Lokesh Tour Effect ATP: 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో 164 ఎమ్మెల్యే సీట్లతో చరిత్ర సృష్టించింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. రాయలసీమలో వైసీపీ 52 స్థానాల్లో పోటీ చేసి కేవలం 7 సీట్లు గెలిచింది, టీడీపీ అత్యధిక స్థానాలతో ఆధిపత్యం చెలాయించింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేకపోగా, టీడీపీ 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నికల తర్వాత ఏడాది గడుస్తున్న నేపథ్యంలో, టీడీపీ యువనేత నారా లోకేష్ రాయలసీమలో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో పార్టీ స్థితిగతులు, ఎమ్మెల్యేల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. గుంతకల్, సింగనమల, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, మండల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
లోకేష్ ఫోకస్‌లో ఉన్న మొట్టమొదటి నియోజకవర్గం గుంతకల్. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి 2024లో ఇక్కడ గెలిచారు. అయితే, ఆయన వ్యవహార శైలిపై కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ నిర్వీర్యమైన నేపథ్యంలో, స్థానిక ఎన్నికల ముందు పార్టీ ఐక్యత కోసం లోకేష్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. రెండోది సింగనమల. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి గెలిచినప్పటికీ, వర్గపోరు తగ్గలేదు. తెలుగు తమ్ముళ్లు, టూ మెన్ కమిటీ మధ్య విమర్శలు, ఫిర్యాదులతో పార్టీ బలోపేతం కుంటు పడింది.
Also Read: Pawan Target Peddi Reddy: పవన్ యాక్షన్‌కు పెద్దిరెడ్డి ఫ్యాక్షన్ తలొగ్గుతుందా?
Lokesh Tour Effect ATP: సింగనమలలో వర్గపోరుకు చెక్ పెట్టే ప్రణాళికలు రచిస్తున్న లోకేష్.. తన మూడ్రోజుల పర్యటనలో నిర్వహించబోయే సమావేశంలో సింగనమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారట. ఇక మూడోది అనంతపురం అర్బన్. వైసీపీ పట్టు కోల్పోయిన ఈ నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, నాయకుల అసంతృప్తి, అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నార్థకంగా మార్చేశాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ సీటు గెలవాలంటే క్యాడర్ ఐక్యత కీలకం. లోకేష్ ఈ సమావేశంతో నాయకులను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెన్యూ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, జెఎన్‌టీయూ స్నాతకోత్సవంతో పాటు, పార్టీ బలోపేతం కోసం లోకేష్… గ్రౌండ్ లెవెల్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, లోకేష్ తీసుకునే నిర్ణయాలు పార్టీలో సంచలనంగా మారనున్నాయి. ఈ పర్యటన తర్వాత నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? సమావేశంలో ఎమ్మెల్యేలకు లోకేష్ క్లాస్ పీకుతాడా? 2024 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.