Parakamani Backdoor: రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ పాలకమండలికి అసలు తిరుమల శ్రీవారి ఆస్తుల రక్షణపై అసలు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచింది. 16 నెలలకు ముందే టీటీడీ అధికారుల చేతిలో పరకామణి దొంగతనం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు లేవు ఎందుకనీ? ఇప్పుడు కూడా ఒక శ్రీవారి భక్తుడు హైకోర్టులో కేసు వేయడంతో పరకామణి దొంగతనం కేసులో తిరిగి విచారణ ప్రారంభించారు. అంతేకానీ టీటీడీ పాలకమండలి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశంపై ఎందుకు దృష్టి సారించలేదు? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్న శ్రీవారి భక్తులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? లేక… ఇంకేదైనా తెర వెనుక వ్యవహారం నడిపించారా?
Also Read: H1B Visa: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లకు మినహాయింపు?
జగన్ అండ్ టీం దేవుడి దగ్గర ఆటలు ఆడారనీ, అందుకే దేవుడు ఏమి చేయాలో అది చేసాడనీ మంత్రి లోకేష్ అంటున్నారు. అప్పటి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి కలిసి.. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా 41 నోటీసులు ఇచ్చి పంపించేశారన్నారు. ఇందులో అనేక వాస్తవాలు బయటికి రావాల్సి ఉందన్నారు. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటికి వస్తున్నాయని, నెయ్యి అని చెప్తున్న పదార్థంలో అసలు నెయ్యే లేదని సీబీఐ దర్యాప్తులో తేలిందన్నారు. జగన్ ఐదేళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని బ్రష్టు పట్టించారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారనీ… ఆయనకు జగన్ టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇక పరకామణి చోరీ వ్యవహారంపై త్వరలో సిట్ వేస్తున్నామని ప్రకటించారు మంత్రి లోకేష్. మంత్రి చెప్పింది అంతా బాగానే ఉంది కానీ.. సిట్ వేయాలని ఇప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకు అనిపించలేదు? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గానే మిగిలిపోయింది. ఒక్క పరకామణి విషయంలోనే కాదు.. పప్పు, ఉప్పుల దగ్గర నుండి గత వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన ప్రతిదీ స్కామేనని ఆరోపణలున్నాయి. విజిలెన్స్ రిపోర్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి చర్యలెందుకు నత్త నడకన సాగుతున్నాయి? అన్నదే ఇక్కడ తేలాల్సిన అంశం. సీబీఐ విచారణ వేసుకోండి, ఏమైనా చేసుకోండి అంటూ భూమన లాంటోళ్లు అంత ధైర్యంగా ఎలా సవాల్ చేయగలుగుతున్నారు. రోజుకో ఫేక్ ప్రచారంతో ఎలా రెచ్చిపోగలుగుతున్నారు? ఇప్పటికే వచ్చిన విజిలెన్స్ నివేదికలపై చర్యలు ఎక్కడ? లడ్డూ కల్తీ స్కామ్‌లో పాత్ర ధారులు తప్ప, సూత్రధారుల్ని పట్టుకున్నారా? చంద్రబాబు చెప్పిన టీటీడీ ప్రక్షాళన అసలు సాధ్యమవుతుందా? అసలు వైసీపీ నేతల ధైర్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? లేక ఈ మిస్టరీకి ఎండ్ అనేదే లేదా? వేచి చూద్దాం.