Lokesh CM Candidate: తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన రాజకీయ శక్తి. 43 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక విజయాలు సాధించింది. ఇప్పుడు, కొత్త తరం నాయకత్వానికి సిద్ధమవుతోంది. ఆ సారథి నారా లోకేష్! ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన లోకేష్, 2019లో మంగళగిరిలో ఓటమి ఎదుర్కొన్నా, ఆ సవాలును స్ఫూర్తిగా తీసుకున్నారు. ఓటమి కారణాలను శోధించి, మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరకపోవడానికి గల అసలు కారణాలను అన్వేషించాడు. ఇక.. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంది. నాయకులపై కేసులు, అరెస్టులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, వైసీపీ మూకల అరాచకాలు టీడీపీని కుదేలు చేశాయి.
ఈ విపత్కర సమయంలో లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. 226 రోజులు, 3,100 కిలోమీటర్లు, 11 ఉమ్మడి జిల్లాల్లో 100 నియోజకవర్గాలను కవర్ చేసిన ఈ పాదయాత్ర, లోకేష్‌ను జననాయకుడిగా మలిచింది. పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపి, వైసీపీ అరాచకాలపై పోరాట జెండా ఎగురవేశారు లోకేష్. చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పుడు, వైసీపీ టీడీపీని నిర్వీర్యం చేయడానికి సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది. ఈ సంక్షోభంలో లోకేష్ కుటుంబానికి, పార్టీకి దిట్టమైన దిక్సూచిగా నిలిచాడు. జనసేనతో కలుపుకుని కూటమిని బలోపేతం చేస్తూ, ఢిల్లీలో రాజకీయ కుట్రలను భగ్నం చేసి, తండ్రిని బయటకు తీసుకొచ్చారు లోకేష్. 2024 ఎన్నికల్లో మంగళగిరిలో 90,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు.
Also Read: Covid-19: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు, ఎక్కడంటే?
Lokesh CM Candidate: ‘రెడ్ బుక్’తో వైసీపీ అవినీతిని, అరాచకాలను బట్టబయలు చేసిన లోకేష్, క్యాడర్‌కు న్యాయం, తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం, తండ్రికి జరిగిన అన్యాయానికి సమాధానంగా రాజకీయ దిశానిర్దేశమై నిలిచారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, లోకేష్ ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతపురంలో రూ.22,000 కోట్ల రీన్యూ రిన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. తద్వారా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టికి కట్టుబడ్డానని సంకేతమిచ్చారు. ఏడాదిలో.. 91 పెద్ద కంపెనీలను ఆకర్షించి, ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల సృష్టికి పునాది వేశాడు.
ఈనెల 27 నుండి 29 వరకు, కడపలో జరిగే టీడీపీ మహానాడులో లోకేష్ పదవోన్నతిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. యువ క్యాడర్, నాయకులు లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చూడాలని కోరుతున్నారు. కొందరు ఆయనను భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ మహానాడులో లోకేష్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. తన ‘యువగళం’ ద్వారా జనం గుండెల్లో చోటు సంపాదించిన లోకేష్, టీడీపీ భవిష్యత్తును రూపొందించే సారథిగా సిద్ధమవుతున్నాడు.