Mahanadu Resolution: సంక్షేమం, అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు, మరో 4 ఉమ్మడి తీర్మానాలపైనా చర్చ జరగబోతోందట కడప మహానాడులో. ఎన్డీయే కూటమి ప్రభుత్వం – తొలి ఏడాదిలో సాధించిన ఘనవిజయాలపై తొలి తీర్మానం ఉండబోతోందట. శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, నదులను అనుసంధానించడం, బనకచర్లకు గోదావరి జలాలు తీసుకురావడం అనే అంశాలతో రెండో తీర్మానం… ఒకే రాష్ట్రం ఒకే రాజధాని – పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి, పెట్టుబడుల వికేంద్రీకరణ, 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులు తీసుకురావడం, జగన్ పాలనలో దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి అంశాలతో మూడో తీర్మానం చర్చకు పెట్టనున్నారట.
ఇక విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలపై నాలుగో తీర్మానం… మహిళా, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఐదో తీర్మానం… వ్యవసాయంతో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ప్రవేశపెట్టడం ద్వారా సాగును లాభసాటిగా చేయడం ఎలా అన్నదానిపై ఆరో తీర్మనం, మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహించడంపై ఏడో తీర్మానం, చంద్రన్న విజన్‌తో సంక్షేమ రాజ్యం – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలకు సమప్రాధాన్యం అనే అజెండాతో ఎనిమిదో తీర్మానాలు ఉండబోతున్నాయట. కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తొమ్మిదో తీర్మానం ఉండబోతోంది. ఇందులో రహదారుల అభివృద్ధి, సమగ్ర గృహ నిర్మాణం, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనపై చర్చిస్తారు. ఇక పేదరికం లేని సమాజ సంకల్పంతో, పీ4 అమలును పదో అంశంగా చేర్చి చర్చించనున్నారట.
విజన్ 2020 సాకారం కావడంతో.. ఇక స్వర్ణాంధ్ర విజన్@2047 సాధన దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాన్ని పదకొండో తీర్మానంగా… విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు, విపక్ష నేతగా కూడా విఫలమైన జగన్ తీరు, సహజ వనరుల పరిరక్షణ-అక్రమార్కులపై కఠిన చర్యలు అనే అంశాలను 12, 13, 14వ తీర్మానాలుగా చేపట్టి, వాటిపై సమగ్రంగా చర్చించి, ఆమోదం తెలుపనున్నారట. వీటితో పాటూ మహానాడులో మరో 4 ఉమ్మడి తీర్మానాలపైనా చర్చించనున్నారు. తెలుగువారి చరిత్రలో అన్న ఎన్టీఆర్ ప్రత్యేకత, తెలుగువారి చరిత్రలో చంద్రన్న మైలురాళ్లు/ముద్ర, అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలను కూడా మహానాడు వేదికగా చర్చించి ఆమోదించనున్నారు.
Also Read: Mahanadu Lokesh Mark: టీడీపీ ట్రాన్ఫర్మేషన్.. టర్నింగ్ పాయింట్ ‘మహానాడు’
Mahanadu Resolution: దశాబ్దాలుగా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రస్తుత, గత టీడీపీ ప్రభుత్వాలు చేసిన కృషిపైనా కడప మహానాడులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఫ్యాక్షన్ కట్టడితో పాటు వెనుకబడిన రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలుగుదేశం హయాంలో చేపట్టి, పూర్తి చేసిన హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు, అనంతపురం జిల్లాకు సాగు, త్రాగు నీరు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో కరవు నివారణకు చేపట్టిన చర్యలపై చర్చిస్తారు. 2014 నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు చేసిన ఘనత, సీమలో ఓ వైపు సాగునీటి ప్రాజెక్టులతో పాటూ, మరోవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేసిన విధానం, కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్ పవర్, సోలార్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలను మహానాడు వేదిక నుండి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ఏవైతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో.. వాటన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా ఫీడ్ బ్యాక్ సేకరణకు మహానాడు సిద్ధమౌతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తుండటం, దీపం పథకం-2 ద్వారా కోటి మంది మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుండటం, అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం, రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకురావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని నేతలు వివరించనున్నారు. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ వంటి అంశాలన్నింటిపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు మేనిఫెస్టో హామీల అమలుపైనా రెండో రోజు మహానాడులో చర్చించనున్నారు.