Only 2 New Districts in AP: ఏపీలో జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా 13 జిల్లాలను విభజించి 26కు పెంచింది. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా ఏర్పాటు చేయడంతో పరిపాలన ఇబ్బందులు తలెత్తాయి. గత ప్రభుత్వంలో జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారని ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుగురు మంత్రుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను విభజించి జిల్లాల సంఖ్యను 32కు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ వైఖరి మారిందని కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు మార్చడానికే పరిమితమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా చేసుకుని జిల్లాలను పునర్విభజన చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, అరకు నియోజకవర్గాన్ని రెండుగా విభజించడంతో జిల్లాల సంఖ్య 26 అయింది. అయితే పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో కొన్ని పరిపాలన సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గానికి సమీపంలో రాజమహేంద్రవరం ఉంది. కానీ, రంపచోడవరాన్ని పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలో కలపడంతో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఇదేవిధంగా చాలా జిల్లాల్లో సమస్యలున్న కారణంగా, వాటిలో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అంటున్నారు. మార్కాపురం జిల్లా ఆ ప్రాంతీయుల చిరకాల కోరికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రస్తావించడంతో ఆ జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.
Also Read: Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఇక ప్రభుత్వానికి వచ్చిన ఇతర ప్రతిపాదనల్ని పరిశీలిస్తే….. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట పట్టణానికి మార్చాలని…. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాలని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని…. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును తిరిగి నెల్లూరులో విలీనం చేయాలని.. ప్రతిపాదనలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం చేసిన ఈ ప్రతిపాదనలపై పలు నియోజకవర్గాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఏకపక్షంగా చేసిన జిల్లాల విభజనను సరిచేయడమంటే ఇదా? అని పెదవి విరుస్తున్నారు. ఉదాహరణకు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈ రెండు నియోజకవర్గాల్ని కృష్ణా జిల్లాలో కలిపింది. విజయవాడ నగరం మూడొంతులు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే ఒక వంతు కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఇది పాలన పరంగా చూసినా, ప్రాంతీయత, సెంటిమెంట్ పరంగా చూసినా ఇబ్బందికరంగా మారింది. వాటిని సరిచేయాల్సిన బాధ్యత మంత్రివర్గ ఉపసంఘంపై లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

