Narayana Liqueur: “లిక్కర్ పాలసీలో కానీ, లిక్కర్ ముడుపుల్లో 3500 కోట్ల స్కామ్ జరిగేలా చక్రం తిప్పడంలో కానీ నా ప్రమేయమేమీ లేదు. నాడు ఎక్సైజ్ మంత్రినే అయినా నిమిత్త మాత్రుడినే. లోగుట్టు నాకు తెలియదు. సంతకాలకే పరిమితం అయ్యాను” అంటూనే లిక్కర్ గుట్టు విప్పేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. నాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకున్నాననీ, ఎక్సైజ్ మంత్రిగా అవసరమైన చోట్ల సంతకాలు చేశాననీ, అధికారులు కూడా తనని లెక్క చేయని కారణంగా అసలు ఏమి జరిగిందో తనకు తెలియదని చెబుతున్నారాయన. లక్ష కోట్ల మేర జరిగిన నగదు లావాదేవీలకు అనుమతి ఇవ్వడంలో నా పాత్ర లేదు మొర్రో అని వాపోతున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామిని శుక్రవారం సిట్ విచారించింది. సిట్ ప్రశ్నలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జులై 21 నాడే సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అనారోగ్య కారణాలు చెప్పి డుమ్మా కొట్టారు నారాయణ స్వామి. 75 ఏళ్ల వయసులో తనని ఇబ్బంది పెట్టొద్దని, కావాలంటే ఇంటి దగ్గరే విచారించాలని సిట్ అధికారులకు విజ్ఙప్తి చేసుకున్నారు. దీంతో ఇవాళ పుత్తూరులోని నారాయణ స్వామి ఇంట్లోనే సిట్ విచారాణ జరిపింది. 7 గంటల విచారణ అనంతరం స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్.
Also Read: CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు సూపర్ హిట్: చంద్రబాబు ఆనందం
బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఉద్యోగి సత్యప్రసాద్, అధికారి రజత్ భార్గవలు తెచ్చిన ఫైళ్ళూ, వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ ప్రయత్నించింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లపై చర్యకు రజత్ భార్గవ్ మెమోలు జారీ చేసిన విషయం తెలుసా? వారిరువురి మీద చర్య తీసుకోకుండా నాటి సీఎంవో నుంచి ధనుజయ్ రెడ్డి అడ్డుపడిన విషయం తెలుసా? మద్యం సరఫరా ఆర్డర్లు ఆటోమేటిక్ నుంచి మాన్యువల్‌కు మారడంలో ఎవరి పాత్ర ఉంది? ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే ఆర్డర్లు ఇచ్చిన విషయం మీకు తెలియదా? డిజిటల్ పేమెంట్స్‌కు ఎందుకు అనుమతించలేదు? రాజ్ కసిరెడ్డి, మిధున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారి భేటీ విషయం ఎప్పుడూ మీ దృష్టికి రాలేదా? వంటి ప్రశ్నలను సిట్ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఇక్సైజ్ మంత్రి అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఆ అధికారం కూడా అప్పట్లో తనకు లేదని సిట్‌కు నారాయణ స్వామి చెప్పినట్లు సమాచారం.
ఇక్కడ మరొక కొసమెరుపు ఏంటంటే.. ఎక్సైజ్ మంత్రి హోదాలో ఉండి కూడా ఆ శాఖలో జరుగుతున్న విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉత్సవ విగ్రహంలా మిగిలినందుకు నారాయణ స్వామికి నెల నెలా ఫిక్స్‌డ్ అమౌంట్ అందేదని సిట్ వద్ద ప్రాథమికంగా ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను మరోసారి విచారించనుంది సిట్. ఇప్పుడు నారాయణ స్వామి పరిస్థితి ఏంటి? సిట్ నెక్ట్స్ టార్గెట్ నారాయణ స్వామేనా? వైసీపీ హయాంలో జరిగిన పాపాలకు నారాయణస్వామి శిక్ష అనుభవించక తప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే లభించనున్నాయి.