Bhamalu Satya Bhamalu: తెలంగాణలో ప్రపంచ సుందరుల సౌందర్య యాత్ర ఆకట్టుకుంటోంది. చార్మినార్‌లో మెరుపులు, చౌమహల్లా ప్యాలస్‌లో విందులు, రామప్ప ఆలయంలో చీరకట్టు సొగసులు, ఓరుగల్లు శిల్ప సౌందర్యానికి తోడైన సౌందర్య మణుల సోయగాలు, పోచంపల్లి చీరలకు వన్నె తెస్తూ హొయలొలికించిన సొగబులు, మొత్తానికి ఈ అందాల భామల రాకతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతోంది. బ్రాండ్ హైదరాబాద్‌ను ప్రమోట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండగా, రాజకీయ విమర్శలు కూడా తప్పడం లేదు. ధాన్యం కొనుగోలులో జాప్యం వల్ల రైతులు కష్టాల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్న రైతల్ని గాలికొదిలేసి.. ఈ సర్కారు బ్యూటీ ఈవెంట్‌లపైనే దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు భాగ్యనగరిలో అందాల రాశులు, మరోవైపు కల్లాల్లో రైతుల ధాన్య రాశులు.. తెలంగాణలో ఒకేసారి కనిపిస్తున్న ఈ రెండు దృశ్యాలు చర్చకు దారితీస్తున్నాయి.
అయితే.. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర అంశం చోటు చేసుకోవడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ హీరో నాగార్జున కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యింది ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ వేదికపై. గతంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌లో హైడ్రా కూల్చివేతలు సంచలనం సృష్టించాయి. చెరువు ఆక్రమణ ఆరోపణలతో జరిగిన ఈ చర్యలు రేవంత్-నాగ్ మధ్య దూరం పెంచినట్లు కనిపించింది. నాగార్జున కోర్టును ఆశ్రయించినా, రేవంత్ సర్కారు తన నిర్ణయాన్ని దృఢంగా అమలుపరిచింది. అయితే, ఈ వివాదం తర్వాత నెల రోజుల్లోనే వీరిద్దరూ సినీ పరిశ్రమ సమస్యలపై చర్చల పేరిట జరిగిన ఓ సమావేశంలో కలిశారు.
Also Read: KTR: మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ రిక్వెస్ట్..
Bhamalu Satya Bhamalu: డిసెంబర్ 26, 2024న జరిగిన ఈ సమావేశంలో నాగార్జున, సీఎం రేవంత్‌ను శాలువాతో సత్కరించి, స్నేహపూర్వకంగా మాటలు కలిపారు. తాజాగా ఈ ఇద్దరూ, మిస్ వరల్డ్ ఈవెంట్‌లో ఒకే టేబుల్ వద్ద విందు ఆరగిస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సీన్‌ని బట్టి చూస్తే.. మొత్తానికి ఇద్దరి మధ్యా గ్యాప్ తగ్గినట్టే భావించాలి. నాగార్జున చాతుర్యం, సంయమనం, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు నిర్వహించే విధానం అందరినీ ఆకట్టుకుంటోంటే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఆయన డిప్లమసీ, మెచ్యూర్ పాలిటిక్స్‌కు నిదర్శనంగా కనబడుతోంది. రాజకీయం, సినీ పరిశ్రమ పరస్పరం ఆధారపడి ప్రయాణం సాగించాల్సిన నేపథ్యంలో.. ఇలాంటి కలయికలు అనివార్యమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.