Palakurthi Jhansi Reddy: తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గాన్ని ధిక్కారానికి ప్రతీకగా చూస్తారు. నిజాం నవాబు కాలం నుండి మొదలుకుని మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు పాలకుర్తి ప్రజలది ప్రత్యేక పాత్ర. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అసువులు బాసిన చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దిడ్డి కొమురయ్య లాంటి హేమాహేమీలు నడియాడిన నేల ఇది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డి.. ఆమె అత్త, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్తున్నారు.
హనుమాండ్ల ఝాన్సీ, రాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలోని చర్లపాలెం గ్రామస్థులు. అమెరికాలో ప్రముఖ్య వైద్యునిగా సేవలందిస్తూ రాజేందర్ రెడ్డి ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఓ ట్రస్టును స్థాపించి పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకి సేవలు చేస్తూ వచ్చారు. ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఈ ప్రాంతంలో ఉన్న పలుకుబడిని గుర్తించిన కాంగ్రెస్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. కానీ ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం వివాదం ఉండడంతో తన కోడలు యశస్విని రెడ్డిని పోటీలో నిలిపింది. ఓటమెరుగని నాయకుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద యశస్విని రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో ఎర్రబెల్లి కోటకు బీటలు వాలాయి. ఝాన్సీ రెడ్డి పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనితెరమీదకు వచ్చింది మొదలు.. ఆమెకు తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. అయినప్పటికీ అన్నింటిని తట్టుకుని నిలబడి తన కోడలు యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు.
అనేకానేక ఆటుపోట్లు, ఇబ్బందులను తట్టుకుని గెలిచినప్పటికీ ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డికి ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. వారు ఏ పని చేసినా కాళ్లల్లో కట్టెలు పెడుతూ అడ్డుపడుతున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా అపోహలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య అగాథం కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అయినప్పటికీ అత్తా కోడళ్లు సఖ్యతతో మెదులుతూ ఏమాత్రం అదరకుండా, బెదరకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Visakha YCP Leaders: ఆ యువనేత రాజకీయ భవిష్యత్ మొగ్గలోనే పోయిందా?
Palakurthi Jhansi Reddy: అమెరికాలో సంపన్నమైన జీవితాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి, సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పైన విజయం సాధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిని కాపాడుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ… అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి మీద ప్రత్యర్థి పార్టీ నాయకులు అనవసరమైన విమర్శలు, ఆరోపణలు చేసినప్పుడు సొంత పార్టీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు లేదా సీనియర్ నాయకులు స్పందించి అండగా నిలవాల్సింది పోయి పట్టించుకోకపోవడం సరైనది కాదనే వాదన ఉంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నప్పటికీ సొంత పార్టీ నేతలు స్పందించకపోవడం విచారకరమని చర్చ జరుగుతోంది.
రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆటుపోట్లకు గురిచేసినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయట్లేదట. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లలాగా భావించి పనిచేసుకుంటూ పోతున్నారట. పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ద్యేయంగా ముందుకు పోతున్నారట ఈ అత్తా కోడళ్లు.