Maganti Wife in By Poll: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనన్నారు. ఈక్రమంలో పార్టీలన్ని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు ప్రకటించింది. ఉప ఎన్నికపై తెలంగాణ భవన్‌లో ఇవాళ కార్యకర్తల సమావేశం పెట్టిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. సునీతను గెలిపించడమే మాగంటి గోపీనాథ్‌కు ఇచ్చే అసలైన నివాళి అన్నారు. అలానే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు నిర్వహించామని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బాగున్నట్లని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇంత వరకూ బాగానే ఉంది. అయితే మాగంటి సునీతని ఎందుకు గెలిపించాలో కూడా వివరిస్తూ కేటీఆర్ చెప్పిన కొన్ని మాటలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మాగంటి సీనియర్ ఎమ్మెల్యేగా చేసినా.. ఆర్థికంగా ఆయన పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు కేటీఆర్. మాగంటి పిల్లలు కూడా ఇంకా సెటిల్ అవ్వలేదని, ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలంటే ఒకే ఒక్క మార్గం… ఆ కుటుంబం నుండి సునీతని ఎమ్మెల్యేగా గెలిపించడం అనేలా మాట్లాడారు కేటీఆర్. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మనకే ఎడ్జ్ ఉందంటూ ఏవో సర్వేలు చూపించినా.. ప్రతిపక్షంలో ఉన్న తాము.. అధికారంతో పాటూ, అస్త్ర శస్త్రాలు ఉన్న కాంగ్రెస్‌ని ఢీకొని జూబ్లీహిల్స్‌లో గెలవడం ఏమాత్రం సులభం కాదని కేటీఆర్‌కు బాగా తెలుసు. అక్కడ బీఆర్‌ఎస్ ఉన్న ఒకే ఒక్క బలమైన అస్త్రం మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్. ఆయన మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కావడంతో.. ప్రజలు సెంటిమెంట్ పరంగా ఆ ఫ్యామిలీని ఆదరిస్తే.. మాగంటి సునీత ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. అందుకే సెంటిమెంట్ అస్త్రాన్ని తట్టి లేపారు కేటీఆర్. ఆ క్రమంలో ఆర్థికంగా మాగంటి కుటుంబాన్ని ఆదుకోడానికి… ఎమ్మెల్యే పదవి ఒక్కటే మార్గమన్న అర్థమొచ్చేలా కేటీఆర్ పేర్కొనడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. అంటే డబ్బు సంపాదనకు, ఆర్థికంగా ఎదిగేందుకే ఎమ్మెల్యే పదవులా అన్న చర్చ జరుగుతోంది.
మరో కోణంలో చూస్తే… ఆర్థికంగా మాగంటి కుటుంబ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతూనే… తిరిగి ఆ కుటుంబానికే టికెట్ ఇవ్వడం అంటే… బీఆర్‌ఎస్ ఆ ఫ్యామిలీకి మేలు చేస్తున్నట్లా? మరింత నష్టం చేస్తున్నట్లా అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ తరఫున ఆశావహుల లిస్టు చూస్తే… జూబ్లీ హిల్స్ సీటుపై ఆ పార్టీలో ఎంత క్రేజ్ ఉందో అర్థమౌతోంది. కోట్లు ఖర్చు చేసైనా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలని కాంగ్రెస్ ఆశావహులు కాచుకుని కూర్చున్నారు. ఎంత లేదన్నా 100 కోట్ల ఎన్నికగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టుకుని మాగంటి కుటుంబం ఇక్కడ గెలవగలదా? అన్న అనుమానం ఉంది. మాగంటి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక… ఖర్చు మొత్తం బీఆర్‌ఎస్ పార్టీనే పెట్టుకుంటుందా? లేక.. మాగంటి ఫ్యామిలీనే ఎలక్షన్ భారం మీదేసుకుంటే.. తీరా అక్కడ గెలవలేని పరిస్థితి ఎదురైతే.. ఆ కుటుంబం ఆర్థికంగా మరింత చితికిపోదా అన్న వాదన తెరపైకి వస్తోంది. చూడాలి మరి… ఫలితం ఎలా ఉంటుందో… జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ పార్టీని ముంచి, ఏ పార్టీని తేలుస్తారో…!