Operation Karregutta: మావోయిస్టు పార్టీ దండకారణ్యం, తెలంగాణ ప్రాంత కమిటీలకు మెయిన్ షెల్టర్ జోన్‌గా ఉన్న కర్రెగుట్టలపై పార్టీ ఉనికి లేకుండా చేసే పనిలో కేంద్ర బలగాలు నిమగ్నమైనాయి. సువిశాలంగా విస్తరించిన ఈ గుట్టలపై షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులను ఏరివేసినట్టయితే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టినట్టు అవుతోందన్న యోచనలో కేంద్ర బలగాలున్నాయి. ఇటీవల కాలంలో కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ రెండు మూడు సార్లు బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు కూడా జరిగాయి. అలాగే రెండు నెలల క్రితం కర్రెగుట్టల సమీపంలో మావోయిస్టు పార్టీ నేత బడే దామోదర్ అలియాస్ చొక్కారావు బంకర్ నిర్మాణం చేసుకుని షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు అక్కడ భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఈ సమాచారం వెంటనే అందుకున్న బలగాలు బడే దామోదర్ షెల్టర్ తీసుకున్న బంకర్‌ను చుట్టుముట్టేందుకు రంగంలోకి దిగాయి. ఈ విషయం తెలిసిన దామోదర్ అతనితో పాటు ఉన్న మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత అక్కడికి చేరుకున్న బలగాలు బంకర్‌లో ఉన్న మావోయిస్టు పార్టీ డంప్‌ను స్వాధీనం చేసుకుంది.
వరస ఘటనలతో కర్రెగుట్టలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు భావించినట్టు తెలిసింది. ఇదే క్రమంలో ఇటీవల కర్రెగుట్టలపై మందుపాతర పేలడం ఒకరికి గాయాలు కావడంతో పార్టీ నాయకత్వం కూడా స్పందించింది. కర్రెగుట్టల వద్దకు ఎవరూ రావద్దని సమీప గ్రామాల వాసులకు సూచన చేసింది. కొద్ది రోజుల క్రితం భారీ ఎత్తున ఆహార పదార్థాలతో పాటు వంట సామాగ్రి కర్రెగుట్టలపైకి చేరిందన్న సమాచారం అందుకోవడంతో బలగాలు నిఘా కళ్లకు పని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడకు మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ ఇన్‌ఛార్జి హిడ్మా రెండు ప్లాటూన్లతో చేరుకున్నాడని, మరి కొంతమంది ముఖ్య నాయకులు కూడా అక్కడికి వచ్చారని తెలుసుకున్న తరువాతే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
సుమారు 280 నుంచి 300 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడంతో పాటు వేలాది మీటర్ల ఎత్తులో ఉన్న కర్రెగుట్టల మీద పోలీసు అధికారులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే ఏడు రోజుల క్రితం వేలాది మంది బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాల సాయంతో గుట్టలపై ఉన్న పరిస్థితిని సమీక్షిస్తూ నక్సల్స్ షెల్టర్ తీసుకున్న పాయింట్లను కూడా గుర్తించినట్టుగా ప్రచారం జరుగుతోంది. బలగాలు పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ చేస్తూ పైకి చేరుకుంటున్నాయి. ఇందుకు అవసరమైన ప్లాన్ పక్కాగా రచించిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Revanth Reddy: రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి
Operation Karregutta: కర్రెగుట్టలపైకి చేరుకున్న బలగాలు మావోయిస్టుల షెల్టర్ జోన్‌ను గుర్తించినట్టుగా సమాచారం. గుట్టల చుట్టూ, పైనా సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్న మావోయిస్టులు మందుపాతరలను అమర్చడంతో బలగాలు ఆచీతూచీ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎండలు కూడా మండిపోతుండడం వల్ల కర్రెగుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ ట్రెక్కింగ్‌లో సుశిక్షితులైన వారినే ఇందుకు ఎంపిక చేసినట్టుగా స్పష్టం అవుతోంది. కొంతమంది పోలీసులు అస్వస్థతకు గురైనప్పటికీ మిగతా జవాన్లను ముందుకే వెళ్లాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నట్టు సమాచారం. గుట్టపైన మావోయిస్టుల అవాస ప్రాంతాలను కొన్నింటిని గుర్తించినప్పటికీ, సెర్చింగ్ మరిన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఉందని యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌కు ఇన్‌ఛార్జీలుగా ఉన్న పోలీసు అధికారులు భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. గుట్టలపై మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్లను సమూలంగా చెరిపివేయాలన్న తలంపుతో ఉన్న కేంద్ర బలగాలు అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి.