Nadendla Journey with Pawan: సమకాలీన రాజకీయాల్లో సంక్షేమం, ఉచిత పథకాల మధ్య ఉన్న సన్నని గీత కనుమరుగైంది. రాజకీయ పార్టీలు తమ అధికార దాహంతో రాజకీయ లబ్ధి కోసం ఈ అంతరాన్ని అస్త్రంగా మలిచాయి. సంక్షేమం అంటే ఆర్థికంగా వెనుకబడిన వారిని పైకి తీసుకురావడం, అందుకోసం తగిన అవకాశాలు కల్పించడం. కానీ సంక్షేమం నీడలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ ఉచితాల సంస్కృతి రూపుదిద్దుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ వరకు అన్ని ఒకే దారిలో నడుస్తున్నాయి. “నీవు నాలుగిస్తే, నేను ఎనిమిది ఇస్తా; నీవు ఇంట్లో ఒకరికిస్తే, నేను ఇంటిల్లిపాదికీ ఇస్తా” అన్నట్లు హామీల పోటీ నడుస్తోంది. ఈ ఉచితాల సంస్కృతి ఒక పార్టీకి ఒకసారి అధికారం తెచ్చిపెడితే, తర్వాతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రయోగించే అదే అస్త్రం.. ఆ పార్టీని గద్దె నుండి దింపేస్తుంది. వైసీపీ పాలనే దీనికి ఉదాహరణ. గత ఐదేళ్లలో ఎన్ని బటన్లు నొక్కినా, మళ్లీ అధికారం దక్కలేదు వైసీపీకి. ఈ ఉచిత పథకాలు అనేవి… రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, నీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి దీర్ఘకాలిక అవసరాలకు లేకుండా ఖజానా ఖాళీ చేస్తాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే, ఆటోవాలాలకు ఉపాధి సాయం కోసం మరో పథకం తప్పదు. ఇలా ప్రభుత్వ ఖజానా ఉచితాలకే కేటాయిస్తే, యువత, రైతాంగ ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు? అన్న చర్చ ఎప్పటి నుండో ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇదే అంశాన్ని లేవనెత్తింది.
2018లో ఉత్తరాంధ్రలో పర్యటించిన పవన్.. అక్కడి రైతులు, యువతతో చర్చించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తమకు ప్రభుత్వం ఇచ్చే పాతిక కేజీల బియ్యం కాదనీ, పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వండని వేడుకుంది సిక్కోలు యువత. ఆనాడు వ్యక్తమైన ఉత్తరాంధ్ర యువత కోరిక, వారి ఆకాంక్ష పవన్‌పైనా, జనసేన సైద్ధాంతిక విధానాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఆనాటి పర్యటనలో పవన్‌తో కలిసి నడిచిన నాదెండ్ల.. జనసేనతో తన జర్నీని గుర్తు చేసుకుంటూ.. ఎమోషన్ పోస్ట్ చేశారు. ఆనాటి పర్యటనలో తీసిన ఫొటోను జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాదెండ్ల ట్వీట్‌ని పవన్ రీపోస్ట్ చేస్తూ, ఏపీ యువత ఉచితాలు కోరుకోవడం లేదనీ, పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అడుగుతోందని, ఆనాడు యువత తనతో పంచుకున్న విషయాలు తనకు నిరంతరం గుర్తుంటాయని, నిత్యం తన మదిలో మెదలూతూ ఉంటాయని చెప్పుకొచ్చారు.
Also Read: Donald Trump: మోడీని నా మిత్రుడు.. పాక్ పీఎం ముందే మోదీని పొగిడిన ట్రంప్
సమకాలీన రాజకీయాలతో విసిగి వేసారిన యువత… జనసేనపై అనేక ఆశలు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ వారి ఆశలు, ఆంకాక్షలు గుర్తెరిగిన నేతగా ఉన్నారు. యువత భవిష్యత్తు తీర్చి దిద్దడం కోసం గతంలో అనేక హామీలు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే… ప్రస్తుతం కూటమిగా కలిసి నడుస్తున్నందున, టీడీపీ హామీలు కూడా ప్రియార్టీలోకి వస్తున్నందున, జనసేన హామీలన్నీ అమలు జరపడానికి సమయం పట్టనుంది. కానీ తానిచ్చిన హామీలేవీ మరవలేదనీ, అంతిమంగా జనసేన లక్ష్యం.. ఒక తరం తలరాతని మార్చేలా పని చేయడమేనని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే యువత ఆకాంక్షలతో ముడిపడిన పవన్ ఆలోచనలు ఎప్పటికి ఆచరణ రూపం దాలుస్తాయో చూడాలి. ఎందుకంటే ఉచితాల కోసం లక్షల కోట్ల అప్పులు చేస్తే, రాష్ట్ర ఆర్థిక భారం తిరిగి ప్రజల జేబులపైనే పడుతుంది. ఉచితాల సంస్కృతి రాష్ట్ర ఖజానాను సుడిగుండంలోకి నెట్టినప్పుడు, దీర్ఘకాలిక అభివృద్ధి కుంటు పడుతుంది. యువత ఉపాధి, భవిష్యత్తు కోరుతుంటే, ఉచితాలతో రాజకీయ లబ్ధి పొందే సంస్కృతి నడుస్తోంది. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దమ్ము పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. అనుకున్న విధంగా కూటమి మరో పదేళ్లు అధికారంలో కొనసాగితే యువత కోసం పవన్ ఆలోచనలు, ఆశయాలు కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.