Mother Dairy Election: అసలే నేతల మధ్య సఖ్యత అంతంత మాత్రం. ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మదర్ డైరీ ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా బయటపడింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు… ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూడు డైరెక్టర్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పుడు బీఆర్ఎస్‌తో అపవిత్రమైన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనికంతటికీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు ప్రధాన కారకులని సామేలు ఫైర్ అయ్యారు.
నార్మాక్స్ ఎన్నికల్లో రెండు జనరల్, ఒక మహిళా డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 9 మంది పోటీపడ్డారు. డైరీలో మొత్తం 311 ఓట్లకు గాను 308 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 297 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 11 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మూడు డైరెక్టర్ స్థానాలకు గాను నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సపోర్ట్ చేసిన కర్నాటి జయశ్రీ విజయం సాధించగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి బలపరిచిన రాధిక, ఎమ్మెల్యే సామెల్ క్యాండిడేట్ ప్రవీణ్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే, ఎన్నికలకు ముందు మూడో డైరెక్టర్ స్థానం.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బలపరిచిన మోత్కూరు మాజీ ఎంపీపీ భర్త.. రచ్చ లక్ష్మీ నరసింహా రెడ్డికి ఇవ్వాలని ఒప్పందం జరిగిందట. అయితే, నరసింహా రెడ్డికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని సామేలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీ నరసింహా రెడ్డి మోత్కూరులో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తనను ఓడగొట్టేందుకు పని చేశాడని సామేలు ఆరోపించారు. నరసింహా రెడ్డి డీసీసీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి సమీప బంధువు కావడంతో, ఆయన బీఆర్ఎస్ వ్యక్తి అయినప్పటికీ బీర్ల ఐలయ్య సపోర్ట్ చేస్తున్నాడని సామేలు ఆరోపించారు.
Also Read: Chandrababu: రైతు ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుంటే, తన నియోజకవర్గంలో మాత్రం బీఆర్‌ఎస్‌ను బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్‌కు ఎమ్మెల్యే సామేలు ఫిర్యాదు చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలవొచ్చని, అలాంటిది తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బలపరిచిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఏంటనేది సామేలు వాదన. ఇదిలా ఉంటే, మందుల సామేలుపై బీర్ల ఐలయ్య ఆగ్రహంతో ఉన్నారట. డైరీ ఎన్నికలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, విషయాలు తెలుసుకొని మాట్లాడాలని సామేలుపై మండిపడుతున్నారట. రైతుల శ్రేయస్సు కోసం డైరీని ఎన్‌డీడీబీకి అప్పగించాలని, త్వరలో జరిగే జనరల్ బాడీలో తీర్మానం చేయాలని డైరెక్టర్లు భావిస్తున్నారు. తమకు ఓ డైరెక్టర్ ఇస్తే తీర్మానానికి సహకరిస్తామని బీఆర్ఎస్ చెప్పడంతోనే.. కాంగ్రెస్ ఒకే చేసిందట. అయితే, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు… మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరుతో రెండు డైరెక్టర్ స్థానాలను బీఆర్ఎస్‌కు కోల్పోయింది కాంగ్రెస్.
డైరీ విషయంపై ఇప్పటివరకు మందుల సామేలు తనతో అసలు చర్చించలేదని, ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్న వాదన తెరమీదకు తెస్తున్నారు బీర్ల ఐలయ్య. పార్టీలో జరిగే అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కడం కరెక్ట్ కాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందట. సామేలుకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు జిల్లా పార్టీ నాయకత్వం ఫిర్యాదు చేసిందట. ఏది ఏమైనా, కలసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. డైరీ ఎన్నిక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో నాయకులంతా పాలు, నీళ్లలా కలసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు.