Lokesh In War Room

Lokesh In War Room: ప్రజల కష్టాలే ముఖ్యం.. ఇలాంటి నాయకత్వం ఏపీ అదృష్టం!

Lokesh In War Room: బుధవారం ఉదయం నుంచి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లోనే మకాం వేశారు మంత్రి నారా లోకేష్. అంతర్గత సంక్షోభంతో అల్లాడుతున్న నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారితో స్వయంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని జాగ్రత్తలు చెప్పారు. సమాంతరంగా ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర పెద్దలతోనూ చర్చలు జరుపుతున్నారు. బాధితులని స్పెషల్‌ ఫ్లైట్లలో ఏపీకి తీసుకువచ్చేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌కు వెళ్లారు నారా లోకేష్. రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ బాధ్యతను వేరే నేతలకు, మంత్రులకు అప్పగించకుండా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం విశేషం.

మంత్రి నారా లోకేష్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన పనితీరులో సమూల మార్పులు వచ్చాయి. రాష్ట్ర మంత్రిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తేగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా పార్టీని ఒంటి చేత్తో నడపగలుగుతున్నారు. చంద్రబాబు పూర్తిగా పాలనపై పూర్తి దృష్టి పెడుతుండగా.. మిగతా వ్యవహారాలను అన్నీ తానై చూస్తున్నారు లోకేష్. ఈ క్రమంలోనే మరోసారి డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్. కూటమి ప్రతిష్టాత్మకంగా అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను రప్పించే బాధ్యతను తీసుకున్నారు. అయితే ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నారా లోకేష్ సూపర్‌ సిక్స్‌ సభకు దూరంగా ఉండటం మాత్రం చిన్న విషయం కాదు.

Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. వికారాబాద్‌-కృష్ణా కొత్త రైల్వే లైన్‌..!

కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. అభివృద్ధితో పాటూ సంక్షేమంలోనూ తగ్గేదే లేదంటూ ప్రభుత్వం ముందుకెళ్తోంది. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకూ ఆరోగ్య భీమా.. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయగలిగింది కూటమి ప్రభుత్వం. 15 నెలల కూటమిపాలన సక్సెస్ కావడంతో అనంతపురం వేదికగా భారీ కార్యక్రమానికి సంకల్పించింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది పూర్తిగా రాజకీయ కార్యక్రమం. చేస్తున్న అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్ని పొలిటికల్‌గా క్యాష్‌ చేసుకోవాలన్నదే ఈ సభ ప్రధాన లక్ష్యం. అయినప్పటికీ లోకేష్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌లోనే ఉంటూ నేపాల్‌లో తెలుగువారి క్షేమం కోసం, వారికి తిరిగి క్షేమంగా ఏపీకి రప్పించడం కోసం తలమునకలయ్యారు. అంటే రాజకీయ స్వలాభాన్ని వదులుకుని, ఒక నాయకుడిలా ప్రజల కోసం మాత్రమే ఆలోచించారు లోకేష్‌. ఈ స్ఫూర్తి లోకేష్‌ ఒక్కడిలోనే కనిపించలేదు. అనంత సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు కూడా ఇదే పంథా అనుసరించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మూడే నిమిషాల్లో ప్రసంగం ముగించారు. చంద్రబాబు కూడా తన సహజ ధోరణికి విరుద్ధంగా క్లుప్తంగా చెప్పదలుచుకున్న అంశాలకే పరిమితం అయ్యారు. అదివరకే నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జనసేన ఎంపీ బాలశౌరికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురు కూటమి నేతలు ప్రదర్శించిన నాయకత్వ స్ఫూర్తి.. రాజకీయాల కన్నా ప్రజల మేలు, బాగోగులే తమకు ముఖ్యం అన్న సంకేతాలను ప్రజా బాహుళ్యంలోకి పంపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *