Pawan and Lokesh Works: 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిపోయాయి. ప్రతికూల నియోజకవర్గంలో పట్టుబట్టి పోటీ చేసిన లోకేష్.. అఖండ తాండవం ఆడారు. టీడీపీ గెలిచిన చరిత్రే లేదన్న చోట.. 90 వేల పైచిలుకు మెజార్టీతో పసుపు జెండా పాతారు. ఇక పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్‌కు జేజేలు పలుకుతూ.. అలవోకగా 70 వేల మెజార్టీని దాటించి.. ‘ఇక నుంచి ఇది నీ అడ్డా’ అంటూ తీర్పునిచ్చారు పిఠాపురం ప్రజలు. నువ్వు అనుకో స్వామీ.. నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామీ.. అంటూ పిఠాపురాన్ని అభివృద్ధి చేయమని ఆహ్వానించారు. మరి తమని ఆదరించిన నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో.. తొలి ఏడాదిలో.. ఈ ఇద్దరు నాయకులు ఎన్ని మార్కులు వేయించుకున్నారు? మంగళగిరి, పిఠాపురంలలో ఎటువంటి కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచారు? ఇప్పుడు చూద్దాం.
మంగళగిరి. నాలుగు దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గం ఇది. 2019లో ఓటమి. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావమున్న మంగళగిరి… ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. అయితే 2024లో మంగళగిరిలో 90 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది వైసీపీకి గట్టి సమాధానం ఇచ్చారు నారా లోకేష్. ఈ విజయంతో మంగళగిరి రాష్ట్ర రాజకీయాల్లో కీలక కేంద్రంగా మారింది. అఖండ విజయాన్ని కట్టబెట్టిన మంగళగిరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు లోకేష్. తొలి ఏడాదిలోనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. “మన ఇల్లు – మన లోకేష్” కార్యక్రమంతో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించి, స్థానికుల ప్రశంసలు అందుకున్నారు లోకేష్. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంతో నియోజకవర్గాన్ని నెంబర్ వన్‌గా నిలపడానికి కృషి చేస్తున్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, ఎకో పార్క్ రుసుము రద్దు చేసి సొంత నిధులతో నిర్వహణకు సిద్ధమవడం వంటివి లోకేష్ చొరవను తెలియజేస్తున్నాయి. “ప్రజా దర్బార్” ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తూ, మంగళగిరి చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ… తన నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులోనే ఉంటున్నారు నారా లోకేష్. ఇది ఇతర మంత్రులతో పోలిస్తే.. లోకేష్‌ని ప్రత్యేకంగా నిలుపుతోంది.
Also Read: Krishanma Raju Remand Report: ఛీకొట్టించుకోవడం, చీవాట్లు తినడమే పనా!
Pawan and Lokesh Works: ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, 2019లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన ఆయన, వైసీపీ అవమానాలను ఎదుర్కొని, టీడీపీ, బీజేపీతో కూటమి కట్టి పిఠాపురంలో 70 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆధ్యాత్మిక టూరిజం, మినీ గోకులం, 30 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎమ్మెల్యేగా తన జీతాన్ని అనాథలైన చిన్నారులకు ఒక్కొక్కరికి 5 వేల చొప్పున కేటాయిస్తూ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో ఓ ఎలక్ట్రీషియన్ ప్రమాదవశాత్తూ మృతి చెందటం పవన్ దృష్టికొచ్చింది. వెంటనే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రీషియన్లు అందర్నీ పిలిపించి, సమావేశం ఏర్పాటు చేసి.. పనిలో ఏ ఒక్కరూ ఒక ప్రాణాలు పోగొట్టుకోకూడని చెప్పి… సురక్షితమైన ఎలక్టికల్ కిట్లను వారికి సొంత నిధులతో అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ.. వాస్తవికంగా పిఠాపురం ప్రజల్లో మాత్రం ఆ భావన లేదు. పవన్ ఉన్నా లేకున్నా.. పిఠాపురంలో పనులు పరిగెత్తుతుండటం ఇందుకు కారణం.
లోకేష్, పవన్ ఇద్దరూ తమ నియోజకవర్గాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. మంగళగిరి లోకేష్ నాయకత్వంలో టీడీపీ కంచుకోటగా మారుతోంది. అటు పవన్ నాయకత్వంలో పిఠాపురం గతంతో పోలిస్తే గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ ఇద్దరు నాయకులూ తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ… తమ తమ నియోజకర్గాలను కంటికి రెప్పలా చూసుకుంటూ… మరో వైపు మంత్రులుగా కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది వేస్తున్నారని చెప్పొచ్చు.

