Manchi Prabuthwam: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తమది “మంచి ప్రభుత్వం” అని గొప్పలు చెప్పుకుంటున్నా, వైసీపీ నాయకులకు కూడా ఇంకా “మంచి రోజులే” నడుస్తున్నాయని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలతో వెలుగులోకి వచ్చిన కేసులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా పక్కన పడేస్తోందని, దీనివల్ల వైసీపీ నాయకులు దర్జాగా రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం పట్ల టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
గత వైసీపీ పాలనలో జగన్‌మోహన్ రెడ్డి కక్షపూరితంగా రఘురామకృష్ణం రాజును కస్టడీ టార్చర్‌కు గురిచేసిన కేసులో తప్ప, మిగతా అనేక అవినీతి కేసులపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదంటున్నారు. ఉదాహరణకు, ఆడుతా ఆంధ్ర స్కామ్‌లో రోజా పేరు వెలుగులోకి వచ్చినా, ఆమెపై ఎఫ్‌ఐఆర్ లేదు. బియ్యం అక్రమ రవాణా కేసులో మధుసూధన్ రెడ్డి పేరు బయటపడినా, ఎఫ్‌ఐఆర్ గల్లంతు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు. రఘురామ కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్‌ను అరెస్ట్ చేయడం లేదు, విచారణ కూడా ముందుకు సాగలేదు. లక్ష కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌లో కేవలం మూడు వేల కోట్ల ముడుపులపైనే ఫోకస్ చేసింది ప్రభుత్వం. అందులోనూ నిందితులను గుర్తించడానికే ఏడాది సమయం పట్టింది. మొత్తం స్కామ్‌ను వెలికితీసి, నేరస్తులకు శిక్షలు విధించాలంటే ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Nara Lokesh: జగన్‌ని చూసైనా నేర్చుకోరా? రగిలిపోతున్న క్యాడర్
Manchi Prabuthwam: ఋషి కొండపై జగన్ లగ్జరీ కోసం 500 కోట్ల రూపాయలు వృథా చేసినా విచారణ ఎక్కడ? ప్రజావేదిక కూల్చివేతకు అధికారిక అనుమతి లేకుండానే నాశనం చేశారనే ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? గుడివాడ క్యాసినో వ్యవహారం ఎవరు నడిపారు, ఎవరు అనుమతించారనే దానిపై కనీసం విచారణ జరిగిందా? మద్యం కల్తీ ఆరోపణలపై “ఏదో కలిపారు” అని చెప్పడం తప్ప, ఆ కల్తీ ఎలా జరిగిందో బయటపెట్టే ప్రయత్నమైనా చేశారా? ప్రభుత్వ సంస్థల్లో జీవోలు లేకుండా వేల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి, వేల కోట్ల రూపాయల జీతాలు చెల్లించినా, దానిపై విచారణ జరపడం లేదు. పంచాయతీ నిధులు, ఉద్యోగుల పీఎఫ్ నిధులను అనుమతి లేకుండా దుర్వినియోగం చేసిన ఆరోపణలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. గత ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఎంతన్నది నేటికీ స్పష్టత లేదు.
ఈ అవినీతి, అక్రమాల ఆరోపణలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో వైసీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కొన్ని కేసుల్లో వైసీపీ నాయకులు కొత్తగా తప్పులు చేసి ఇరుక్కున్నప్పుడు మాత్రమే అరెస్ట్‌లు జరుగుతున్నాయి. వల్లభనేని వంశీ అరెస్టు అలా జరిగిందే. అంతే తప్ప ప్రభుత్వం సీరియస్‌గా చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వాపోతున్నారు. “మంచి ప్రభుత్వం” అని చెప్పుకునే కూటమి, వైసీపీ నాయకులకు మంచి రోజులు కొనసాగేలా చేస్తోందని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలను నిరాశపరుస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం కొనసాగితే, కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.