పెన్షన్, ఆ తర్వాత గంటకే కవిత రెండో ప్రెస్మీట్. తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోసారి హరీశ్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌తో.. బీఆర్‌ఎస్ పార్టీలో చీలిక వస్తుందా? బీటలు వారుతున్న కేసీఆర్ కోట పునాదులతో సహా కుప్ప కూలుతోందా? అన్న చర్చ ఊపందుకుంది. అయితే అప్పటికే సరిగ్గా వారం రోజుల ముందు.. విశాఖలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో తొలిరోజే జనసేన పార్టీ సిద్ధాంతాలపై చర్చ జరిగింది. ఒకే రకమైన సిద్ధాంతాల మీద ఆధారపడి దీర్ఘకాలం ఏ రాజకీయ పార్టీ నడవదు. కాలానికి అణుగుణంగా సిద్ధాంతాలను మార్చుకుంటూ ముందుకెళ్లాల్సిందే అంటూ పవన్ జనసేన సిద్ధాంతపరమైన విధానంపై స్పష్టత నిచ్చారు. ఈ సందర్భంలోనే తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్.
ప్రతీ రాజకీయ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, విధానాలతో పనిచేస్తుంటుంది. కానీ కాలంతో పాటు వాటిలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు తప్పదు. లేకుంటే మనుగడ సాగించడం కష్టమవుతుంది. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్… తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇవి. “తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సాధనతో ఆ లక్ష్యం నెరవేరింది కనుక, ఆ భావజాలానికి ఇక విలువ ఉండదు. అందుకే కేసీఆర్ తన పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కనుక ఏ రాజకీయ పార్టీకైనా కాలంతో పాటు మార్పు అనివార్యం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వారం రోజుల తర్వాత తెలంగాణలో చర్చనీయాంశం అవుతున్నాయి.
Also Read: Lokesh Meets Modi: లిక్కర్ కేసును ముగించబోతున్నారా
ఒకప్పుడు కేసీఆర్.. పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ… “చిటికేస్తే వెయ్యి ముక్కలవుతావ్” అంటూ మాట్లాడారు. కేసీఆర్‌కు ఆ రోజున్న అధికారం, పరపతి, స్థాయి ఆయనతో ఆ రకంగా మాట్లాడించి ఉండొచ్చు. ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ నేడు కేసీఆర్ మాజీ సీఎం..! పవన్ కళ్యాణ్ ఒక స్టేట్‌కి డిప్యూటీ సీఎం..! దీనినే కాల మహిమ అంటారు. కాలానుగుణంగా సమాజంలో మార్పు సహజం. రాజకీయ పార్టీలు కూడా కాలానికి తగ్గట్టు సిద్దాంతాలను మార్చుకుంటూ ముందుకెళ్తేనే మనుగడ ఉంటుందన్నది పవన్ ఆలోచన. కానీ మార్పు చెందుతున్నప్పుడు అహంకారంతో కాకుండా, ఆలోచనతో ఆ మార్పును తీసుకోగలగాలి. కేసీఆర్ కూడా కాలానికి, అవసరాలకు తగ్గట్టు మారాలన్న ఆలోచనతోనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు కానీ.. అది మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంతులేని డబ్బు, అధికారం ఇచ్చిన మొండి ధైర్యంగానే కనిపించింది తప్ప… నిజానికి కేసీఆర్ ఆనాడు అంత తొందరపడాల్సి అవసరం లేదన్నది ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్గాలు సైతం ఒప్పుకుంటున్న మాట. నేడు అధికారం కోల్పోయే సరికి మళ్లీ తెలంగాణ వాదమే సంజీవని అనుకుంటోంది బీఆర్‌ఎస్. ఒకానొక సమయంలో తిరిగి టీఆర్‌ఎస్‌కు షిఫ్ట్ అవుదామా అన్న సంశయంలోనూ ఆ పార్టీ పడిపోయింది. ఇలా.. మార్పు దిశగా కేసీఆర్, పవన్ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నా.. ఇద్దరి మనస్తత్వాల్లో, నాయకత్వాల్లో ఉన్న తేడా వల్లే.. బీఆర్‌ఎస్ పతనావస్థలో పడిపోతే, జనసేన ఉత్తానస్థితికి చేరిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.

