Pawan Araku Tour: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. విశాఖ మన్యం గిరిజన ప్రాంతాల పట్ల ఆయనకు ఉన్న అభిమానం అందరికీ సుపరిచితం. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు సమకూర్చి, శంకుస్థాపనలు చేశారు. తన సొంత నిధులతో గిరిజనులకు దుప్పట్లు, చెప్పులు, మహిళలకు చీరలు అందించి వారి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజనులు కూడా పవన్ కళ్యాణ్‌ను గౌరవిస్తూ, ఆప్యాయత చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ మండలంలోని మదగడ గ్రామంలో జరిగే ‘బలి పొరోబ్’ సంప్రదాయ ఉత్సవంలో పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన పాల్గొననున్నారు. గిరిజనుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ‘బలి పొరోబ్’ గిరిజనుల పురాతన సంప్రదాయ వేడుక. ఇది ఆగస్టు 25న ప్రారంభమై 12 రోజులపాటు జరుగుతుంది. ఈ ఉత్సవంలో అల్లూరి జిల్లాతో పాటు, ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజనులు కూడా పాల్గొంటారు. ఈ వేడుక రెండు రాష్ట్రాల గిరిజనుల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ ఉత్సవంలో చివరి రోజు పాల్గొనడం విశేషం.
Also Read: KA Paul Timing: కవిత సీఎం కలలు.. నేనున్నానంటూ కేఏ పాల్!!
పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తున్నారు. కొండ శిఖర గ్రామాలకు రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఆయన చర్యలు చేపట్టారు. ఇటీవల అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బిజీ షెడ్యూల్‌లోనూ రెండు రోజులపాటు గిరిజన గ్రామాల్లో గడిపారు. అదే సమయంలో ఆయన చిన్న కుమారుడికి సింగపూర్‌లో ప్రమాదం జరిగినప్పటికీ, గిరిజనుల కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే ఆయన మన్యం నుండి కదిలారు. ఇటీవల తన ఫామ్‌హౌస్‌లో ప్రకృతి సేద్యంతో పండించిన మామిడి పండ్లను గిరిజనులకు పంపించి, వారిలో సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించారు.
బలి పొరోబ్ ఉత్సవానికి పవన్ హాజరవుతుండటంతో, అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. గతంలో ఆయన పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు బయటపడిన నేపథ్యంలో, ఈసారి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సరిహద్దు ప్రాంతం కావడంతో, మావోయిస్టు కదలికల దృష్ట్యా భద్రతను మరింత బలోపేతం చేస్తున్నారు. ఓ మారు మూల గ్రామంలో జరిగే గిరిజనుల సంప్రదాయ ఉత్సవంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నాయకుడు పాల్గొనడం ఇంతవరకూ ఎన్నడూ లేదు. ఇది వారి పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న అంకితభావానికి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. ఈ ఉత్సవంలో పవన్… గిరిజనుల కోసం ఏమైనా కొత్త వరాలను ప్రకటిస్తారా? అనే ఆసక్తి కూడా నెలకొంది. ఏది ఏమైనా గిరిజనులతో పవన్ అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది.