Lokesh: భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కురబలు తమ ఆరాధ్యదైవం అయిన కనకదాసును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో ఉన్న కనక పీఠం ఎంతో శక్తివంతమైందని భావిస్తారు. 538 సంవత్సరాల క్రితం కురుబ కులంలో జన్మించిన కనకదాసు తన కీర్తనలతో కలికాలంలో ప్రత్యక్ష దైవంగా దర్శనమిచ్చారు. కురబల ఇల వేల్పు అయ్యారు. రాయలసీమ జిల్లాలో కురుబలు బీసీలలో భాగంగా ఉన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును తమ రాజకీయ గురువుగా భావిస్తారు కురుబలు. 1983లో టిడిపి తరపున కురుబ కమ్యూనిటీ నుండి రామచంద్రరెడ్డి పెనుగొండలో పోటీ చేసి మంత్రిగా పనిచేశారు. అలా ఆనాటి నుండి నేటి వరకూ వెనుకబాటు వర్గంగా ఉన్న కురుబ కులస్తులను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పాలి. గత ఎన్నికల్లో హిందూపురం, కర్నూలు పార్లమెంటు సీట్లతో పాటు పెనుగొండ ఎమ్మెల్యే టికెట్లను కురుబ కులస్తులకు కేటాయించారు. ఇద్దరు ఎంపీలతో పాటూ రాష్ట్ర క్యాబినెట్ హోదాలో పెనుగొండ ఎమ్మెల్యే సవితకు ప్రాతినిధ్యం కల్పించారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా? బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి..
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కులస్తులను గుర్తించిన మొట్టమొదటి పార్టీగా టీడీపీ నిలిచింది. ఈ క్రమంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కురుబలకు అనేక హామీలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నేడు కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి స్పెషల్ జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొన్నారు నారా లోకేష్. గత ప్రభుత్వాలు బీసీలైన కురబల్ని గుర్తించిన దాఖలాలు లేవు. కనకదాసు జయంతిని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జరపడం కురబ కులస్తులు అసలు ఊహించలేదు. అంతేకాదు.. కురుబ కులస్తుల గుడికట్లకు ధూప దీప నైవేద్యాలతో పాటు, గజ్జకట్టి ఢమరుకం మోగిస్తూ దర్శనమిచ్చే గురవయ్య వృత్తిలో ఉన్నవారికి 5 వేల రూపాయల గౌరవ వేతనం హామీ ఇచ్చారు. దీంతో తిరుమలలో కనకదాస భవనం కోసం స్థలం కేటాయించాలని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కనకదాస భవనముకు స్థలం కేటాయించాలంటూ కురుబ కులస్తులుగా స్వయంగా తానే సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వీటన్నింటిపై కూడా లోకేష్ కసరత్తు చేస్తున్నారు.
కనకదాసు జయంతి కళ్యాణదుర్గంలో గ్రాండ్ సక్సెస్ అవడానికి స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మంత్రి సవిత, బి.కె.పార్థసారథిలు ప్రముఖంగా వ్యవహరించారు. ఇక యువనేత నారా లోకేష్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కురుబ కులస్తులపై ఉన్న అభిమానంతో, వారి సెంటిమెంట్‌ని గుర్తించి, కనకదాసు జయంతి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొన్నారు. దీంతో కురబలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
